మీ దగ్గర ఓ స్మార్ట్ఫోనుందా? రోజులో ఎక్కువ కాలం ఇంటర్నెట్లోనే గడుపుతున్నారా? చేసిన ప్రతి పని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్డేట్ చేయందే మీకేమీ తోచదా? కొన్న ప్రతి వస్తువును ఫొటో తీసి అప్లోడ్ చేస్తున్నారా? ఇతరులు మీ పోస్టులను అభినందించాలని భావిస్తున్నారా? అయితే, మీకు టీఎంఐ(టూ మచ్ ఇన్ఫర్మేషన్) సిండ్రోమ్ ఉండే అవకాశాలున్నాయి, జాగ్రత్తపడమంటున్నారు నిపుణులు. అసలేంటి ఈ టీఎంఐ అనుకుంటున్నారా? ఈ సమాచారం చదవండి మరి!!
'టీఎంఐ (టూ మచ్ ఇన్మర్మేషన్) సిండ్రోమ్', పేరుకి తగ్గట్లు ఎక్కువ సమాచారాన్ని, నెట్లో పోస్టు చేయడమే దీని ప్రధాన లక్షణం. అవసరమున్నా, లేకపోయినా ప్రతి విషయంపై స్పందనను తెలియపర్చడం; తాను కొన్న వస్తువుల, లేదా తన ఫొటోలను తరచుగా అప్డేట్ చేయడం దీని ఇతర లక్షణాలు.
ఇతరుల కంటే తమను తాము తక్కువగా భావించుకోవడం (న్యూనతాభావం); ఇతరులతో తామూ సమానం లేదా వారికన్నా ఎక్కువ అని నిరూపించుకోవాలనుకోవడం- ఈ తరహా వ్యక్తులు ఆన్లైన్లో ఎక్కువగా గడుపుతారని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలు ముఖ్యంగా ఈతరం యువతీ యువకుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయని వారంటున్నారు.
అసూయాద్వేషాలు పెరుగుతాయి
ఇతరులతో తమను తాము పోల్చుకోవడం, వారికంటే ప్రతి విషయంలోనూ ఎక్కువగా ఉండాలని ప్రయత్నించడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎదుటివారితో పోలిక వల్ల వారి మీద తమకు తెలియకుండానే ద్వేషాన్ని పెంపొందించుకుంటారు. దీనివల్ల ఎదుటివారితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పొగడ్తలతోనే ఆనందం
టీఎంఐ సిండ్రోమ్ ఉన్నవారు ఎప్పుడూ ఇతరుల మెచ్చుకోలు కోరుకుంటూ ఉంటారు. అందుకు తమ ప్రతిభను గోరంతలు కొండంతలు చేసి చూపించడానికి ఇష్టపడతారు. తాము 'ఎక్కువ' అన్న భావన తమ సహచరులకి కలిగించడానికి, వారి పొగడ్తలు పొందడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఎంతటి ప్రమాదానికైనా ఒడిగడతారు. ఉదాహరణకు తన స్నేహితురాళ్ల కంటే తన వద్ద ఖరీదైన వస్తువులుండాలని భావించే అమ్మాయి వాటిని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును దొంగిలించడానికి కూడా వెనుకాడదు. అయితే ఇంత చేసినా వారికి సంతృప్తి ఉండదు.
ఎంత చేసినా, ఇతరుల నుంచి ఎన్ని పొగడ్తలు పొందుతున్నా వీరికి ఎటువంటి ఆనందమూ ఉండదు. ఇతరుల నుంచి మరిన్ని ప్రశంసలు ఎలా పొందాలా? వారికన్నా తనను తాను ఎలా ఎక్కువగా చూపించుకోవాలా? అని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు.ఒకవేళ పొగడ్తలు రాలేదంటే మానసికంగా అది వారిని కుంగదీస్తుంది.
సమాజానికి దూరం
రోజంతా కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌తో గడిపేయడం వల్ల ఇతర విషయాలపై ధ్యాస తగ్గుతుంది. ఎక్కువ సమయం ఆన్లైన్ ప్రపంచంలోనే గడపాలనుకుంటారు. చుట్టూ ఉన్న సమాజంతో సంబంధాలు పెట్టుకోవడానికి వీరు ఇష్టపడరు. దీనివల్ల క్రమేపీ సమాజానికి దూరమవుతారు.

