Photos: Screengrab
పొడవాటి కురులు ఆడవారికి ఎంత అందాన్నిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సహజ కిరీటం లాగా తలమీద నిగనిగలాడుతూ ఒత్తయిన, పొడవైన కేశాలు అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అందుకే చాలామంది కురులు రాలిపోకుండా మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్ ఆయిల్స్, కండిషనర్లు, మందులు ఇంకా చాలా చిట్కాలు వినియోగిస్తుంటారు. కానీ ఇవేవీ అవసరం లేకుండానే పొడవాటి జుట్టుతో ప్రపంచ రికార్డులు సృష్టిస్తోంది గుజరాత్‌కు చెందిన నీలాన్షి పటేల్. గతేడాది 190 సెంటీమీటర్ల పొడవైన కురులతో ప్రపంచంలో అత్యంత పొడవైన జుట్టు ఉన్న యువతిగా గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించిన ఆమె తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ క్రమంలో 200 సెంటీమీటర్ల (6 అడుగుల 6.7 అంగుళాలు) పొడవాటి కేశాలతో ప్రపంచంలో పొడవాటి జుట్టు ఉన్న టీనేజర్‌గా మరోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కిందీ యంగ్ సెన్సేషన్.

ముచ్చటగా మూడోసారి!
గుజరాత్ రాష్ర్టంలోని అరవల్లి గ్రామానికి చెందిన నీలాన్షికి తన కురులంటే చాలా ప్రేమ. ఎంతలా అంటే సుమారు 12 ఏళ్లుగా జుట్టును ట్రిమ్ చేసుకోకుండా ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. నీలాన్షిని ఆమె స్నేహితులంతా రాపంజెల్ (జర్మన్ కార్టూన్ క్యారెక్టర్)తో పోల్చుతారు. తన పొడవాటి కురులతో సెలబ్రిటీ స్టేటస్ సంపాదించుకున్న ఈ టీనేజ్ సెన్సేషన్తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు చాలామంది పోటీ పడుతుంటారు. ఈ క్రమంలో 170.5 సెంటీమీటర్ల పొడవైన కేశాలతో 2018 నవంబర్ 21న మొదటిసారిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కింది నీలాన్షి. గతేడాది సెప్టెంబర్‌లో 190 సెంటీమీటర్ల కురులతో తన రికార్డును తానే బద్దలు కొట్టి రెండోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తాజాగా తన పాత రికార్డులన్నింటినీ తుడిచేస్తూ 200 సెంటీమీటర్ల పొడవాటి జుట్టుతో ముచ్చటగా మూడోసారి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకెక్కిందీ టీనేజ్ సెన్సేషన్!
అప్పుడే నిర్ణయించుకున్నా!
చివరిగా ఆరేళ్ల వయసులో ఒకసారి తన జుట్టును ట్రిమ్ చేసుకుంది నీలాన్షి. అయితే ఆ తర్వాత కత్తెరకు అసలు పని చెప్పలేదు. ‘చిన్నప్పుడు అందరిలాగే నాకూ జుట్టు కత్తిరించుకోవాలని, పొట్టి జుట్టుతో సౌకర్యవంతంగా ఉండాలని అనిపించేది. అందుకే నాకు ఆరేళ్లున్నప్పుడు జుట్టు కత్తిరించుకున్నా. కానీ అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఇకపై జుట్టు కత్తిరించుకోవద్దని అప్పుడే నిర్ణయించుకున్నా. ఇక నా జుట్టే నన్ను సెలబ్రిటీని చేసింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో నా పేరు చూడాలనుకున్న అమ్మ ఆకాంక్షను నెరవేర్చింది. నా కురుల కారణంగా ప్రస్తుతం ప్రపంచం మొత్తం నా గురించి తెలుసుకోవడం ప్రారంభించింది’ అంటోందీ మినీ రాపంజెల్.

అమ్మ సహకారంతోనే!
