Photo: Instagram
చీర...భారతీయ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అయితే ఏవైనా పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణ రోజుల్లో చీర కట్టుకునే వారు చాలా తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే చీరకట్టులో సౌకర్యవంతంగా ఉండలేమని.. చుడీదార్లు, జీన్సుల్లోనే కంఫర్టబుల్‌గా ఉండచ్చని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇలా చీర కట్టుకోవడానికే ఇబ్బంది పడిపోయే నేటి రోజుల్లో కొందరు మహిళలు ఈ వస్త్రధారణతోనే వ్యాయామాలు చేయడం, మారథాన్లలో పాల్గొనడం, సాహసకృత్యాల్లో భాగమవడం...వంటివి చేస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది మిలీ సర్కార్ అనే యువతి. ఇంటర్నేషనల్ యోగా గోల్డ్ మెడలిస్ట్, జిమ్నాస్ట్ అయిన ఆమె.. చీరకట్టులో అవలీలగా బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తద్వారా మహిళలు చీరకట్టులోనూ ఎంతటి కఠినమైన పనులైనా అలవోకగా చేయగల సమర్థులు అని నిరూపిస్తోంది.
చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్!
సాధారణంగా బ్యాక్‌ఫ్లిప్స్ లాంటి స్టంట్లు వేసేటప్పుడు శరీరం గాల్లో 360 డిగ్రీల మేర గుండ్రంగా తిరగాల్సి ఉంటుంది. అంతేకాదు ఇవి చేసేటప్పుడు ఏ మాత్రం బ్యాలన్స్ తప్పినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిరంతర సాధన, కృషి చేస్తే తప్ప ఇలాంటి ఫీట్ల మీద పట్టు సాధించడం సాధ్యం కాదు. ఇక స్టంట్ ఫ్రొఫెషనల్స్, జిమ్నాస్టిక్స్ చేసే వారు, అథ్లెట్లు కూడా అనువైన స్టోర్ట్స్ వేర్ ధరించి ఇలాంటి సాహసాలు చేస్తుంటారు. అయితే స్వతహాగా జిమ్నాస్ట్ అయిన మిలీ సర్కార్‌కూ ఇలాంటి విన్యాసాలు చేయడం కష్టం కాకపోవచ్చు.. కానీ చీరకట్టులో అలవోకగా బ్యాక్‌ఫ్లిప్స్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించిందామె.
ఆమె ఏదైనా చేయగలదు!
ఈసందర్భంగా ఎరుపు, పసుపు రంగు చీర ధరించి బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తోన్న మిలీ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ‘మగవారు చేయగలిగినవన్నీ మహిళలు కూడా చేయగలరు. సరిగ్గా చెప్పాలంటే మగవారి కంటే ఇంకా మెరుగ్గా, గొప్పగా చేయగలరు. అసలు పురుషులు చేయలేని ఎన్నో పనులను సైతం స్త్రీలు చాలా సులభంగా చేస్తున్నారు. చీరకట్టులో అద్భుతంగా బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తోన్న మిలీ సర్కార్‌ను ఒకసారి గమనిస్తే ప్రతిభకు పవర్‌హౌస్ లాగా అనిపిస్తోంది’ అని రాసుకొచ్చారు. ఇక మిలీ స్టంట్స్ చూసిన చాలామంది నెటిజన్లు ‘సూపర్’, ‘ఇదీ అమ్మాయిల పవర్ అంటే’, ‘ఆమె ఏదైనా చేయగలదు’.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
డ్యాన్స్ అంటే మహా ఇష్టం!
ఇలా చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్ చేస్తూ అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోన్న మిలీ.. తాను చీరకట్టుకోవడం చాలా అరుదని చెబుతోంది. ‘నేను సాధారణంగా చీరలు ధరించను.. కానీ ఈసారి ఎందుకో ఇలా చీరకట్టులో బ్యాక్‌ఫ్లిప్స్ చేయాలనిపించింది.. అది వర్కవుట్ అయింది!’ అని చెబుతోందీ అమ్మాయి. పశ్చిమ బంగలోని రాయ్‌గంజ్ గ్రామానికి చెందిన ఈ 17 ఏళ్ల యువతికి డ్యాన్స్ అంటే కూడా ప్రాణమట! ఈ క్రమంలో తాను చేసిన జిమ్నాస్టిక్స్ విన్యాసాలు, డ్యాన్స్ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటుంది మిలీ. ఈ క్రమంలో నేల, నీరు అనే తేడా లేకుండా తాను చేసే కఠినమైన జిమ్నాస్టిక్స్ విన్యాసాలు నెటిజన్లను అబ్బురపరుస్తున్నాయనడంలో సందేహం లేదు.
గతంలోనూ!
*కొద్ది రోజుల క్రితం కేరళలోని కొచ్చికి చెందిన ఈష్నా కుట్టి చీరకట్టులోనే అద్భుతంగా హూలా హూప్ డ్యాన్స్ చేసింది. ‘జెండాపూల్’ అనే బాలీవుడ్ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, హూప్ రింగ్‌తో శరీరాన్ని గింగిరాలు తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్ అదరహో అనిపించింది.
*ఇక మరో మహిళ ఇలా చీరలోనే బ్యాక్ ఫ్లి్ప్స్ చేస్తుండగా తీసిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోని చూసి కేంద్రమంత్రులు స్మృతీ ఇరాని, కిరణ్ రిజుజు లాంటి పలువురు ప్రముఖులు కూడా ఆ మహిళ ప్రతిభను ప్రశంసించారు.