కెరీర్‌కీ సమస్యే
'అతి సర్వత్ర వర్జయేత్' అన్నట్లు అతిగా ఆన్లైన్లో ఉండటం వల్ల కెరీర్లోనూ ఆటంకాలు ఎదురవుతాయి. ఏదో ఒక అంశంపైన ఆన్లైన్లో పోస్టులు చేస్తూ గడిపేయడం, తర్వాత చేయాల్సిన పోస్టు గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల వీరి చదువు సరిగ్గా సాగదు. ఉద్యోగస్థులు తమ పనులు సక్రమంగా చేయలేరు. బద్ధకస్తులుగా ముద్రవేయించుకుంటారు. దీనివల్ల కెరీర్ దెబ్బతింటుంది.
మరేం చేయాలి? ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలున్నాయి. వాటిని పాటిస్తే ఈ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు. అసలు పరిష్కారం కోసం అన్వేషించడమంటేనే మీలోని సమస్య మీకు తెలిసినట్లే. దీంతో ఆ సమస్య సగం పరిష్కారమైనట్లే లెక్క!
పోలిక వద్దు
ఇతరులతో తమను తాము పోల్చుకోవడం వల్ల మానసికంగా కుంగుబాటు తప్ప మరేం లభించదు. ఇతరులతో ఆరోగ్యకరమైన పోటీ ప్రతి ఒక్కరి జీవితంలోనూ తప్పనిసరి. అయితే అది శృతి మించకూడదు. ఇతరులతో పోల్చుకోవడాన్ని క్రమంగా తగ్గించాలి. కొద్దిరోజుల్లో పూర్తిగా మానేయాలి. దీనివల్ల వారిపట్ల మనలో ఉన్న అసూయ, ద్వేషం తగ్గుతాయి.

బిజీ బిజీగా..
ఖాళీగా ఉంటేనే ఆన్లైన్లో గడపాలనిపిస్తుంది. కాబట్టి రోజులో ఖాళీ సమయమనేది ఉండకుండా ప్రణాళిక వేసుకోవాలి. కాలేజీ లేక ఆఫీసులో ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధతో పనిచేయాలి. పూర్తిగా ఆఫీసు పనిపైనే దృష్టి పెట్టాలి. ఇంటివద్ద తీరిక సమయం ఉన్నప్పుడు ఇష్టమైన పనుల్లో తలమునకలవడం వల్ల ఆన్లైన్ నుంచి ధ్యాసను మరల్చుకోవచ్చు.
మీ గురించి మీరు తెలుసుకోండి
పొగడ్త పన్నీరులాంటిది. దాని పరిమళాన్ని ఆస్వాదించాలే తప్ప, దాన్నే తాగుతూ కూర్చోకూడదు. పొగడ్తల్లోనే ఆనందాన్ని వెతుక్కోకూడదు. ఇతరుల స్పందన మీరాశించిన దానికి భిన్నంగా ఉన్నప్పటికీ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి.
అలాగే మరోమాట! మీ ఆత్మగౌరవానికి ఆన్లైన్లో పొందిన పొగడ్తలే కొలమానం కాదని గుర్తుంచుకోండి. మీపై మీరు ఆత్మవిశ్వాసం పెంచుకుంటే దుఃఖమనేది మీ చెంతకు రాదు. గౌరవం అన్నది మీరు సాధించే విజయాలపై ఆధారపడి ఉంటుందే తప్ప, ఇతరులు మీ గురించి ఆలోచించే విధానాన్ని బట్టి కాదని గుర్తెరగాలి. అందుకే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరడానికి కృషి చేయాలి. అప్పుడు మీరే ఇతరులకు రోల్‌మోడల్‌గా మారతారు.
నిపుణుల సూచనలు తీసుకోండి
దినచర్యలో, వ్యక్తిత్వంలో ఎన్ని మార్పులు చేసినా తిరిగి అదే పరిస్థితి ఎదురవుతోంటే మాత్రం నిపుణులను సంప్రదించడం మంచిది. మీలోని ప్రమాదకరమైన ఆలోచనలను గుర్తించి వారు తగిన సలహాలను అందిస్తారు.