నెలసరి గురించి మాట్లాడాలంటే సిగ్గు! శ్యానిటరీ న్యాప్కిన్లు కొనాలంటే బిడియం! తమ గురించి ఎవరేమనుకుంటారో, తమను తక్కువ చేసి చూస్తారేమో అన్న ఆలోచనలు, అపోహలు నేటికీ కొన్ని ప్రాంతాల్లోని అమ్మాయిల్లో ఉన్నాయంటే కాదంటారా?! మహిళలంటే వివక్ష ఉన్న బిహార్ రాష్ట్రంలోని నవాడా జిల్లాకు చెందిన అమ్మాయిలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఇది మొన్నటిమాట! ఇప్పుడు అక్కడి అమ్మాయిలు నెలసరి గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నారు.. దాని గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు.. తమ ఆరోగ్య సమస్యల గురించి నలుగురిలో ధైర్యంగా పంచుకుంటున్నారు.. అంతేనా! రోజుకో రూపాయి చొప్పున పోగేసి నెలకు సరిపడా శ్యానిటరీ న్యాప్కిన్లు కొనుక్కుంటున్నారు.. అవసరార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. అందుకే ఇప్పుడు దేశమంతా ఈ అమ్మాయిల వైపే చూస్తోంది.. వారిని చూసి స్ఫూర్తి పొందమని అందరినీ కోరుతోంది. మరి, ఇంతలా అక్కడి అమ్మాయిల్లో మార్పు రావడం వెనుక కారణమేంటి? అంటే.. ఓ బలమైన కారణమే ఉందంటున్నారీ యంగ్ గర్ల్స్. అదేంటో మనమూ తెలుసుకుందాం రండి..
నెలసరి సమయంలో క్లాత్స్, రగ్స్.. వంటివి వాడడం వల్ల అవి ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు ఎంత మొత్తుకున్నా.. ఆ మాటల్ని పెడచెవిన పెట్టి వాటినే వాడుతూ పీకల మీదకు తెచ్చుకునే అతివలు, అమ్మాయిలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. అయితే అందుకు వారిలో నెలసరి పరిశుభ్రత గురించి అవగాహన కొరవడడం ఒక కారణమైతే, డబ్బులు పెట్టి శ్యానిటరీ న్యాప్కిన్లు కొనే స్థోమత లేకపోవడం మరో కారణం. ఈ సమస్యలే బిహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన బాలికల్ని ఆలోచనలో పడేశాయి. దానికి ప్రతిగా ఈ నెలసరి పేదరికాన్ని పారదోలడానికి సమష్టిగా నడుం బిగించి ఓ ప్యాడ్ బ్యాంక్‌ని సైతం ప్రారంభించారీ ‘నవాడా గర్ల్స్’.

బాధలోంచి పుట్టిన ఆలోచన..!
అన్ని చోట్లా ఆరోగ్య కార్యకర్తలు నెలసరి పరిశుభ్రత గురించి అమ్మాయిల్లో అవగాహన కల్పించినట్లే బిహార్‌లోని నవాడా జిల్లాలోనూ ఇలాంటి టీన్ మీటింగ్స్ జరుగుతుంటాయి. అయితే ఆ మీటింగ్స్‌లో నెలసరి సమయంలో ప్యాడ్స్ వాడమని నిపుణులు చెప్పినా పలు కారణాల వల్ల ఆ మాటల్ని ఆచరణలో పెట్టలేకపోయారా అమ్మాయిలు. ఫలితంగా పాత పద్ధతినే కొనసాగించడం వల్ల కొంతమంది అనారోగ్యాలకు గురయ్యే వారు. ఈ క్రమంలో వారు పడుతోన్న బాధను, ఇబ్బందుల్ని దగ్గర్నుంచి గమనించిన మరికొందరు బాలికలు.. దీనికి పరిష్కార మార్గం కనుక్కోవాలనుకున్నారు. అయితే వీరి ఆలోచనకు పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఓ విద్యా వినోద కార్యక్రమం మరింత స్ఫూర్తినిచ్చింది. వీరి ఆలోచన కార్యరూపం దాల్చేందుకు దోహదం చేసింది.
ఆ కార్యక్రమమే ఊతంగా..!
