Photos: Twitter
సాధారణంగా ఇంట్లో ఒక కూతురు/కొడుకు ఉంటే ఎంతో గారాబం చేస్తాం.. వారిని కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా చూసుకుంటాం. వారేదైనా సాహసం చేస్తామంటే వారికేమవుతుందోనన్న భయంతో అస్సలు ఒప్పుకోం. కొంతమంది తల్లిదండ్రులైతే మరీ భయపడిపోయి ఏడ్చేస్తుంటారు కూడా! తాను పైలట్ అవుతానని చెప్పినప్పుడు తన తల్లి కూడా ఇలాగే బాధపడిందంటోంది ఎయిర్ ఇండియా పైలట్ కెప్టెన్ జోయా అగర్వాల్.
తాజాగా ఐదుగురు మహిళా పైలట్ల బృందం ఉత్తర ధ్రువం మీదుగా అత్యంత సుదూర వైమానిక మార్గంలో విమానం నడిపి సరికొత్త అధ్యాయానికి తెరతీసిన విషయం తెలిసిందే! ఆ బృందానికి నాయకత్వం వహించిన జోయా తమ ప్రయాణం విజయవంతమైనందుకు ఎంత సంతోషంగా ఉందో, ఇంతటి అరుదైన అవకాశం తమకు దక్కడం అంతకంటే గర్వంగా ఉందంటోంది. మహిళలు తలచుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదని, ఈ క్రమంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదంటోన్న జోయా తన గురించి, తన అరుదైన విమాన యానం గురించి పలు విషయాలు పంచుకుంది.
మా అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే సంతానం. దాంతో ఎంతో అల్లారుముద్దుగా పెరిగా. సాధారణంగా ఒక కూతురు/కొడుకు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని అపురూపంగా చూసుకున్నట్లే నా పేరెంట్స్ కూడా నా విషయంలో ఎంతో కేరింగ్‌గా ఉంటారు. అయితే నాకేమో సాహసాలు చేయడమంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఈ క్రమంలోనే పెద్దయ్యాక పైలట్ కావాలని చిన్నతనం నుంచి కలలు కనేదాన్ని. ఇదే విషయాన్ని ఓ రోజు అమ్మకి చెబితే భయపడింది. నాకేమవుతుందోనని ఒక్కసారిగా ఏడ్చేసింది. అలాగని నా నిర్ణయానికి అమ్మ అడ్డు చెప్పలేదు.. కొన్నాళ్లకు తనే నా లక్ష్యాన్ని, తపనను అర్థం చేసుకొని నన్ను ప్రోత్సహించడం మొదలుపెట్టింది.
నన్ను చిన్న పిల్లలా చూసేవారు!
అలా ఎయిర్ ఇండియాలో పైలట్‌గా చేరడంతో నా చిన్ననాటి కల నెరవేరింది. అయితే మొదట నేను పైలట్‌గా చేరినప్పుడు ఇక్కడ చాలా తక్కువమంది మహిళా పైలట్లు ఉండేవారు. అందరూ నన్ను చిన్న పిల్లలా చూసేవారు.. ఇక్కడ పురుషాధిక్యం ఉన్నా కూడా ఎంతగానో ప్రోత్సహించేవారు. ‘ఇది చాలా బాధ్యతాయుతమైన ఉద్యోగం.. ఒక మహిళా పైలట్‌గా కాకుండా పైలట్‌గా కష్టపడితే ఆకాశమే హద్దుగా ఎదగచ్చు..’ అంటూ వాళ్లు చెప్పిన మాటలు నన్నెంతో ప్రేరేపించాయి. నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచాయి. ఇక నాకు పైలట్ నుంచి కెప్టెన్‌గా ప్రమోషన్ వచ్చినప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి. ఒకప్పుడు ఈ రంగంలో చేరతానంటే బాధతో నిండిన ఆమె కళ్లలో ఈసారి నాకు ధైర్యం కనిపించింది.
ఆ ఫీలింగ్ వర్ణనాతీతం!
ఇక ఇప్పుడు మా మహిళా బృందం సాధించిన ఈ ఘనత చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్న విషయం తలచుకుంటుంటే ఒళ్లు పులకరించిపోతుంది. నిజానికి అమెరికా సిలికాన్ వ్యాలీ (శాన్ఫ్రాన్సిస్కో) నుంచి ఇండియా సిలికాన్ వ్యాలీ (బెంగళూరు) దాకా ఉత్తర ధ్రువం మీదుగా విమానం నడపాలని గతేడాదే ప్లాన్ చేసుకున్నాం. కానీ అప్పుడు వాతావరణ పరిస్థితులు అనుకూలించక ఇది కుదర్లేదు. ఇక ఉత్తర ధ్రువం మీదుగా ఇలాంటి సుదూర విమాన ప్రయాణం సాగడం ఇది తొలిసారేమీ కాదు.. కానీ ఒక మహిళా బృందం ఈ ఘన కీర్తిని నమోదు చేయడం మాత్రం ఇదే మొదటిసారి..! ఇదివరకు అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాల మీదుగా ఎన్నో విమానాలు నడిపాం.. కానీ ఈ అనుభవం మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆకాశం నుంచి ఉత్తర ధ్రువాన్ని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ మాటల్లో చెప్పలేను. సుమారు 16 వేల కిలోమీటర్ల దూరాన్ని 17 గంటల్లో 10 టన్నుల ఇంధనంతో పూర్తి చేశాం.. 238 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా స్వదేశానికి చేర్చాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాతో పాటు కెప్టెన్ తన్మయి పాపగరి, కెప్టెన్ ఆకాంక్ష సోనావారే, కెప్టెన్ శివానీ మన్హాస్ భాగమయ్యారు. కెప్టెన్ నివేదితా భాసిన్ విమాన రక్షణ బాధ్యతల్ని నిర్వర్తించారు.
ఇక విమానయాన రంగంలోకి రావాలని కలలు కంటోన్న అమ్మాయిలందరికీ నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. మహిళలు తలచుకుంటే అసాధ్యమనేదే ఉండదు.. సాధించాలన్న తపన, పట్టుదల ఉంటే వారు తమ గమ్యాన్ని చేరుకునే క్రమంలో వారిని ఏ శక్తీ అడ్డుకోలేదు.. అలాంటి సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరినప్పుడు కలిగే ఆనందం ముందు అన్నీ దిగదుడుపే!