సాధారణంగా పదేళ్ల వయసంటే చదువు, ఆటపాటలతో ఆనందంగా గడుపుతుంటారు పిల్లలు. ఇప్పుడంటే స్కూళ్లు లేవు కాబట్టి చిన్నారులు అమ్మ వండిపెట్టింది తింటూ.. ఫోన్, టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమందేమో ఆన్లైన్ క్లాసుల బిజీలో ఉన్నారు. అయితే కేరళకు చెందిన ఓ పదేళ్ల చిన్నారి మాత్రం చకచకా వంటకాలు వండేస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంత రుచిగా, మెరుపు వేగంతో రుచికరమైన వంటకాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి పదేళ్ల వయసులో గరిటె తిప్పుతూ ప్రపంచ రికార్డులు సృష్టిస్తోన్న ఈ కుకింగ్ గర్ల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి...

గంటలో 33 వంటకాలు!
వండిపెట్టినవి తినడం ఈజీనే... కానీ వంట చేయడం మాత్రం అంత ఆషామాషీ విషయమేమీ కాదు. సాధారణంగా ఎంత వేగంగా చేసినా కూడా ఒక రుచికరమైన వంటకం తయారుచేయాలంటే కనీసం అరగంటైనా పడుతుంది. అలాంటిది గంటలో 33 వంటకాలు తయారుచేసి అందరినీ ఆశ్చర్యపరిచింది పదేళ్ల వయసున్న శాన్వి ఎం. ప్రాజిత్. ఇడ్లీ నుంచి చికెన్ రోస్ట్ వరకు అన్ని రకాల వంటకాలను చిటికెలో రడీ చేసిన ఈ చిన్నారి ఏకంగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది.

ఇడ్లీ నుంచి చికెన్ రోస్ట్ వరకూ!
శాన్వి తండ్రి పేరు ప్రాజిత్ బాబు.. నౌకదళంలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. తల్లి మంజిమ.. గతంలో స్టార్ చెఫ్‌గా పలు రియాల్టీ షోల్లో పాల్గొంది. కేరళ రాష్ట్రానికి చెందిన వీరు ప్రస్తుతం విశాఖపట్నంలోనే స్థిరపడ్డారు. అయితే స్టార్ చెఫ్ అయిన తన తల్లిని స్ఫూర్తిగా తీసుకున్న శాన్వి వేగంగా వంటలు చేయడం నేర్చుకుంది. అమ్మబాటలోనే నడుస్తూ పలు వంటల పోటీల్లో పాల్గొని సత్తా చాటుతోంది. ఇక ‘Saanvi Cloud 9’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోన్న ఈ ఛోటా చెఫ్.. తాను తయారుచేసిన వంటకాలన్నింటికి సంబంధించిన వీడియోలను అందులో అప్లోడ్ చేస్తుంటుంది. ఈక్రమంలో ఇటీవల నిర్వహించిన ఓ వంటల పోటీలో భాగంగా గంటలోనే 33 వంటకాలు చేసింది శాన్వి. ఇడ్లీ, దోసె, ఊతప్పం, ఫ్రైడ్ రైస్, అప్పం, ఆమ్లెట్, చికెన్ రోస్ట్, పన్నీర్ టిక్కా, వాఫెల్స్, కార్న్ ఫ్రిట్టర్స్, మష్రూమ్ టిక్కా, ఎగ్ బుల్స్ ఐ, శాండ్విచ్, పాప్డీ ఛాట్, ప్యాన్ కేక్...లాంటి టేస్టీ డిషెస్‌ను చిటికెలో తయారుచేసింది. ఈ సందర్భంగా శాన్వి ఇంట్లో వంట చేస్తుండగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అథారిటీ అధికారులు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించారు. సాక్ష్యంగా ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లను కూడా చిన్నారి పక్కనే ఉంచారు.

