నవంబర్ 4, 2018.. విశాఖపట్నం జిల్లా రేవు పోలవరం బీచ్.. సుమారు 20 మందికి పైగా స్కూల్ పిల్లలు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఆటలాడుకుంటున్నారు. అంతలో ఊహించని ప్రమాదం. ఆడుకుంటున్న పిల్లల్లో ఇద్దరు సముద్రపు నీటిలో కొట్టుకుపోయారు. కాపాడండని బిగ్గరగా కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న 16 ఏళ్ల బాలిక వాళ్లని చూసింది. ఒక్క ఉదుటన ఎగిసిపడుతున్న అలల్లోకి దూకింది. క్షణాల్లో చిన్నారుల దగ్గరకు చేరుకుంది. ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్న ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరిని తన భుజంపై, మరొకరిని గట్టిగా పట్టుకుని ఒడ్డుకు చేరుకుంది. తన ప్రాణం గురించి క్షణం ఆలోచించకుండా సముద్రపు కెరటాలకు ఎదురెళ్లి మరీ ఇద్దరు చిన్నారులను కాపాడిన ఆ అమ్మాయే విశాఖ జిల్లాకు చెందిన కలగర్ల సాహితి. ఆ సాహసమే ఈ బాలికను ప్రతిష్ఠాత్మక ‘ఉత్తమ జీవన్ రక్ష’ పురస్కారానికి ఎంపికయ్యేలా చేసింది.
అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి ఆపదలో ఉన్న వారిని కాపాడిన 40 మందికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్టపతి జీవన్ రక్ష పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది. సర్వోత్తమ జీవన్ రక్ష, ఉత్తమ జీవన్ రక్ష, జీవన్ రక్ష అనే మూడు విభాగాల్లో ఈ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం జిల్లా కొత్తకోట గ్రామానికి చెందిన సాహితి ‘ఉత్తమ జీవన్ రక్షా పతక్’ పురస్కారానికి ఎంపికైంది.
సముద్ర కెరటాలకు ఎదురెళ్లి!
నర్సీపట్నం సమీపంలోని కొత్తకోట గ్రామానికి చెందిన సాహితి ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఆమె తండ్రి సర్వేశ్వరరావు వ్యాపారి కాగా, తల్లి నాగజ్యోతి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ఇక తల్లి ప్రోత్సాహంతో చిన్నతనం నుంచి స్విమ్మింగ్‌లో ఎంతో నైపుణ్యం సాధించింది సాహితి. తన ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో పతకాలు, పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది. ప్రత్యేకించి నీటిపై తేలుతూ చేసే యోగాలో ఎంతో నైపుణ్యం సాధించిందీ బ్రేవ్ గర్ల్. ఈ నేపథ్యంలో 2018 నవంబర్ 4న తన తల్లిదండ్రులతో కలిసి రేవు పోలవరం బీచ్‌కు విహారయాత్రకు వెళ్లింది సాహితి. సముద్ర తీరంలో అందరూ ఆడుకుంటున్న సమయంలో ఒక పెద్ద కెరటం రావడంతో కొత్తకోటకు చెందిన భార్గవి, తిరుమలేశ్ కొట్టుకుపోయారు. దీన్ని గమనించిన సాహితి సముద్ర కెరటాలు ఆ పిల్లలను మింగేయకుండా కాపాడింది. తాజాగా ఆమె సాహసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనను ‘ఉత్తమ జీవన్ రక్షా పతక్’ పురస్కారానికి ఎంపిక చేసింది.
అమ్మనాన్నల ప్రోత్సాహంతోనే!
ఈ సందర్భంగా తనకు ఈ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేసింది సాహితి. ‘అమ్మానాన్నలతో కలిసి రెండేళ్ల క్రితం రేవు పోలవరం బీచ్‌కు పిక్నిక్కు వెళ్లాను. కొద్ది సేపయ్యాక ఒక స్కూల్ బ్యాచ్ అక్కడికి వచ్చింది. అయితే అందులో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ మునిగిపోయారు. నాకు ఈత బాగా రావడంతో నేను త్వరగా ఆ పిల్లలను కాపాడి ఒడ్డుకు తీసుకురాగలిగాను. నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో యోగా చేస్తున్నాను. స్విమ్మింగ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి నీటిపై తేలుతూ ఒక రోజంతా ఉండే సామర్థ్యం నాకుంది. ఇప్పటివరకు స్విమ్మింగ్‌లో నాకు 25 పతకాలు, అవార్డులు వచ్చాయి. ఇదంతా మా అమ్మానాన్నాల ప్రోత్సాహంతోనే సాధ్యమైంది’ అని అంటోందీ బ్రేవ్ గర్ల్.
ఈ సందర్భంగా సాహితి లాంటి విద్యార్థి తమ కాలేజీలో చదవడం గర్వంగా ఉందని ఆ కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నడిపించిన నాన్నకు సైకిల్‌పై కూర్చొబెట్టుకుని!
ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు ఆటలు, సమాజ సేవ, ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తోన్న చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ‘రాష్ర్టీయ బాల్ పురస్కార్’ అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా మొత్తం 32 మంది చిన్నారులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఈక్రమంలో లాక్డౌన్లో సైకిల్‌పై తండ్రిని ఎక్కించుకుని 1200 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంతో స్వగ్రామానికి చేరుకున్న జ్యోతి కుమారిని ప్రతిష్ఠాత్మక ‘ప్రధాన్‌మంత్రి రాష్ర్టీయ బాల్ పురస్కార్’ వరించింది.
దిల్లీలో రిక్షా నడిపే జ్యోతి తండ్రి పాశ్వాన్ ప్రమాదానికి గురవడంతో ఇంటి అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ఇంటి యజమానులు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే ఎలాగైనా తమ స్వగ్రామానికి వెళ్లిపోదామని తండ్రికి ధైర్యం చెప్పిన జ్యోతి ఆయనను సైకిల్‌పై కూర్చోబెట్టుకుని హరియాణాలోని సింగ్వారాకు తీసుకొచ్చింది. అలా తండ్రితో కలిసి సుమారు 1200 కిలోమీటర్ల ప్రయాణం చేసిన జ్యోతిపై ఇవాంక ట్రంప్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఆమె సాహసాన్ని గుర్తించిన కేంద్రం తనను ‘ప్రధాన్‌మంత్రి రాష్ర్టీయ బాల్ పురస్కార్’కు ఎంపిక చేసింది. ఈ సంద్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ వేదికగా జ్యోతిని ప్రశంసించారు.