ఇక తన ఆరోగ్యమైన, అందమైన కురులకు తన తల్లే కారణమని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది నీలాన్షి. ‘నా జుట్టు సంరక్షణ కోసం మార్కెట్లో దొరికే ఎలాంటి కేశ సౌందర్య ఉత్పత్తులను వినియోగించను. నా చిన్నతనం నుంచే అమ్మ నా జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేది. ఇందులో భాగంగా సహజ సిద్ధంగా కొన్ని పదార్థాలతో ఇంట్లోనే తయారుచేసే హెయిర్ ఆయిల్‌ను మాత్రమే నేను వాడేదాన్ని. అదే నా కేశ సంపదకు కారణం. ఇక జుట్టు కాస్త పొడవుగా ఉంటే తలస్నానం చేయడం, ఆరబెట్టడం, దువ్వడం, చిక్కులు కట్టకుండా సంరక్షించుకోవడం.. ఇలా ఆ పొడవైన జుట్టును మెయింటెయిన్ చేయడం కష్టమవుతుందని భావిస్తుంటారు చాలామంది. నా చుట్టూ ఉన్న వారు కూడా నేను అలాంటి అసౌకర్యానికి గురయ్యానేమోనని భావించేవారు. కానీ నాకు మాత్రం అలాంటి సమస్యలేవీ ఎదురుకాలేదు. వారానికోసారి తలస్నానం చేసేదాన్ని. ఇక దాన్ని ఆరబెట్టడానికి అరగంటకు పైగా సమయం పట్టేది. చిక్కులు కట్టకుండా దువ్వడానికి గంటకు పైగా సమయం కేటాయించేదాన్ని. ఇక అంత పొడవైన జుట్టుతో జడ ఎలా వేసుకుంటుందబ్బా అని మీకు సందేహం రావచ్చు. కానీ నేను నా కేశాలతో జడ వేసుకోవడం కంటే బన్ హెయిర్‌స్త్టెల్ వేసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను. బయటకు వెళ్లినా, పార్టీలకు వెళ్లినా, ఆఖరికి టేబుల్‌టెన్నిస్ ఆడేటప్పుడు, చదువుకునేటప్పుడు కూడా బన్ హెయిర్స్త్టెల్నే ఫాలో అవుతాను. అదే నాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది కూడా. ఈ క్రమంలో మా అమ్మ నాకు సహకరించేది. ఇదంతా నాకు పెద్ద కష్టమేమీ అనిపించేది కాదు. పైగా ఈ కేశ సంపద నా సౌందర్యాన్ని పెంచిందనే నేను భావిస్తాను’ అని చెప్పుకొచ్చిందీ యంగ్ సెన్సేషన్.
ఈ మినీ రాపంజెల్ చాలా అందంగా ఉంది!
నీలాన్షి పటేల్ తన పొడవైన కేశ సంపదకు సంబంధించిన రహస్యాలు, అనుభవాల్ని పంచుకునే క్రమంలో వాటన్నింటినీ ఓ వీడియోగా రూపొందించారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. ‘నీలాన్షి తలస్నానం చేసినప్పుడల్లా తన తల్లి సహాయంతో జుట్టు ఆరబెట్టుకుంటుంది. అయితే తన జుట్టు తడిగా ఉన్నప్పుడే మేం కొలతలు తీసుకోవాలనుకున్నాం. ఎందుకంటే అప్పుడే కురుల పొడవు కచ్చితంగా తెలుస్తుంది’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు గిన్నిస్‌బుక్ ప్రతినిధులు.
ఇక వీడియోను చూసిన నెటిజన్లంతా నీలాన్షిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ మినీ రాపంజెల్ చాలా అందంగా ఉంది’, ‘ఆమె పొడవాటి జుట్టును చూసి షాంపూ కంపెనీలు ఎలాంటి స్పాన్సర్ షిప్‌లు ఇస్తాయో?’, ‘టాంగ్లెడ్’(వాల్ట్ డిస్నీ సినిమా)ని రీమేక్ చేయాలంటే నీలాన్షినే పర్ఫెక్ట్’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.