Image for Representation
పెద్దయ్యాక నేను డాక్టరవ్వాలి, ఆర్కిటెక్ట్ అవ్వాలి అని ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. అయితే పెరిగి పెద్దయ్యే కొద్దీ కొంతమంది తమ కలల్ని మార్చుకుంటే.. మరికొందరు చిన్ననాటి కలను నెరవేర్చుకునేదాకా నిద్రపోరు. జమ్మూ-కశ్మీర్‌కు చెందిన తన్యా గుప్తా కూడా అంతే! చిన్నతనం నుంచే బేకింగ్‌పై మక్కువ పెంచుకున్న ఆమె.. దానికోసం మంచి జీతమొచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. అంతలోనే కరోనా మహమ్మారి విజృంభించడంతో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతోన్న తన వ్యాపారం ఒక్కసారిగా కుదేలైనా వెనక్కి తగ్గలేదామె. కొత్తగా ఆలోచించి, తన ఉత్పత్తుల్ని సరికొత్తగా ప్రమోట్ చేయడం ప్రారంభించి.. ఈ కరోనా సమయంలోనూ వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే గట్టి పట్టుదల ఉంటే ఎన్ని అడ్డంకులెదురైనా మన పయనాన్ని ఆపలేవంటోన్న తన్యా అంతరంగమిది!
హాయ్.. నా పేరు తన్యా గుప్తా. మాది జమ్మూ-కశ్మీర్. నాన్న వ్యాపారం చేస్తుంటారు. అమ్మ గృహిణి. ప్రతి ఒక్కరికీ చిన్నతనం నుంచి ఏదో ఒక కల ఉండనే ఉంటుంది. ఆ విషయం గురించి నన్నడిగితే బేకింగ్ అనే చెప్తా. అది నా జీవితాశయం. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చాక, మా ఇంట్లో వాళ్ల కోసం, మా బంధువుల కోసం.. కేక్స్, వివిధ రకాల బేకింగ్ ఐటమ్స్ తయారుచేసేదాన్ని. అలా నా వయసుతో పాటే బేకింగ్‌పై మక్కువ నాలో మరింత పెరిగింది.
ఉద్యోగమొచ్చినా ఏదో వెలితి..!
జమ్మూ విశ్వవిద్యాలయం నుంచి హోమ్ సైన్స్‌లో బీఏ పూర్తి చేశాక.. 2018లో దిల్లీ వెళ్లా. అక్కడి ‘ట్రఫుల్ నేషన్ స్కూల్’లో చేరి బేకింగ్‌లో ఏడాది శిక్షణ తీసుకున్నా. పేరుకైతే ఏడాది కానీ నాలుగైదు నెలల్లోనే ఇందులో పూర్తి నైపుణ్యాలు సంపాదించానంటే నాకు బేకింగ్ అంటే ఎంతిష్టమో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆపై దిల్లీలోనే చెఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేశా. మంచి జీతం, ఒత్తిడి లేని పని.. కెరీర్ పరంగా ఎవరికైనా ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఎప్పుడు చూసినా ఏదో వెలితిగా అనిపించేది. బేకింగ్ బిజినెస్ మొదలుపెట్టాలన్న నాలో ఉన్న కోరికే అందుకు ముఖ్య కారణమని తెలుసుకొని ఉద్యోగం వదిలేసి ఇంటికెళ్లిపోయా.
రెండు లక్షలు పెట్టుబడిగా..!
