రోజూ పత్రికలు చదివేవారిలో చాలామందికి సుడోకు, పజిల్స్ పూర్తి చేయడమంటే చాలా సరదా. ప్రత్యేకించి మేజ్ పజిల్‌ను పరిష్కరించేందుకు చిన్నారులతో పాటు పెద్దవాళ్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. వీటిని సాధన చేయడం ద్వారా మన మెదడు మరింత చురుకుగా పని చేస్తుందని, జ్ఞాపకశక్తి సామర్థ్యం పెరుగుతుందని, ఒత్తిడి దూరమవుతుందని వైద్య నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ అమ్మాయి 104.64 చదరపు మీటర్ల పొడవైన మేజ్ పజిల్ని రూపొందించింది. తద్వారా ప్రపంచంలో అతి పొడవైన పజిల్‌ను తయారుచేసిన యువతిగా గిన్నిస్ రికార్డుల కెక్కింది.
పొడవైన పజిల్‌తో ప్రపంచ రికార్డు!
పజిల్‌ను పూర్తి చేయాలంటే చాలామందికి ఆసక్తి ఉండడం సహజం. కానీ మెదడుకు పని పెట్టే ఆ పజిల్‌ను రూపొందించాలంటే మాత్రం ఆసక్తితో పాటు ఎంతో ఓపిక కూడా ఉండాలి. ఈ రెండు లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టే పొడవైన పజిల్‌ను తయారుచేసి ప్రపంచ రికార్డు సృష్టించింది మిషెల్ నన్‌లే. అమెరికాలోని మిషిగన్‌కి చెందిన ఈ టీనేజ్ గర్ల్‌కి పజిల్స్ పూర్తి చేయడమన్నా, విప్పడమన్నా చాలా ఆసక్తి. అందుకు తగ్గట్టే అమెకు అద్భుతమైన డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయి. వీటితో పాటు మిషెల్ కి సామాజిక దృక్పథం కూడా ఎక్కువే. ఈ క్రమంలో ‘లివింగ్ ఆర్ట్స్’ అనే ఓ కిడ్స్ ఆర్గనైజేషన్ కోసం నిధులు సేకరించాలనుకున్న ఆమె తన హస్తకళను వినియోగించుకుంది.

ఆమె సహనానికి హ్యాట్సాఫ్!
ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 9న మిషెల్ పజిల్‌ను గీయడం ప్రారంభించింది. అలా ఒకటి కాదు...రెండు కాదు..ఏకంగా మూడున్నర నెలల పాటు కృషి చేసి సెప్టెంబర్ 16 నాటికి 104.64 చదరపు మీటర్ల పొడవైన మేజ్ పజిల్‌ను రూపొందించింది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి పొడవైన పజిల్‌ను తయారుచేసిన యువతిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఆమె ఘనతను గుర్తిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో మిషెల్ డ్రాయింగ్‌కి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ఇప్పటివరకు సుమారు 3.5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.

ఈ క్రమంలో నెటిజన్లు మిషెల్ ని ప్రశంసిస్తూ ‘ఇది చాలా అద్భుతంగా ఉంది. దీనికి చాలా శ్రమ, ఓపిక అవసరం. ఆమెకు టన్నుల సహనం ఉంది కాబట్టే ఈ పజిల్‌ను తయారుచేసింది’ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదేవిధంగా ‘నేను ఈ పజిల్‌ను పరిష్కరించాలనుకుంటున్నాను. దయచేసి నాకు షేర్ చేయండి’ అని మరికొంతమంది నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఇది పూర్తి చేయాలంటే టైముందా?
తను గీసిన మేజ్ పజిల్‌కి వచ్చిన స్పందనను చూసి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోతోంది మిషెల్. ఈ సందర్భంగా తనను అభినందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇక నెటిజన్ల విజ్ఞప్తి మేరకు తన పజిల్ డిజిటల్ వెర్షన్‌ను రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘మీరు కోరినట్లే... నా పజిల్‌ను పోస్ట్ చేస్తున్నాను. కానీ దీనిని పరిష్కరించాలనుకుంటే మాత్రం మీకు చాలా ఖాళీ సమయం అవసరమవుతుంది’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
It took Michelle Nunley (USA) over 3 months to create the world's largest hand-drawn maze
Posted by Guinness World Records on Monday, 9 November 2020
Photos: Screen grab