సమాజంలో ఉన్నత స్థానం, హోదా, కళ్లు తిప్పనివ్వని అందం, అద్భుతమైన తెలివితేటలు, ఆస్తిపాస్తులు, విశాలమైన బంగ్లా, ఖరీదైన కార్లు ఇవన్నీ ఉంటేనే జీవితం బిందాస్ అనుకుంటాం. కానీ ఇది కొంత వరకే నిజం కావచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత లేకపోతే అసలేవీ లేనట్టే. కావాలంటే మీరే చూడండి... కొంతమందికి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేనప్పటికీ ఏ లోటూ లేకుండా హాయిగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాంతం ఆనందంగా గడిపేస్తారు. ఎందుకంటే... ఏమున్నా లేకపోయినా మానసిక ప్రశాంతత మాత్రం వీరి సొంతం. అదే వారి సంతోషకర జీవనానికి కారణం. ఇంతకీ ఈ మానసిక ప్రశాంతతను ఎలా సొంతం చేసుకోవాలి? అంటే అది మన చేతుల్లోనే ఉంది.
నీకు నువ్వే పోటీ
మన జీవితంలో ప్రశాంతతను కోల్పోవడానికి కారణమయ్యే వాటిలో మొదటి వరుసలో ఉండేది పక్కవారితో పోల్చుకోవడం. అయ్యో నేను తనంత అందంగా లేనే.. నా జుట్టు అంత పొడుగ్గా లేదే.. నాకన్నా తనకి ఎక్కువ ఆస్తి ఉందే... ఇలా ప్రతిదానికీ పోలిక పెట్టుకుని మనుసుని చిందరవందర చేసుకుంటాం. అంతేతప్ప రంగు, రూపు, ఎత్తు...లాంటి విషయాల్లో మన ప్రమేయం ఏమీ లేదని గుర్తించం. వాస్తవానికి పోటీ, పోలిక ఉండాల్సిన విషయాలను మనం వెనక్కి నెట్టేస్తాం. పక్క సీట్లో కూర్చున్న ప్రియాంకకు డబుల్ ప్రమోషన్ వచ్చింది. నాకెందుకు రాలేదని సానుకూలంగా విశ్లేషించడాన్ని మర్చిపోతాం. ఏవేవో కారణాల వల్ల వచ్చిందనుకుంటాం తప్ప ఆమె పనితీరుని పరిగణనలోకి తీసుకోం. కనీసం వచ్చే సంవత్సరమైనా నాకు ఎందుకు పదోన్నతి లభించకూడదు? దానికి నా పనితీరు ఎలా మెరుగుపరచుకోవాలి అని ఆత్మ విమర్శ, స్వీయవిశ్లేషణ చేసుకుని ఆ దిశగా ప్రయత్నాన్ని మొదలెడితే మనకూ ప్రమోషన్ వస్తుందని గుర్తించడం మర్చిపోకూడదు.

బలాలు, బలహీనతలు
ఎవరికివారు వాళ్లు ఏ అంశంలో బలంగా ఉన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ కూడా తెలిసినవాళ్లతో పోలిక వద్దు. మీ పక్కింట్లో ఉండే రోజా కంప్యూటర్ ఇంజినీర్‌గా నెలకు నాలుగు లక్షల వేతనాన్ని తెచ్చుకుంటుందని మీరు కూడా సాఫ్ట్వేర్ కోర్సుల్లో చేరడానికి సిద్ధం కాకూడదు. మీకు ఆ రంగంలో ఆసక్తి ఉందో, లేదో అంతరాత్మను ప్రశ్నించుకోవాలి. లేదని సమాధానమొస్తే మరెందులో రాణించగలరో గ్రహించాలి. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలి. మీ బలహీనతలు తెలుసుకుని అధిగమించడానికి కృషి చేయాలి. ఉదాహరణకు రోజూ 10 గంటలు నిద్రపోవడం తప్పనిసరిగా బలహీనతే. అలా కాకుండా 8 గంటలు, వీలైతే 6 గంటలు నిద్ర సరిపెట్టుకోవాలి. దశలవారీ ఈ స్థితికి చేరుకోవాలి. మీలో మంచి చెడులను మీకంటే బాగా ఎవరూ విశ్లేషించలేరని గుర్తుంచుకోండి.
సానుకూల దృక్పథం
జీవితంలో ఆనందంగా ఉండడానికి అన్నింటికన్నా ఎక్కువగా ఉండాల్సింది సానుకూల దృక్పథమే. కారు లేదని చింతించకుండా కూటికి ఉన్నందుకు సంతోషించాలి. అలాఅని ఏం లేకపోయినా ఫర్వాలేదు. మిమ్మల్ని మీరు సమాధానపర్చుకోమని కాదు. లేనిదానికోసం అదేపనిగా ఆలోచించి మనసుని పాడు చేసుకోకుండా అవి దక్కడానికి ఏం చేయాలో ఆలోచించి ప్రయత్నాలు మొదలెడితే మంచిదే. అందుకే లేనివాటి గురించి దిగులు చెందకుండా అవి దక్కే స్థితికి చేరుకోవడానికి ప్రయత్నాలు మొదలెట్టాలి.

మంచి ఆలోచనలు
ఎలాంటి విత్తనాలు నాటితే అలాంటి ఫలాలే దక్కుతాయని పెద్దలు చెప్పిన సూక్తి. మీ మనసులో ఎలాంటి భావాలు కలిగితే ప్రతిఫలం కూడా అలాంటిదే ఉంటుందని మరవద్దు. ఎవరితోనూ పోల్చుకోకుండా ఇప్పుడు మీరున్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఏం చేయాలి? అని ఒక సాధకురాలి కోణంలో ఆలోచించండి. మంచివాళ్లతో సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. మంచి పుస్తకాలు చదవండి. ఉన్నత భావాలు, ఆశయాలు మిమ్మల్ని ఉన్నంతలో మంచి స్థితికి తీసుకెళ్తాయని విశ్వసించండి.
* నిన్నటి మీతో ఇవాల్టి, రేపటి మిమ్మల్ని పోల్చుకుంటే ఏ సమస్యలూ ఉండవు.
* వ్యాయామం, యోగా, మెడిటేషన్ లాంటివి కూడా మానసిక ప్రశాంతత సొంతం కావడానికి ఉపకరిస్తాయి.