సరిగ్గా ఏడాది క్రితం చైనాలోని వుహాన్ వేదికగా పురుడు పోసుకుంది కరోనా వైరస్. అప్పటి నుంచి ప్రపంచమంతా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ వణికిస్తోందీ మహమ్మారి. ఇక ఇప్పుడు మళ్లీ సెకండ్ వేవ్ అంటూ పలు ప్రపంచ దేశాల్లో గుబులు రేపుతోంది. అదే సమయంలో కరోనా వైరస్‌తో సుమారు ఏడాది కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు వైద్య సిబ్బంది. ప్రఖ్యాత డాక్టర్ల నుంచి సాధారణ నర్సుల వరకూ కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ రోగులకు సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో కొందరు డాక్టర్లు అదే మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు రోగులకు సేవ చేస్తూ మానసిక ఒత్తిడితో పాటు తీవ్ర శారీరక ఒత్తిడికి గురవుతున్నారు. అందుకు తాజా ఉదాహరణే ఈ అమెరికన్ నర్సు.
గాలి కూడా చొరబడని ప్లాస్టిక్ పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు...కరోనా రోగులకు సేవలందించే క్రమంలో వైరస్ బారిన పడకుండా వైద్యులు రోజంతా ఈ రక్షణ కవచాలను ధరించాల్సిందే. విధి నిర్వహణలో భాగంగా రోజుల తరబడి వీటిని ధరించడం వల్ల వైద్య సిబ్బంది తీవ్ర శారీరక ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రత్యేకించి వీళ్ల ముఖాలపై మాస్క్ అచ్చులు బలంగా పడడం, ఆ ప్రదేశంలో చర్మం కందిపోయినట్లుగా తయారవడంతో వీరి ముఖాలు గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నాయి. ఈక్రమంలో కొవిడ్ వైద్య సిబ్బంది దయనీయ స్థితికి అద్దం పట్టేలా ఓ అమెరికన్ నర్సు షేర్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మాస్క్ మచ్చలతో గుర్తుపట్టలేనంతగా!
అమెరికాలోని టెనెస్సీకి చెందిన క్యాథరిన్ అనే అమ్మాయి ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలో తన నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకుంది. అప్పటికే అమెరికాలో కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈక్రమంలో కరోనా రోగులకు సేవలందించేందుకు టెనెస్సీలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరింది క్యాథరిన్. ఆమెకు కొవిడ్ వార్డుల్లో విధులు కేటాయించడంతో రోజంతా పీపీఈ కిట్లు, ముఖానికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరిస్తూ రోగులకు సేవ చేస్తోంది. అలా గత ఎనిమిది నెలలుగా కరోరా రోగులకు సేవలందిస్తోన్న క్యాథరిన్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో రెండు ఫొటోలను షేర్ చేసింది. అందులో ఒకటి ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రాడ్యుయేషన్‌కు ముందు తీసుకున్న ఫొటో కాగా...మరొకటి నర్సుగా డ్యూటీ పూర్తి చేసుకుని ఇటీవలే దిగిన ఫొటో. మొదటి ఫొటోలో నవ్వుతూ అందమైన మోముతో కనిపించిన క్యాథరిన్...రెండో ఫొటోలో మాత్రం ముఖం మీద మాస్క్ మచ్చలు, కందిపోయిన చర్మంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ‘ఎలా మొదలైంది.. ఎలా సాగుతోంది..!’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటోలు.. కొవిడ్ విధుల్లో భాగంగా వైద్య సిబ్బంది ఎలాంటి శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో కళ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. ఈ రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అదనపు డ్యూటీలు చేస్తూ!
వైరస్‌ను అదుపుచేసేందుకు వైద్య సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్నా టెనెస్సీ రాష్ట్రంలో కరోనా ఏ మాత్రం శాంతించడం లేదు. ఆ రాష్ర్టంలో ఇప్పటికే 3.3లక్షల మంది కరోనా బారిన పడగా.. 4,200 మంది చనిపోయారు. రోజురోజుకీ పెరుగుతోన్న కరోనా బాధితులతో వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీంతో ప్రస్తుతం రోజుకు పన్నెండున్నర గంటల పాటు వారంలో మూడు రోజులు విధులకు హాజరవుతోంది క్యాథరిన్. కొన్ని సమయాల్లో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం, రోగుల సంఖ్య పెరుగుతుండడంతో అదనపు డ్యూటీలు చేస్తూ ఆస్పత్రిలోనే ఉండిపోతోంది. ఈక్రమంలో తాము తీవ్ర శారీరక, మానసిక శ్రమను ఎదుర్కొంటున్నామంటోందీ టీనేజర్.
అదే నా జీవితంలో అత్యంత విషాదకరం!
‘నాకు నర్సింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం. అయితే కరోనా ఉపద్రవం మధ్యలో కొత్త నర్సుగా విధుల్లో చేరుతానని అసలు అనుకోలేదు. కానీ వేగంగా వ్యాపిస్తోన్న ఈ వైరస్ నుంచి నుంచి పౌరులను రక్షించడం ఒక బాధ్యతగా తీసుకున్నాను. జబ్బుపడిన రోగులను ప్రేమతో చూడడం నా విధి. అయితే దురదృష్టవశాత్తూ కరోనా బారిన పడిన చాలామంది రోగులు నా కళ్లముందే కన్నుమూశారు. నేను నా జీవితంలో చూసిన అత్యంత విషాదకర సంఘటనలు ఏవైనా ఉన్నాయంటే అవి కరోనా రోగుల మరణాలే. కాబట్టి కరోనాతో అప్రమత్తంగా ఉండండి. ఈ వైరస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకున్నట్లే..!’ అంటోందీ కొవిడ్ వారియర్. క్యాథరిన్ షేర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈక్రమంలో సుమారు 11,700మంది దీనిని రీట్వీట్ చేయగా, దాదాపు 88.4లక్షల లైకులు రావడం విశేషం. ఈ సందర్భంగా చాలామంది నెటిజన్లు ఆమె వృత్తి నిబద్ధతను మెచ్చుకుంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.