మన దేశంలో మెడిసిన్ కోర్సులకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మెడికల్ కళాశాలలో సీటు సంపాదిస్తే..విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమమైనట్లే. అందుకే మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం ఎంతోమంది విద్యార్థులు కష్టపడుతుంటారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో 720 మార్కులతో ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్ టాపర్‌గా నిలిచాడు. బాలికల విషయానికొస్తే దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్ కూడా 720 మార్కులు సాధించినప్పటికీ రెండు ర్యాంకులో నిలిచింది. వయసులో ఆమె షోయబ్ కన్నా చిన్నది కావడంతో రెండో ర్యాంకుతోనే సరిపెట్టుకుంది. మరి ఆమెతో పాటు టాప్-10 ర్యాంకుల్లో నిలిచి సత్తా చాటిన కొందరి విద్యార్థినుల గురించి తెలుసుకుందాం రండి...
దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం సెప్టెంబర్ 13న నీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 15, 97, 435 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకున్నారు. జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా సుమారు 3, 862 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 11 భాషల్లో జరిగిన ఈ పరీక్షకు 13, 66, 945 (85.57శాతం) విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా విడుదలైన పరీక్షా ఫలితాల్లో మొత్తం 7,71,500 మంది విద్యార్థులు అర్హత మార్కులు సాధించారు.
టై బ్రేకర్ రూల్‌తో టాప్ ర్యాంకు దూరమైంది!
నీట్-2020 ఫలితాల్లో 720 మార్కులతో ఒడిషాకు చెందిన షోయబ్ అఫ్తాబ్ ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. అయితే యూపీకి చెందిన ఆకాంక్షా సింగ్ కూడా అవే మార్కులు తెచ్చుకుంది. కానీ నీట్లో అమలవుతోన్న ‘టై బ్రేకర్’ రూల్ కారణంగా ఆమె రెండో ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది విద్యార్థులు ఒకే రకం మార్కులు సాధించిన సందర్భాల్లో ఈ విధానం ద్వారా ర్యాంకులు కేటాయిస్తారు. ఈ రూల్ ప్రకారం ఇద్దరు అభ్యర్థులు సమాన మార్కులు సాధించినప్పుడు వారికి ర్యాంక్ కేటాయించేటప్పుడు ముందుగా బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను చూస్తారు. ఆ తర్వాత ఎవరికి ఎక్కువ నెగెటివ్ మార్కులు వచ్చాయో పోలుస్తారు. అప్పటికీ ఇద్దరూ సమానంగా ఉంటే వయసును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో షోయబ్‌తో సమాన మార్కులు వచ్చినప్పటికీ వయసులో చిన్నదైన ఆకాంక్ష టాప్ ర్యాంకుకు దూరం కావాల్సి వచ్చింది.
ఐఏఎఫ్ ఆఫీసర్ అవుదామనుకున్నా... కానీ!
ఈ క్రమంలో ఫిమేల్ టాపర్‌గా నిలిచిన ఆకాంక్ష... న్యూరో సర్జన్ కావడమే తన ప్రధాన లక్ష్యమంటోంది. ‘మాది ఉత్తర ప్రదేశ్. అక్కడి కుషీ నగర్ జిల్లాలోని అభినాయక్పూర్ మా సొంత పట్టణం. నాన్న రాజేంద్ర కుమార్ రిటైర్డ్ ఐఏఎఫ్ ఆఫీసర్. అమ్మ రుచీ సింగ్ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. మొదట్లో నాన్నలాగే నేను కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరదామనుకున్నాను. కానీ తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. ప్రజలతో మరింత మమేకం అవ్వాలంటే డాక్టర్ అవ్వడమే మేలని డిసైడ్ అయ్యాను. ప్రఖ్యాత ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో మెడిసిన్ కోర్సు చేయాలని ఉండేది. ఇందులో భాగంగా పదో తరగతి పూర్తయ్యాక ప్లస్ టూ చదువుల కోసం నేను దిల్లీకి వచ్చాను. అక్కడి హాస్టల్లో నాన్నతో పాటు కలిసి ఉండి చదువు కొనసాగించాను. మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లో జాయినయ్యాను’.
