నమస్తే మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నాకు ఈ మధ్య చాలా దిగులుగా ఉంటుంది. ఒకప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ బాగా చదివేదాన్ని.. కానీ కొన్ని రోజుల నుంచి మనసు నిలకడగా ఉండటం లేదు. ఏ పని చేసినా సగంలోనే ఆపేస్తున్నా. నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలనుకుంటున్నా.. కానీ తీరా చదివే సమయంలో ‘ఇప్పుడు ఇది కాదేమో.. వేరే సబ్జెక్ట్ చదివితే బాగుండు!’ అనిపిస్తుంది. ప్రతి విషయంలోనూ ఇలాగే అనిపిస్తుంది. దీంతో ఏ పనిని సంపూర్ణంగా చేయలేకపోతున్నా.. దీనివల్ల ఏదో ఆరాటం, బాధ, దిగులు నాలో కనిపిస్తుంది. రాత్రిళ్లు సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. రేపు ఎలాగైనా ఈ పని చేయాలని పడుకుంటాను. కానీ మరుసటి రోజు మళ్లీ అదే అసంపూర్ణత! నేనేందుకు హుషారుగా ఉండలేకపోతున్నాను?దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
జ. మీ వయసులో ఉన్న వాళ్లు చాలామంది లక్ష్యసాధనే ధ్యేయంగా ముందుకు వెళుతుంటారు. అయితే లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీరు ఎంత క్రమశిక్షణతో పనిచేస్తున్నామనేది కూడా ముఖ్యమే. దానికి తగ్గట్టుగా ప్రణాళిక, నిబద్ధత, నియమావళిని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే మీ విషయంలో నిబద్ధతలో సమస్య లేకపోయినప్పటికీ ‘ఏవిధంగా అడుగులు వేయాలి’ అన్న విషయంలో స్పష్టత లేనట్టుగా తెలుస్తోంది. దీనికోసం మీరు మీలాగే ఆలోచించే కొంతమంది స్నేహితులతో మాట్లాడి చూడండి. మీరందరూ సమూహంగా ఏర్పడి ఒకరికొకరు సహాయం చేసుకునేలా ప్రయత్నం చేయండి.
మీ ఆర్థిక పరిస్థితి కనుక మీకు సహకరిస్తే ఇప్పుడున్న పరిస్థితులకనుగుణంగా కోచింగ్ తీసుకోగలుగుతారేమో చూడండి. కొన్ని సందర్భాల్లో కోచింగ్ తీసుకోవడం వల్ల కేవలం విజ్ఞానం పొందడమే కాకుండా క్రమశిక్షణ కూడా అలవడే అవకాశం ఉంటుంది. అలాగని కోచింగ్ తీసుకోవడం వల్లే జీవితంలో పైకొస్తారనుకోవడం కూడా సరైంది కాదు. సొంతంగా ప్రణాళికలు రచించుకొని, నిబద్ధత, క్రమశిక్షణతో చదివి విజయాలు సాధించిన వారు ఎంతోమంది ఉన్నారు. మీరు అనుసరిస్తోన్న పద్ధతిలో లోపమా? లేక ఆచరణలో లోపమా అనేది స్వీయ పరిశీలన చేసుకోండి. ఆలోచన ఒక్కటి సరిపోదు.. ఆలోచనతో పాటు ఆచరణ కూడా ముఖ్యమే. దీనికోసం పైన చెప్పినట్టుగా దానికి కావాల్సిన ప్రణాళికలను మీకు మీరే రచించుకోవాలి.
ఒకవేళ కోచింగ్ తీసుకోవడం సాధ్యం కాకపోతే మీకు మీరే కోచ్‌గా మారండి. మీ బలహీనతలను తెలుసుకుని వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ఈ క్రమంలో పోటీ పరీక్షల్లో టాపర్స్‌గా నిలిచిన వారి విజయగాథలను తెలుసుకోండి. అలాగే మీరు ఒక్కరే కాకుండా తోటి స్నేహితులతో చదువుకునే ఏర్పాట్లు చేసుకోండి. దీనివల్ల మీ విజ్ఞానాన్ని పెంచుకోవడంతో పాటు సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో ఎక్కడ లోపాలున్నాయనే విషయం మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా మరిన్ని విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరుగుతుంది. ఏది ఏమైనా మీకంటూ ఒక ప్రణాళికను ఏర్పరచుకుని దానిని సాధించే దిశగా అడుగులు వేయండి. ఈ క్రమంలో ఎలాంటి ప్రతికూల ఆలోచనలకు తావివ్వకండి. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే విజయం మీదే అన్న విషయాన్ని మరవకండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్