అలా ఈ ఏడాది జనవరిలో ఇంటికొచ్చిన నేను.. ‘ది బేకింగ్ వరల్డ్’ పేరుతో బేకింగ్ వ్యాపారం ప్రారంభించా. నేను ఉద్యోగం చేసినప్పుడు దాచుకున్న రెండు లక్షల రూపాయల్ని ఇందులో పెట్టుబడిగా పెట్టాను. మా వంటింటినే వర్క్‌షాప్‌గా మార్చేశా. కేక్స్, మఫిన్స్, కుకీస్.. వంటి విభిన్న రకాల బేకింగ్ ఐటమ్స్ తయారు చేసేదాన్ని. మాకు తెలిసిన వారు, ఫ్రెండ్స్ అందరినీ ఓ వాట్సప్ గ్రూప్‌గా క్రియేట్ చేసి.. ఆ ఐటమ్స్‌ని అందులో ప్రమోట్ చేసేదాన్ని. అవి వాళ్లకు కూడా నచ్చడంతో ఆర్డర్స్ ఇచ్చే వారు.. ఇలా మాకు తెలిసిన వాళ్లే కాదు.. వాళ్లకు తెలిసిన వాళ్లు, వాళ్ల ఫ్రెండ్స్.. ఇలా ఒక చెయిన్ మాదిరిగా బిజినెస్ క్రమక్రమంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ‘హమ్మయ్య.. నేను కన్న కల సాకారమవుతోంది..’ అనుకున్న తరుణంలోనే కరోనా మహమ్మారి మన దేశంలోకి అడుగుపెట్టింది. అది నా వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. ఎంతలా అంటే.. ఒక దశలో నా బేకింగ్ బిజినెస్ పూర్తిగా మూతపడుతుందేమో అనిపించేంతలా!
సోషల్ మీడియా వేదికగా..!
అయినా నేను వెనక్కి తగ్గలేదు. ‘లాక్డౌన్ ప్రకటించినప్పటికీ పుట్టినరోజులు, పెళ్లిరోజులు, ఇతర అకేషన్స్ ఆగవు కదా.. అలాంటి ప్రత్యేక సందర్భాల్లో కేక్స్ తప్పనిసరి కదా!’ అనిపించింది. ఆ ఆలోచనతోనే అప్పటిదాకా వాట్సప్ గ్రూప్‌కే పరిమితమైన నేను.. ఆపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీల్ని క్రియేట్ చేసి వాటి ద్వారా నా బేకింగ్ ఐటమ్స్ పోస్ట్ చేయడం ప్రారంభించాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఆర్డర్స్ కూడా క్రమంగా పెరగసాగాయి. వారి అభిరుచులకు, నా నైపుణ్యాలను జత చేసి నాణ్యమైన, చూడగానే ఆకట్టుకునేలా ఉండే కేక్స్, ఇతర బేకింగ్ ఐటమ్స్ తయారుచేసి వినియోగదారులకు పంపించడం మొదలుపెట్టాను. అలా ఇప్పుడిప్పుడే నా వ్యాపారం క్రమంగా కుదురుకుంటోంది.
మా వద్ద ఎగ్, ఎగ్‌లెస్, పిల్లలు-పెద్దల కోసం ఆయా సందర్భాలకు తగినట్లుగా ప్రత్యేకంగా రూపొందించిన కేక్స్ చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ఇలా నెలకు సుమారు రూ. 50 వేలకు పైగానే సంపాదిస్తున్నా. అయితే ఇప్పటిదాకా ఆన్‌లైన్‌కే పరిమితమైన నా వ్యాపారాన్ని త్వరలోనే బేకింగ్ షాప్స్ దాకా విస్తరించాలనుకుంటున్నా. అది కూడా కేవలం జమ్మూలోనే కాదు.. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నా.
అమ్మానాన్న ప్రోత్సాహం తోడైతే..!
నేను ఇలా నా కలను నెరవేర్చుకోవడానికి చిన్నతనం నుంచీ అమ్మానాన్నల ప్రోత్సాహం ఎంతో ఉంది. కరోనా కారణంగా మధ్యలో కాస్త ఒడిదొడుకులకు లోనైనా ప్రస్తుతం వ్యాపారంలో ఒక్కో మెట్టూ ఎక్కుతున్న నన్ను చూసి అమ్మానాన్న ఎంతో సంతోషిస్తున్నారు. నిజంగా.. పేరెంట్స్ ప్రోత్సాహం ఉంటేనే కదా.. పిల్లలు వారి కలల్ని నెరవేర్చుకునేది! అందుకే చివరగా అమ్మానాన్నలందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా.. ఆడ-మగ అన్న తేడా చూడకండి.. అమ్మాయిల్నీ అబ్బాయిలతో సమానంగా పెంచండి.. చదివించండి.. వారు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే అవకాశం వారికి ఇవ్వండి..!