Image for Representation
‘నేటి బాలలే రేపటి పౌరులు’, ‘దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’.. అన్న మాటలను ఆ యువతి బాగా విశ్వసించింది. పేదరికం కారణంగా పిల్లలు చదువుకు దూరం కాకూడదనుకుంది. అందుకే 40 మంది గిరిజన విద్యార్థులను చేరదీసి ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పుతోంది. సరైన సదుపాయాలు, వసతులు లేకున్నా చెట్టు కిందనే వారికి అక్షర జ్ఞానం అందిస్తోంది. ఇంతకీ ఎవరా యువతి? పేద విద్యార్థుల చదువు పట్ల ఆమెకు ఎందుకంత ఆసక్తి కలిగిందో తెలుసుకుందాం రండి...
చెట్ల కిందనే చదువులు!
గతేడాది చివరిలో ప్రపంచంపైకి దండెత్తిన కరోనా ఇంకా కనికరించడం లేదు. సెకండ్, థర్డ్ వేవ్ అంటూ ఇంకా అందరినీ ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, కార్యాలయాలు తెరుచుకున్నా చాలాచోట్ల ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభం కాలేదు. దీంతో చదువులో వెనకబడకూడదని చాలామంది విద్యార్థులు ఆన్లైన్ బాట పడుతున్నారు. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ సహాయంతో ఇంటి నుంచే ఆన్లైన్ పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈక్రమంలో కరోనాను కాదని గిరిజన పిల్లలకు ఉచితంగా పాఠాలు బోధిస్తోంది ఒడిశాకు చెందిన మాన్షి సత్పతి అనే యువతి. భువనేశ్వర్‌లోని రసూల్ఘర్ నాలాబస్తీలో నివాసముంటోన్న గిరిజన పిల్లల దగ్గరకు వెళ్లి మరీ విద్యాబుద్ధు్లు నేర్పుతోందీ టీచరమ్మ. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకున్నా అందుబాటులో ఉన్న వనరులతోనే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
అందుకే వాళ్ల దగ్గరికే వెళ్తున్నాను!
గిరిజన కుటుంబాల్లో రోజువారీ కూలీలే అధికంగా ఉంటారు. కడుపు నింపుకోవడానికే అష్టకష్టాలు పడుతుంటారు. అందుకే పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్కడికే వెళ్లి పాఠాలు చెబుతోంది మాన్షి. ‘ఇదొక మురికివాడ. ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రులందరూ రోజువారీ కూలీలే. ప్రభుత్వాలు వీరి కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి. కానీ వీళ్లు తాము ఉన్న స్థలాన్ని విడిచి పెట్టాలనుకోవడం లేదు. అందుకే వాళ్ల దగ్గరికే వెళ్లి విద్యాబుద్ధులు నేర్పితే బాగుంటుందని అనుకున్నాను. ప్రస్తుతానికి నా దగ్గర 40 మంది విద్యార్థులు ఉన్నారు. అందరికీ చెట్ల కిందనే పాఠాలు బోధిస్తాను. ఒక సంవత్సర కాలంగా వాళ్లు ఇంగ్లిష్, ఒరియా, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్.. తదితర సబ్జెక్టులు నేర్చుకుంటున్నారు. వారిలో చాలామందికి సంగీతం, డ్యాన్స్, చిత్రలేఖనం...తదితర కళలపై ఆసక్తి ఉంది. అందుకే విద్యార్థుల్లో మానసికోల్లాసం పెంపొందేలా వారానికి రెండుసార్లు నృత్య తరగతులు కూడా నిర్వహిస్తున్నాను..’ అని అంటోందీ టీచరమ్మ.
బిస్కట్లు, చాక్లెట్లు చూపించి!
సాధారణంగా పిల్లలు మొదట బడికి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపరు. అందుకే తల్లిదండ్రులు కూడా ప్రారంభంలో తమ పిల్లలను స్కూల్‌కు పంపించేటప్పుడు వారికి బిస్కట్లు, చాక్లెట్లు... ఇంకా ఏవేవో తినుబండారాలు కొనిస్తూ వారిని తరగతి గదుల్లో కూర్చోబెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఎప్పుడూ స్కూల్ మొహమెరుగని గిరిజన పిల్లలను ఒకచోట చేర్చి విద్యాబుద్ధులు నేర్పించేందుకు మాన్షి కూడా చాలా కష్టపడింది. ‘ఇక్కడి గిరిజన పిల్లలను మొదటిసారి కలిసినప్పుడు ‘భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారు’? అని అడిగాను. ‘డాక్టర్లు, ఇంజినీర్లు, సినిమా హీరోలు కావాలనుకుంటున్నాం’ అని చాలామంది నాతో చెప్పారు. అయితే బాగా చదువుకున్న తర్వాతే ఏమైనా కావొచ్చు అని వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశాను. అయినా వారందరినీ ఒకే చోట చేర్చి, పాఠాలు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. మొదట్లో కొన్ని రోజులు వారిని బడికి తీసుకురావడానికి బిస్కట్లు, చాక్లెట్లు ఇచ్చాను. చదువుపై వారికి ఆసక్తి కలిగేలా పాఠాలు బోధించాను. ఆ తర్వాత వాళ్లే రావడం మొదలుపెట్టారు.’
కరోనా సమయంలోనూ!
‘ఇక కరోనా సమయంలో తరగతులు కొనసాగించడం కొంచెం కష్టమైంది. అయినా నా వంతు ప్రయత్నాలు చేస్తూ కనీసం వారానికోసారైనా ఇక్కడకు వచ్చి పిల్లలకు చదువు చెప్పాను. ఆ సమయంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాను. అందరూ ముఖానికి మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకొన్నాను. కరోనా తీవ్రత కొంచెం తగ్గడంతో మళ్లీ మునుపటి రోజుల్లా వారికి పాఠాలు చెబుతున్నాను. ఇప్పుడు వారందరిలో నాకు కాబోయే డాక్టర్లు, ఇంజినీర్లు, హీరోలు కనిపిస్తున్నారు..’ అని సంతోషంతో చెబుతోందీ యంగ్ టీచర్.
ఇలా గిరిజన పిల్లలకు ఉచితంగా విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోన్న మాన్షిని పలువురు అభినందిస్తున్నారు. ఆమె తన విద్యాదానంతో ఎందరికో స్ఫూర్తినిస్తోందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.