అమ్మ ప్రోత్సాహంతోనే!
ఇలా తన తల్లి సహకారంతో చకచకా వంటకాలు పూర్తిచేసిన శాన్వి అక్కడి గెజిటెడ్ ఆఫీసర్ల చేతుల మీదుగానే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్‌ను అందుకుంది. ఇదంతా అమ్మ ప్రోత్సాహం వల్లే సాధ్యమైందని, ఈ క్రెడిటంతా అమ్మకే దక్కుతుందంటోందీ లిటిల్ చెఫ్. ‘మా అమ్మ స్టార్ చెఫ్. పలు రియాల్టీ కుకరీ షోల్లో పాల్గొంది. ఓ పోటీలో ఫైనల్ కంటెస్టెంట్‌గా కూడా నిలిచింది. అమ్మ స్ఫూర్తి, ఆమె అందించిన మెలకువలతోనే నేను ఇక్కడివరకు రాగలిగాను. అమ్మతో పాటు నా కుటుంబ సభ్యులు, నా వంటలు తింటున్న నా స్నేహితుల ప్రోత్సాహంతోనే పలు వంటల పోటీల్లో పాల్గొన్నాను. ఇక కొద్ది రోజుల క్రితమే నేను ఓ యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాను. దానికి కూడా మంచి స్పందన వస్తోంది. నాకు కుకింగ్‌తో పాటు భరతనాట్యం అంటే కూడా ఇష్టం’ అంటోంది శాన్వి.

తన టీతోనే మా దినచర్య ప్రారంభం!
పాకశాస్ర్త ప్రావీణ్యంతో రికార్డులు సృష్టిస్తోన్న కూతురిని చూసి ఉబ్బితబ్బిబ్బైపోతోంది మంజిమ. ‘మాది కేరళలోని కన్నూర్. ఈ ప్రాంతం ఎన్నో రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి. అందులో భాగంగా మా ఇంట్లో కూడా అందరూ వంట చేస్తారు. ఇక శాన్వి విషయానికొస్తే చిన్న వయసులోనే కిచెన్‌లోకి అడుగుపెట్టింది. నాతో పాటు వాళ్ల అమ్మమ్మ, తాతయ్య అందించిన సలహాలు, సూచనల సహాయంతో వేగంగా వంటకాలను తయారుచేయడం నేర్చుకుంది. గతంలో నాభర్త పఠాన్‌కోట్‌లో విధులు నిర్వర్తించేవారు. అదే సమయంలో నేను పలు కుకరీ షోలకు హాజరయ్యేదాన్ని. అప్పుడు నా ఆరేళ్ల చిన్నారిని ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్లడం ఇష్టం లేక నాతో పాటు షోలకు తీసుకెళ్లేదాన్ని. అది కూడా తనకు ప్లస్ అయిందని చెప్పచ్చు. ఇక లాక్డౌన్లో తన కుకింగ్ స్కిల్స్‌ను మరింత పెంచుకుంది. తనకు మొదటి నుంచి ఇండక్షన్ స్టౌ మాత్రమే వినియోగించడం తెలుసు. ఈ ఏడాది జులై వరకు దాని సహాయంతోనే అన్నీ వండేది. ఆ తర్వాత ఒక్క నెల వ్యవధిలోనే గ్యాస్, ఒవెన్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకుని మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. ఇక నేను ఇంట్లో లేనప్పుడల్లా వంట చేయడంలో మా ఆయనకు తోడుగా ఉంటోంది. రుచిలో ఏదైనా తేడా వస్తే సరిదిద్దుతుంది. మొదట్లో తను కిచెన్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు ఏదో సరదాకి చేస్తుందిలే అనుకున్నాం. కానీ దాన్నే సీరియస్‌గా తీసుకుని ఈ స్థాయికి వస్తుందని అసలు వూహించలేదు. రోజూ పొద్దున్నే శాన్వి అందించే రుచికరమైన టీతోనే మా దినచర్య మొదలవుతుంది’ అని పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోంది మంజిమ.
Photos: Screengrab