ప్రపంచాన్ని చుట్టి రావాలంటే ఎంత టైం పడుతుంది? అబ్బో చాలా సమయమే పడుతుందంటారా ? అలాంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ యువతి సుమారు మూడున్నర రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టేసింది. అది కూడా ఒంటరిగానే..! తద్వారా అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టొచ్చిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఎవరామె? ఎందుకు ప్రపంచమంతా పర్యటించింది? అది కూడా మూడున్నర రోజుల్లోనే ఎలా సాధ్యమైంది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
ప్రపంచాన్ని చుట్టేసింది!
సాధారణంగా అంతర్జాతీయ ప్రయాణాలంటేనే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీసాలు తీసుకోవడం, టిక్కెట్లు బుక్ చేసుకోవడం, గంటల తరబడి విమానాల్లో ప్రయాణించడం...తదితర కష్టాలన్నీ ఉంటాయి. కానీ యూఏఈకి చెందిన డాక్టర్ ఖావ్లా అల్ రొమైతి 87 గంటల్లోనే సప్త సముద్రాలు దాటేసింది. సప్త ఖండాల్ని చుట్టేసి 208 దేశాలను సందర్శించింది. ఈ క్రమంలో అతి తక్కువ సమయంలో ప్రపంచ పర్యటనను పూర్తి చేసిన మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది.
ఆ రికార్డును తుడిచేసింది!
యూఏఈలో పుట్టి పెరిగిన ఖావ్లాకు గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించాలనేది కల. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్న తరుణంలో అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుడితే బాగుంటుందని అనిపించింది. దానికి తోడు కొత్త ప్రదేశాలకు ప్రయాణించి అక్కడి సంస్కృతీ సంప్రదాయాల గురించి తెలుసుకోవాలంటే ఖావ్లాకు మహా ఆసక్తి. ఈ క్రమంలో ప్రపంచ పర్యటనకు ప్రణాళికలు రచించింది. అనుకున్నట్లే కేవలం 3 రోజుల 14 గంటల 46 నిమిషాల 48 సెకన్లలోనే (అంటే.. 86 గంటల 46 నిమిషాల 48 సెకన్లలో) 208 దేశాలను చుట్టేసింది. ఇంతకుముందు తక్కువ వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన రికార్డు జూలీ బెర్రీ, కాసే స్టీవర్ట్ అనే ఇద్దరు పర్యటకుల పేరిట ఉంది. వారు ఏడు ఖండాలను 92 గంటల 4 నిమిషాల 19 సెకన్లలో చుట్టి వచ్చారు. తాజాగా ఆ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది రొమైతి. ఫిబ్రవరి 9న యూఏఈలో మొదలైన ఆమె ప్రపంచ పర్యటన ఫిబ్రవరి 13న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ముగిసింది. వాస్తవానికి అప్పుడే తనకీ అరుదైన గౌరవం దక్కాల్సింది. అయితే అనుకోకుండా వచ్చిన కొవిడ్ వైరస్ కారణంగా ఈ టీనేజ్ సెన్సేషన్ విజయం గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసింది.
అందుకే ఈ ప్రపంచయాత్ర!
తన వేగవంతమైన ప్రపంచ పర్యటనకు గుర్తింపుగా ఇటీవల గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందుకుంది రొమైతి. ఈ సందర్భంగా తన ప్రపంచ పర్యటనకు సంబంధించిన అనుభవాలను అందరితో షేర్ చేసుకుంది. ‘ప్రపంచంలో యూఏఈ చిన్న దేశమైనా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే అతి ఎత్తైన బుర్జ్ ఖలీఫా భవనంతో పాటు అతి పెద్దదైన హై డెఫినిషన్ వీడియో వాల్ కూడా ఇక్కడే ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే పోలీస్ కార్ కూడా మాకే సొంతం. ఈ నేపథ్యంలో మిగతా ప్రపంచ దేశాల్లాగే మా దేశం కూడా అత్యంత అరుదైన రికార్డులు సృష్టించగలదని నేను నిరూపించాలనుకున్నాను. అందుకే ఇంత తక్కువ సమయంలో 208 దేశాలను చుట్టి గిన్నిస్ సర్టిఫికెట్ సొంతం చేసుకున్నాను.
అయితే నా ప్రయాణం అనుకున్నంత సులభంగా సాగలేదు. ఇలాంటి సుదీర్ఘ పర్యటనలు చేయడానికి చాలా ఓపిక అవసరం. అందులోనూ ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి ఎదురు చూడడం, నిరంతరంగా విమానాల్లో ప్రయాణం చేయాలంటే చాలా కష్టమే. చాలా సందర్భాల్లో ప్రయాణాన్ని మధ్యలోనే వదిలిపెడదామని అనుకున్నాను. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాను. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. అభిరుచితో ఆరంభమైన నా ప్రయాణం గిన్నిస్ వరల్డ్ రికార్డును తెచ్చి పెట్టడం చాలా సంతోషంగా ఉంది. దీనిని మాటల్లో వర్ణించలేను. ఇది నాకు దక్కిన గౌరవం. దీనిని మా దేశ ప్రజలకు అంకితమిస్తున్నాను. కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని నన్ను చూసి ఎవరైనా స్ఫూర్తి పొందితే చాలు!’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ యంగ్ సెన్సేషన్.