సాధారణంగా పండగలంటేనే ఒక రకమైన పాజిటివిటీ, ఆనందం మన చుట్టూ అలుముకుంటాయి. అయితే మిగిలిన అన్ని పండగల కంటే దసరా ఎంతో విభిన్నమైంది. ఇది కేవలం స్త్రీ శక్తి సాధించిన విజయం మాత్రమే కాదు.. ఈ పండగ మనకు మరెన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ ఉండాల్సిన కొన్ని మంచి గుణాలను, లక్షణాలను మనకు తెలియజేస్తుంది. అంతేనా.. వదిలేయాల్సిన కొన్ని దుర్గుణాల గురించి కూడా వివరిస్తుంది. మరి, దసరా నుంచి మనం నేర్చుకోదగిన కొన్ని పాఠాలేంటో తెలుసుకుందాం రండి..

చిన్నచూపు చూడొద్దు..
మహిషాసురుడు కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మ నుంచి ఒకే ఒక్క వరం కోరుకున్నాడు. అది తనకి చావు లేకుండా వరం ప్రసాదించమని..! కానీ బ్రహ్మ దానికి ఒప్పుకోకుండా.. చావు లేకుండా ఉండే అవకాశం లేదు కాబట్టి ఎవరో ఒకరిని మినహాయించి మిగిలిన వారి చేతిలో మరణం సంభవించకుండా కాపాడతానని మాటిస్తాడు. ఆడవారు అబలలని తలచిన మహిషాసురుడు వారికి తనని చంపేంత శక్తి ఉండదని అందుకే కేవలం ఆడవారి చేతిలో మాత్రమే మరణించే శక్తిని తనకు ఇవ్వమని కోరతాడు. ఆపై తనను ఇక ఎవరూ చంపలేరని విర్రవీగుతాడు. కానీ అబల అంటూ చిన్నచూపు చూసిన ఓ ఆడదే మహిషాసుర మర్దినిగా మారి అతడిని సంహరిస్తుంది. ఎవరినైనా సరే.. వారు మనకంటే ఎంత తక్కువ వాళ్లయినా సరే వారిని చిన్నచూపు చూడడం సరికాదని ఈ కథ చెబుతుంది. అంతేకాదు.. ఎంత సంపద ఉన్నా.. మరెంత విజ్ఞానం ఉన్నా 'నాకే అన్నీ తెలుసు. నా దగ్గర అన్నీ ఉన్నాయి..' అంటూ విర్రవీగడం సరికాదు.. ప్రతిఒక్కరికీ పక్కవారి అవసరం ఎప్పుడైనా రావచ్చు. అందుకే అహంకారాన్ని వీడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని దసరా మనకు గుర్తుచేస్తుంది.

మంచి ఎప్పటికైనా గెలుస్తుంది..
ఏ రాక్షసుడి అంతమైనా అంత సులభంగా సాగదు.. రావణుడిపై రాముడు పది రోజులు యుద్ధం జరిపి విజయం సాధించాడు. మహిషాసురమర్దిని ముందు యుద్ధం చేయడం ఆరంభించినప్పుడు అసురుడు తనదైన రీతిలో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక రక్తబీజుడనే రాక్షసుడి రక్తం ఎన్ని చుక్కలు భూమిపై పడితే.. అతని రూపంలో ఉన్న అంతమంది రాక్షసులు ఉద్భవించే వరాన్ని పొందాడు.. ఇలా అసురులందరూ తమని తాము కాపాడుకోవడానికి ఎన్నో వరాల్ని పొందారు. అయితే చెడు ముందు ఎంత విర్రవీగినా.. చివరికి మంచి చేతిలో హతమవ్వాల్సిందే.. మన జీవితంలోనూ ఎన్నోసార్లు అబద్ధాలు, నిందలు రాజ్యమేలుతుంటాయి. కానీ ఆఖరికి నిజమే గెలుస్తుందన్న విషయం మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. అందుకే ఎప్పుడూ మంచి వైపే ఉండాలి. అయితే అప్పటికి తాత్కాలికంగా అపజయం పాలైనా చివరికి మంచిదే విజయం అన్న విషయం అక్షర సత్యం.

ఒక్కటున్నా.. వినాశనమే..
దసరా కేవలం మహిషాసురుడిని హతం చేసినందుకే కాదు.. రావణుడు మరణించిన రోజుకి గుర్తుగా కూడా జరుపుకుంటారు. రావణుడు బ్రహ్మ మనవడు. ఎన్నో విద్యల్లో అతడికి ప్రవేశం ఉంది. నాలుగు వేదాలు, ఆరు శాస్త్రాల్లో ఆరితేరాడు.. వీణాపాణి.. ఎంతోమంచి రాజు.. శివుడికి పరమభక్తుడు. ఆయన కోసం కఠోర తపస్సు చేశాడు. పది తలలతో పాటు మనుషుల చేతిలో తప్ప ఇంకెవరి చేతిలోనూ మరణించని గొప్ప వరాన్ని పొందాడు. మొత్తంగా చూసుకుంటే రాముడి మాదిరే ఎన్నో అద్భుతమైన గుణాలు రావణుడికీ ఉన్నాయి. అయితేనేం.. ఒక్క అవలక్షణం అతడిని పడగొట్టింది. మరణానికి దారితీసేలా చేసింది. పరాయి స్త్రీని ఆశించడం ఎంత తప్పో రావణుడి కథను వింటే మనకు తెలుస్తుంది. అలాగే మనకు ఎన్ని మంచి లక్షణాలున్నా.. ఒక్క చెడు లక్షణం వాటన్నింటినీ మరుగున పడేస్తుందని, మనం సాధించిన మంచి పేరును చెడగొడుతుందని వివరిస్తుంది దసరా పండగ..

కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి..
దసరా నుంచి కొత్త జీవితం ప్రారంభించాలంటూ ఈ పండగ రెండు రకాలుగా చెబుతుంది. రావణుడి పది తలలు మనలో ఉన్న పది అవలక్షణాలకు నిదర్శనం. అలా పది తలల రావణుడిని కాల్చినట్లు మనలో ఉన్న కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం, స్వార్థం, అమానవీయత, అన్యాయం, అహంకారం అనే గుణాలను కాల్చేసి మంచి మనిషిగా మారాలని దసరా మనందరికీ ఓ సందేశాన్ని అందిస్తుంది. అంతేకాదు.. పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం కాలం పూర్తయ్యాక.. అరణ్యంలో శమీ వృక్షంపై దాచిన తమ ఆయుధాలను బయటకు తీసి పూజిస్తారు. ఆ తర్వాతే వారు కురుక్షేత్ర యుద్ధంలో గెలుపొందడం.. తిరిగి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. అంటే కష్టాలన్నింటిపై విజయ దశమి నాడు విజయం సాధించి సంతోషం దిశగా అడుగులు వేయడం ప్రారంభించారన్నమాట. అలా మన జీవితం కూడా కష్టాల నుంచి సుఖాల వైపు నడుస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తుంది దసరా పండగ..!