బిహార్‌లోని నవాడా జిల్లాలో పీఎఫ్ఐ స్వచ్ఛంద సంస్థ ‘మే కుచ్ భీ కర్ సక్తీ హూ (నేను ఏమైనా చేయగలను) అనే పేరుతో ఓ విద్యా వినోద కార్యక్రమం ప్రారంభించింది. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, చిన్న వయసులోనే తల్లవడం-పదే పదే గర్భం దాల్చడం వల్ల కలిగే అనారోగ్యాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులు, గృహ హింస, శృంగారం.. తదితర విషయాల గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. అయితే ఆ కార్యక్రమంలో నవాడా గర్ల్స్ కూడా పాల్గొన్నారు. అప్పటికే నెలసరి గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్న వారు.. ఈ కార్యక్రమ స్ఫూర్తితో అమ్మాయిలు, అమ్మలు, కుటుంబాల్లో నెలసరి పరిశుభ్రత, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కలిగే మార్పులు, ఎదురయ్యే సమస్యల గురించి అవగాహన కల్పించాలనుకున్నారు. అంతేకాదు.. వీరంతా రోజుకో రూపాయి చొప్పున పోగేసుకొని నెల రోజులకు రూ.30 జమయ్యాక వాటితో నెలకు సరిపడా శ్యానిటరీ న్యాప్కిన్లు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు.
వారికోసమే ‘ప్యాడ్ బ్యాంక్’!
మరి, తామైతే రోజుకో రూపాయి పోగేయగలం.. అలాంటి పరిస్థితి కూడా లేని పేద మహిళలు, అమ్మాయిల పరిస్థితేంటి? అన్న ఆలోచన ఈ బాలికల్లో కలిగింది. అలాంటి వారికి ఉచితంగా ప్యాడ్స్ అందించడానికి ‘శ్యానిటరీ ప్యాడ్స్ బ్యాంక్’ను సైతం ఏర్పాటు చేశారు. ఇలా రోజుకో రూపాయి పోగేసుకొని నెలకో శ్యానిటరీ న్యాప్కిన్ ప్యాకెట్ కొనుక్కోవడంతో పాటు లేనివారికీ వాటిని ఉచితంగా అందిస్తున్నారీ నవాడా గర్ల్స్. 2016లో బీజం పడిన ఈ ప్యాడ్ బ్యాంక్ నేటికీ ఎంతోమంది అమ్మాయిలకు ఆసరాగా నిలుస్తోంది. ఇక తమ ప్రయత్నాన్ని అక్కడే ఆపకుండా స్థానికంగా యువ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేశారీ అమ్మాయిలు.
ప్రస్తుతం నవాడా గర్ల్స్ బృందంలో దాదాపు 300 మంది బాలికలున్నారు. నవాడాతో పాటు దర్భంగా జిల్లాలో మొత్తం ఎనిమిది క్లినిక్స్‌ని తెరిచారీ అమ్మాయిలు. యుక్తవయసులో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిల్ని నెలకోసారి ఒక్క చోట చేర్చి లింగ సమానత్వం, లైంగిక ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం.. వంటి విషయాల గురించి చర్చిస్తున్నారు.. వారిలో అవగాహన పెంచుతున్నారు. ఈ క్రమంలో బాలురే కాదు.. బాలికలూ తమకెదురయ్యే నెలసరి సమస్యల గురించి పంచుకోవడానికి మొహమాటపడట్లేదంటే నవాడా గర్ల్స్ అక్కడి అమ్మాయిల్లో ఎంత స్ఫూర్తి నింపారో మనం అర్థం చేసుకోవచ్చు.
ఏ మార్పు అయినా చిన్న ప్రయత్నంతోనే మొదలవుతుంది.. అదే నలుగురిలో స్ఫూర్తి నింపుతూ ఓ మంచి పనికి దారి తీస్తుంది.. నవాడా గర్ల్స్ విషయంలో ఇది నిజమైంది.. అందుకే ప్రస్తుతం దేశమంతా వారి వైపే చూస్తోంది. అమ్మాయిలందరినీ వారినే స్ఫూర్తిగా తీసుకోమంటోంది..! కీప్ ఇట్ అప్ నవాడా గర్ల్స్!!