రోజూ 12 గంటలు చదివాను! ‘నీట్ ప్రిపరేషన్లో భాగంగా నేను రోజూ 10-12 గంటల పాటు చదివేదాన్ని. నా ఇనిస్టిట్యూట్ స్టడీ మెటీరియల్‌తో పాటు NCERT పుస్తకాలను తిరగేశాను. ఎడ్యుకేషనల్ ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించిన ఆన్లైన్ క్లాసులకు కూడా హాజరయ్యాను. అయితే అదే పనిగా పుస్తకాలు పట్టుకుని కూర్చోవడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. అప్పుడప్పుడూ అర్జిత్‌సింగ్ పాటలు, మోటివేషనల్ స్పీకర్ సందీప్ మహేశ్వరి యూట్యూబ్ వీడియోలు చూస్తూ రిలాక్స్ అయ్యాను. ఇక కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో పరీక్ష వాయిదా పడినప్పటికీ నాకు మాత్రం మేలే జరిగింది. నా నోట్స్‌ను రివైజ్ చేసుకునేందుకు కావాల్సినంత సమయం దొరికింది. ఇక నా సక్సెస్ క్రెడిట్లో అమ్మానాన్నలదే సింహభాగం. వారు అందించిన మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైంది. నాతో ఉండడం కోసం నాన్న వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇక నాకు కావాల్సిన అవసరాలన్నింటనీ అమ్మే దగ్గరుండి చూసుకుంది’. పరీక్ష పైనే దృష్టి సారించాను! ‘డాక్టరవ్వాలన్న ఏకైక లక్ష్యంతోనే చిన్నప్పటి నుంచి చదువును కొనసాగించాను. అలాగే నీట్ పరీక్ష కోసం సుదీర్ఘ కాలం పాటు ప్రిపరేషన్ కొనసాగించాను. అయితే కరోనా కారణంగా మూడు గంటల పాటు చేతులకు గ్లోవ్స్, ఫేస్ మాస్కులు ధరించి పరీక్ష రాయడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది. అయితే ఇవేవీ నా లక్ష్యానికి అడ్డు కాకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇబ్బందులను పక్కన పెట్టి పరీక్ష పైనే పూర్తి దృష్టి సారించాను. ఎంబీబీఎస్ పూర్తయ్యాక న్యూరోసర్జరీలో రీసెర్చ్ చేస్తాను. ఆ తర్వాత మెడికల్ ప్రాక్టీషనర్‌గా స్థిరపడతాను ’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది ఆకాంక్ష. సత్తా చాటిన తెలుగు విద్యార్థినులు! నీట్-2020 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థినులు కూడా సత్తా చాటారు. హైదరాబాద్‌కు చెందిన తుమ్మల స్నిఖిత 715 మార్కులతో ఆలిండియా మూడో ర్యాంకు సాధించగా, ఇవే మార్కులు సాధించిన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తి చైతన్య సింధు ఆలిండియా ఆరో ర్యాంకును సొంతం చేసుకుంది.
|
తాతను ఆదర్శంగా తీసుకున్నాను!

నీట్ ఫలితాల్లో తెలంగాణ టాపర్‌గా నిలిచింది తుమ్మల స్నిఖిత. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు వచ్చిందంటోంది. ‘మా సొంతూరు నిజామాబాద్ జిల్లా పోచంపాడు దగ్గరున్న వెల్కలూరు. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. నాన్న డాక్టర్ సదానందరెడ్డి కార్డియాలజిస్టు. అమ్మ డాక్టర్ లక్ష్మి గైనకాలజిస్టు. ఇక నా ప్రిపరేషన్ విషయానికి వస్తే.. మొదట సబ్జెక్టుని బాగా అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత రెగ్యులర్ టెస్ట్‌ల ద్వారా నా ప్రోగ్రెస్‌పై ఓ అంచనా వేసుకున్నాను. లాక్డౌన్ సమయంలో నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. ప్రిపరేషన్‌కు సంబంధించి విలువైన సలహాలు, సూచనలు అందించారు. నేను చిన్నప్పటి నుంచే తాతయ్యను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆయనలాగే ఎయిమ్స్‌లో మెడిసిన్ పూర్తి చేసి గౌరవప్రదమైన డాక్టర్‌గా గుర్తింపు పొందాలనుంది’ అని చెబుతోంది స్నిఖిత.
|
డాక్టరవ్వాలని అప్పుడే డిసైడయ్యాను!

ఇక స్నిఖిత లాగే 715 మార్కులు సాధించిన గుత్తి చైతన్య సింధు ఆలిండియా స్థాయిలో ఆరో ర్యాంకును సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఆమె నీట్ ఫలితాల్లో ఏపీ స్టేట్ టాపర్‌గా నిలిచింది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఏపీ ఎంసెట్ (మెడికల్ అండ్ అగ్రికల్చరల్) ఫలితాల్లోనూ సింధూనే స్టేట్ టాప్ ర్యాంకర్ కావడం విశేషం.
‘మా ఇంట్లో చాలామంది వైద్యులున్నారు. మా తాత డాక్టర్ గుత్తి సుబ్రమణ్యం ప్రభుత్వ వైద్యులుగా పనిచేసి రిటైరయ్యారు. నాన్న డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ ఈఎన్టీ స్పెషలిస్టుగా పని చేస్తున్నారు. అమ్మ డాక్టర్ గైనకాలజిస్టుగా విధులు నిర్వర్తిస్తోంది. వీరందరి స్ఫూర్తితో నేను కూడా స్కూల్‌డేస్‌లోనే డాక్టర్ అవ్వాలనుకున్నాను. వీరితో పాటు నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంక్ సాధించాను. దిల్లీ ఎయిమ్స్‌లో డాక్టర్ కోర్సు పూర్తి చేయాలన్నది నా కోరిక’ అని అంటోందీ ఏపీ టాపర్.
|