Image for representation
కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని చూసి నవ్వుకోవడం, హేళన చేయడం కొందరికి అలవాటు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో సరదాకి ఒక ఫొటో షేర్ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు. దాని వల్ల ఎదుటివారి ఆత్మాభిమానం దెబ్బతింటుందని తెలిసినా ఇలాగే చేస్తూ ఉంటారు. కేరళకు చెందిన ఓ 27 ఏళ్ల అమ్మాయి కూడా తన శరీరాకృతి విషయంలో ఇలాంటి ఎబ్బందులనే ఎదుర్కొంది. అయితే ఆత్మస్థైర్యంతో వాటన్నింటికీ ఎదురొడ్డి నిలిచి ప్లస్ సైజ్ మోడలింగ్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె లక్ష్యం ఏమిటి? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
No caption 😃 Click by Siva Snapshot Sivaprasad😍😍
Posted by Induja Prakash on Saturday, 28 November 2020
పాలరాతి శిల్పం వంటి రూపం, చక్కని కొలతలు గల శరీర సౌష్టవం కలిగిన వాళ్లే మోడలింగ్‌లో రాణిస్తుంటారని చాలామంది అనుకుంటుంటారు. కానీ ఈ మూస ధోరణులను బద్దలు కొడుతూ అందమంటే కేవలం శరీర కొలతలకు సంబంధించినది మాత్రమే కాదు...అంతకుమించిన ఆత్మవిశ్వాసం అని నిరూపిస్తోంది కేరళకు చెందిన ఇందుజా ప్రకాశ్. థైరాయిడ్, పీసీఓఎస్ సమస్యల కారణంగా 136 కిలోలకు చేరుకున్న ఆమె తన భారీకాయంతోనే అందరి చూపునూ తన వైపుకు తిప్పుకుంటోంది. ప్లస్ సైజ్ మోడలింగ్‌లో విశేషంగా రాణిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు కొన్ని మలయాళ సినిమాల్లోనూ మెరుస్తూ అధిక బరువు కారణంగా ఆత్మన్యూనతకు గురయ్యే అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపుతోంది.
డ్యాన్స్ వేయద్దంది!
మూడేళ్ల వయసులోనే ఊబకాయం బారిన పడిన ఇందుజ అప్పటి నుంచే ఎన్నో అవమానాలకు గురైందట. స్కూల్లో క్లాస్మేట్స్, స్నేహితులు అయితే ‘ఏనుగులా ఉన్నావు’, ‘నువ్వు నడిస్తే భూమి బద్దలయ్యేలా ఉంది’, ‘నువ్వు ఎవరి మీదైనా పడితే..వారిది ప్యాండీ లారీ కింద పడిన కప్పలాంటి పరిస్థితే’ అంటూ హేళన చేసేవారట. ఇక తను ఎలాంటి దుస్తులు ధరించినా విమర్శలు ఎదురయ్యేవి. ఇలాంటి కామెంట్లు, జోక్‌లతో మానసిక వ్యథకు లోనైన ఇందుజ ఎవరితోనూ కలిసేది కాదు. లావుగా ఉన్న కారణంగా ఏడో తరగతిలో తనకెంతో ఇష్టమైన డ్యాన్స్‌ను కూడా వదిలేసుకుంది. ఇందుకు కారణం భారీకాయంతో తను డ్యాన్స్ చేస్తున్నప్పుడు చాలామంది తనపై ఫన్నీ జోక్స్ వేయడం! ఆ కామెంట్లను సహించలేని ఆమె తల్లి తనని ఇంకెప్పుడూ డ్యాన్స్ వేయద్దని కోరిందట. అలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూనే కళాశాలలోకి అడుగుపెట్టింది ఇందుజ.
Click by Jaseena Kadavil😍😍
Posted by Induja Prakash on Thursday, 8 October 2020
చుడీదార్తోనే కళాశాలకి!
