Photos: Instagram
మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. వారి ప్రేరణతోనే మనలోని బలహీనతల్ని అధిగమిస్తుంటాం. అలా అందాల తార ప్రియాంక చోప్రా స్ఫూర్తితో తనలోని బిడియాన్ని అధిగమించానని చెబుతోంది తాజాగా ‘మిస్ ఇండియా - 2020’గా అవతరించిన మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఆమె.. తెలంగాణ తరఫున మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న ప్రపంచ సుందరి పోటీల్లో ఇండియా తరఫున పాల్గొననుందీ బ్యూటీ. సాధించాలన్న తపన ఉండాలే గానీ మనలోని బలహీనతల్ని అధిగమించచ్చంటోన్న ఈ అందాల తార గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..
చిన్నతనంలో కొంతమంది పిల్లలు ఎంతో చలాకీగా, నలుగురితో ఇట్టే కలిసిపోయేలా ఉంటే.. మరికొంతమంది సిగ్గు, బిడియంతో ఇతరులతో కలవడానికి ఇష్టపడరు. తాను కూడా ఇలాగే పెరిగానంటోంది తాజాగా మిస్ ఇండియా - 2020గా అవతరించిన మానస వారణాసి. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన ఈ చక్కనమ్మ తెలంగాణ తరఫున మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ముంబయి వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మాన్యా ఓంప్రకాశ్ సింగ్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. కాగా, హరియాణా అమ్మాయి మనికా షియోకంద్ ‘మిస్ గ్రాండ్ ఇండియా’ కిరీటం గెలుచుకుంది. ఈ గెలుపుతో ఈ ఏడాది డిసెంబర్లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలకు ఇండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుందీ ముద్దుగుమ్మ.
జిజ్ఞాసతోనే వాటిని అధిగమించా!
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన మానస గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేసింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తిచేసిన ఆమె.. ఓ ఫైనాన్షియల్ సంస్థలో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎంక్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేస్తోంది. చిన్ననాటి నుంచి సిగ్గరిగా పెరిగిన తాను.. తెలుసుకోవాలన్న జిజ్ఞాసతోనే తనలోని భయాలను అధిగమించానని చెబుతోంది. ‘చిన్నతనం నుంచి సిగ్గరిగా పెరిగిన నేను.. జిజ్ఞాస, తపనను నా బెస్ట్ ఫ్రెండ్స్‌గా భావించా. ఇవే పెరిగి పెద్దయ్యే క్రమంలో నాలోని భయాలను పోగొట్టాయి. టీనేజర్‌గా ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి నన్ను బయటపడేశాయి.. అతిగా ఆలోచిస్తూ మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలోనూ ఇవే నన్ను తిరిగి మామూలు మనిషిని చేసేవి.. మానసికంగా మరింత దృఢంగా మార్చేవి..’ అంటూ తనలోని బలహీనతల్ని అధిగమించిన విధానం గురించి చెబుతోందీ మిస్ ఇండియా.
ఆమే నాకు స్ఫూర్తి!
ప్రతి ఒక్కరి జీవితంలో స్ఫూర్తిని నింపిన వ్యక్తులున్నట్లే.. తన జీవితంలోనూ అలాంటి వ్యక్తులెవరైనా ఉన్నారా అని అడిగితే.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పేరు చెబుతోంది మానస. ‘అందగత్తెలందరిలోకెల్లా ప్రియాంక చోప్రా అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే తనను తాను నిరూపించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటుందామె. ఎల్లల్ని చెరిపేస్తూ ముందుకు దూసుకెళ్తుంటుంది. సంగీతం, సినిమాలు, వ్యాపారం, సామాజిక సేవ.. ఇలా ఇప్పటికే ఎన్నెన్నో అంశాల్లో తనదైన ముద్ర వేసింది ప్రియాంక. చిన్నతనం నుంచి సిగ్గు, బిడియంతో పెరిగిన నన్ను.. ఆమెలోని నిక్కచ్చిగా మాట్లాడే తత్వం, ఏ విషయంలోనైనా ధైర్యంగా తన అభిప్రాయాల్ని వెల్లడించే నైజం, బహుముఖ ప్రజ్ఞ, ధైర్యం.. వంటివన్నీ ప్రేరేపించాయి. నాలోని బిడియాన్ని దూరం చేసి నన్ను నేను నిరూపించుకునేందుకు తగిన స్ఫూర్తిని నాలో నింపాయి.. తనతో పాటు అమ్మ, బామ్మ, సోదరి ప్రోత్సాహం కూడా నన్ను ఇంతదాకా నడిపించింది..’ అంటూ తన జీవితంలో ఉన్న స్ఫూర్తిదాయక వ్యక్తుల గురించి చెప్పుకొచ్చిందీ బ్యూటీ క్వీన్.
నా గురించి మరికొన్ని..!
* ఈ 23 ఏళ్ల మిస్ ఇండియాకు పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, డ్యాన్స్ (భరతనాట్యంలో పట్టుంది), యోగా చేయడం, ప్రకృతితో గడపడం.. అంటే మహా ఇష్టమట!
* సంగీతం, భరతనాట్యం వంటి కళారూపాలు తనలో ధైర్యం, జిజ్ఞాస వంటి ఎన్నో లక్షణాలు అలవర్చాయని చెబుతోందీ చక్కనమ్మ.
* ఇక స్వయానా హైదరాబాదీ అయిన ఈ ముద్దుగుమ్మకు హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రాణమని, అంతకంటే ఎక్కువగా అమ్మమ్మ చేసే పెసరట్టు, పులిహోర ఉంటే మరేవీ అక్కర్లేదంటోంది.
* ఉదయం లేచీలేవగానే గోరువెచ్చటి నీళ్లు తాగుతానని, అదే తన సౌందర్య రహస్యమంటూ తన బ్యూటీ సీక్రెట్‌ని బయటపెట్టిందీ సొగసరి.
* ‘తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండగను నేను అస్సలు మిస్సవను. ఇక అర్ధరాత్రి కూడా పట్టపగటిని తలపించేలా జరుపుకునే రంజాన్ రాత్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం.. భాషలన్నీ కలగలిసిన ఈ గడ్డపై పుట్టడం నా అదృష్టం..’ అంటూ తన మాతృభూమిపై తనకున్న ఇష్టం గురించి చెప్పుకొచ్చింది మానస.
సాధించాలన్న తపన ఉండాలే కానీ జీవితంలో ఎలాంటి బలహీనతలనైనా అధిగమించచ్చనడానికి తననే ఉదాహరణగా చెబుతోన్న ఈ క్యూట్ బ్యూటీకి మనమూ శుభాకాంక్షలు చెబుదాం..! అలాగే ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా గ్యాలరీలోని కొన్ని బ్యూటిఫుల్ పిక్స్‌పై ఓ లుక్కేద్దాం..!
కంగ్రాట్స్ మానస!