‘టిక్‌టాక్’....కొద్ది నెలల క్రితం భారత్‌లో నిషేధించిన ఈ చైనా మొబైల్ యాప్‌కి ఇతర దేశాల్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ప్రధానంగా అమెరికాలో ఈ వీడియో షేరింగ్ యాప్‌కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇక ఈ యాప్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది సామాన్యులు ఓవర్‌నైట్ సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. తమ సృజనాత్మక వీడియోలతో లక్షల నుంచి కోట్ల వరకు ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ టిక్‌టాక్ స్టార్లుగా ఎంతో క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఈక్రమంలో అమెరికాకు చెందిన ఓ 16 ఏళ్ల యువతి టిక్‌టాక్‌లో తొలిసారిగా 100మిలియన్(10కోట్లు) ఫాలోవర్స్ మార్క్‌ను చేరుకుంది. తద్వారా ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది ఫాలో అవుతున్న టిక్‌టాకర్‌గా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి? వంద మిలియన్ల మంది అభిమానం ఎలా సంపాదించిందో తెలుసుకుందాం రండి.
‘10 కోట్ల’ అభిమానం!
ప్రతికూలతల్ని పక్కన పెడితే టిక్‌టాక్ యాప్ పుణ్యమా అని నాలుగు గోడల మధ్య ఉన్న ప్రతిభ బాహ్య ప్రపంచానికి తెలుస్తోంది. ఈ వీడియోల కారణంగా చాలామంది రాత్రికి రాత్రే స్టార్లుగా, సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. ఇక టిక్‌టాక్ ప్రతిభతో సినిమాల్లో అవకాశాలు పొందుతున్న వారూ కోకొల్లలు. ఈక్రమంలో తన టిక్‌టాక్ ప్రతిభతో అనతి కాలంలోనే ఆకాశమంత క్రేజ్‌ను సొంతం చేసుకుంది అమెరికాకు చెందిన ఛార్లీ డీ అమెలియో. గతేడాది మార్చి 30న మొదటిసారిగా టిక్‌టాక్‌లో తన డ్యాన్స్ వీడియోను షేర్ చేసిన ఈ 16 ఏళ్ల చిన్నది.. అప్పట్నుంచి రోజూ డ్యాన్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్.. వంటి విభాగాల్లో వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఈక్రమంలో కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే పది కోట్ల మంది ఫాలోవర్ల ప్రేమాభిమానాలను సొంతం చేసుకుంది. అమెరికన్ నటి ఆడిసన్ రే 69.9 మిలియన్ల ఫాలోవర్లతో ఛార్లీ తర్వాత రెండోస్థానంలో నిలిచింది. అలాగే మరో ఇద్దరు టిక్‌టాక్ స్టార్లు 50 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అయినా అభిమానం ఆగలేదు!
కరోనా పుట్టుకకు కారణమైన చైనా రూపొందించిన ఈ టిక్‌టాక్ యాప్‌ను మన దేశంలోలాగే అమెరికాలో కూడా నిషేధిస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయినా అక్కడి యువతలో ఈ యాప్‌కున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడానికి ఛార్లీనే ప్రత్యక్ష నిదర్శనం. గత సంవత్సరం ఆమెకు టిక్‌టాక్‌లో కేవలం ఆరు మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆమె ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరుగుతూ వచ్చింది.
ఆదాయంలోనూ ‘టాప్’!
*తన టిక్‌టాక్ ప్రతిభతో అనతి కాలంలోనే 10 కోట్ల మంది అభిమానం చూరగొన్న ఛార్లీ ఆదాయంలోనూ అదేవిధంగా దూసుకుపోతోంది. ఈక్రమంలో ‘ఫార్చ్యూన్ 40 అండర్ 40-2020’ జాబితాలో చోటు దక్కించుకుంది. అదేవిధంగా అత్యధిక ఆదాయం ఆర్జిస్తోన్న రెండో టిక్‌టాకర్‌గా ఫోర్బ్స్ ప్రశంసలు సైతం అందుకుంది.
*తన ప్రతిభతో ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖులతో కలిసి స్టేజ్‌ని షేర్ చేసుకున్న ఛార్లీ.. ‘స్టార్డాగ్ టర్బోకాట్’ అనే ఓ యానిమేషన్ చిత్రంలో నటించింది. ఇటీవల మరో సినిమాకు కూడా సంతకం చేసిందీ టీనేజర్.
*సినిమాలతో పాటు నెయిల్ పాలిష్, మేకప్, ఫ్యాషన్లకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తుల ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకుంది.
*టిక్‌టాక్‌కు సంబంధించి ఛార్లీకి ఉన్న ఫాలోవర్లు విల్‌స్మిత్ కంటే రెండు రెట్లు, రాక్ కంటే మూడు రెట్లు, సెలెనా గోమెజ్ కంటే నాలుగు రెట్లు, కైలీ జెన్నర్, అరియానా గ్రాండే కంటే ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
*కేవలం టిక్‌టాక్‌లోనే కాదు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రెడిట్.. వంటి ఇతర సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఛార్లీకి బోలెడంత మంది అభిమానులున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా ఆమెకు 33.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండడం విశేషం.
* బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొందిన ఈ టీనేజ్ సెన్సేషన్లో ఓ మంచి రచయిత్రి కూడా దాగుంది. ఈక్రమంలో తన 16 ఏళ్ల జీవితానికి అక్షర రూపమిస్తూ ‘ఎసెన్షియల్లీ ఛార్లీ : ది అల్టిమేట్ గైడ్ టు కీపింగ్ ఇట్ రియల్’ అనే పేరుతో రాసిన పుస్తకాన్ని డిసెంబర్లో విడుదల చేయనుంది ఛార్లీ.