సాధారణంగా చాలామంది అమ్మాయిలు జీన్స్, టీషర్ట్ లాంటి మోడ్రన్ దుస్తులు వేసుకుని కళాశాలకు రావడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఇందుజకు కూడా అలాంటి మోడ్రన్ దుస్తుల్లో మెరిసిపోవాలని ఉన్నా ఎవరేమంటారోనని భయపడి చుడీదార్‌లోనే కాలేజీకి వచ్చేదట! అదే సమయంలో తనను ఎన్నో అవమానాలకు గురి చేసిన తన శరీరాకృతిని చూసుకొని తనను తానే ఎన్నో సార్లు అసహ్యించుకుందట. అలా అవమానాలు పడుతూనే సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమో పూర్తి చేసింది. ఆతర్వాత కొద్ది రోజుల పాటు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి చేరింది. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉన్నా తన అధిక బరువుని చూసుకొని తన ఆశయాన్ని విరమించుకుంది. అయితే అదే సమయంలో ప్లస్ సైజ్ మోడలింగ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంది. అందులో ఉండే అవకాశాల గురించి వాకబు చేసింది. ఈక్రమంలో తన స్నేహితుల సాయంతో సరదాగా ఫొటోషూట్ తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది ఇందుజ. చాలామంది నెటిజన్లు ఆమె ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమె ఫొటోషూట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
പ്രകൃതിയെ അങ്ങ് നോക്കി നിന്നും പോയി 😍😍😍 📸@jaseenakadavil
Posted by Induja Prakash on Wednesday, 7 October 2020
అదే అసలైన అందమని తెలుసుకున్నాను!
అప్పటిదాకా ఎలాగైనా బరువు తగ్గాలనుకున్న ఆమె.. తన ఫొటోషూట్‌కు వచ్చిన స్పందనను చూసి తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందమంటే కేవలం శరీర కొలతలకు సంబంధించినది మాత్రమే కాదు... అంతకుమించిన ఆత్మవిశ్వాసమని తెలుసుకుంది. తనను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టింది. ఈక్రమంలోనే ప్లస్‌సైజ్ మోడలింగ్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా మలచుకుంది. ‘మా కుటుంబంలో చాలామందికి ఊబకాయం సమస్య ఉంది. ఈ కారణంగా మూడేళ్ల వయసు నుంచే నా బరువు కూడా క్రమంగా పెరిగిపోయింది. అలాగని నేనంత అతిగా కూడా ఏమీ తినను. థైరాయిడ్, పీసీఓఎస్ లాంటి సమస్యలు కూడా చుట్టుముట్టడంతో నా సమస్య మరింత తీవ్రమైంది. దీంతో చుట్టుపక్కల వారి నుంచి ఎన్నో అవమానాలు, హేళనలు ఎదుర్కొన్నాను. చాలాసార్లు బరువు తగ్గాలని, స్లిమ్‌గా తయారవ్వాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. అయితే ఆ తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ప్లస్ సైజ్ మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. మొదట్లో మోడలింగ్ అవకాశాల కోసం చాలా కష్టపడ్డాను. అధిక బరువు కారణంగా నేను ఎదుర్కొన్న అవమానాలు, హేళనల ముందు ఇవి పెద్ద సమస్యలు అనిపించలేదు. ధైర్యంగా ముందడుగు వేశాను. నా ఫొటోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టుల సహకారంతో మోడలింగ్‌లో పలు అవకాశాలు దక్కించుకున్నాను. ప్రస్తుతం నాకు ఇండియాలోనే కాదు యూరప్, అమెరికా దేశాల నుంచి మోడలింగ్ ఆఫర్లు వస్తున్నాయి. అదేవిధంగా కొన్ని మలయాళం సినిమాల్లో కూడా నటించాను. మరికొన్ని సినిమాలకు కూడా సైన్ చేశాను. ప్రస్తుతం నేనెంతో సంతోషంగా ఉన్నాను..’ అని అంటోందీ యంగ్ సెన్సేషన్.