Photo: Instagram
పెద్ద పెద్ద బరువైన బైక్స్ నడపడం అబ్బాయిలకే సాధ్యమనుకుంటారు.. ఒకవేళ అమ్మాయిలు ధైర్యం చేసి నడిపినా వారిని ‘ఇదంతా నీకు అవసరమా?’ అన్నట్లుగా ఎగాదిగా చూస్తారు. ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోకుండా బైక్ రైడింగ్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు ‘ఎలాంటి బైక్ అయినా నడిపే సత్తా అమ్మాయిలకూ ఉంద’న్న బలమైన సందేశాన్ని చాటుతుంటారు కొంతమంది అతివలు. నాగాలాండ్‌కు చెందిన ఓనెన్ ఎంటీ కూడా ఇదే కోవకు చెందుతుంది. బైక్స్ అబ్బాయిలే నడపాలన్న నియమం ఎక్కడా లేదని, అలా అనుకునే వాళ్ల ఆలోచనల్ని పూర్తిగా మార్చేయాలన్న ఉద్దేశంతోనే తాను బైక్ రైడింగ్ నేర్చుకున్నానంటోందీ 28 ఏళ్ల బైకింగ్ సంచలనం. కేవలం తాను నడపడమే కాదు.. బైక్ రైడింగ్ వైపు అమ్మాయిల్ని, మహిళల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం గతేడాది బైక్‌పై ఒంటరిగానే రాష్ట్రమంతా చుట్టేసింది ఓనెన్. ఇక ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ఈ బైక్ రైడింగే అతివలకు ఉపాధి మార్గంగా ఉపయోగపడుతుందంటూ ఔత్సాహిక మహిళలకు బైక్ రైడింగ్ పాఠాలు నేర్పుతోంది. మహిళలు తాము కన్న కలల్ని నిజం చేసుకున్నప్పుడే సంపూర్ణ సాధికారత సాధ్యమవుతుందంటోన్న ఈ నాగాలాండ్ బైకర్ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..
అమ్మాయిలంటేనే ఈ సమాజంలో ఒక రకమైన చిన్న చూపు ఉంది. ఏదైనా కొత్తగా, భిన్నంగా ఆలోచిస్తే.. ‘నువ్వు అమ్మాయివి.. ఇవన్నీ నీకెందుకు?!’ అన్నట్లుగా చూస్తుంటారు. ఇలాంటి అనుభవం నాకూ ఓసారి ఎదురైంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు ఓ ప్రమాదం జరిగింది. దాంతో కాలికి గాయమై చాలా రోజుల దాకా నడవలేకపోయాను. ఆ సమయంలో నేను పడిన ఇబ్బందిని చూడలేకపోయిన అమ్మ.. నాకు ఓ స్కూటీ కొనిచ్చింది. అప్పటికే నా స్నేహితుల్లో చాలామందికి బైక్ నడపడం వచ్చు. దాంతో వాళ్లే నాకు స్కూటీ నడపడంలో మెలకువలు నేర్పించారు. ఆ తర్వాత వాళ్ల సహాయంతోనే బైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నా. అలా బైక్‌లంటే క్రమంగా ఇష్టం పెరిగింది..
బైక్ నీకెందుకు అన్నారు..!
ఈ క్రమంలోనే విభిన్న బైక్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. వాటి ధర, ఇతర విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా స్నేహితుల్ని, తెలిసిన వాళ్లను అడిగేదాన్ని. ఇదే అదనుగా భావించి కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడేవారు. ‘మీ అమ్మానాన్నల సంపాదన ఎందుకిలా వృథా చేస్తావు.. అనవసరమైన ఆలోచనల్ని కట్టిపెట్టి హాయిగా వంట నేర్చుకో’ అంటూ కామెంట్లు పెట్టేవారు. మొదట్లో ఇవి నా మనసును బాధపెట్టినా.. తర్వాత్తర్వాత నాలో సరికొత్త ఆలోచనల్ని రేకెత్తించాయి. అయినా బైక్స్ అబ్బాయిలే నడపాలన్న నియమమేమీ లేదు కదా! మరి, అందరూ అమ్మాయిల విషయంలో ఎందుకిలా వివక్ష చూపుతున్నారు. ముందు ఇలా ఆలోచించే వారిని మార్చాలి.. ఎలాగైనా బైక్ రైడింగ్‌పై మక్కువ ఉన్న మహిళల్ని ప్రోత్సహించాలి అని బలంగా నిశ్చయించుకున్నా. ఈ ఆలోచనతోనే నాగాలాండ్ రాష్ట్రమంతా ఒంటరిగా ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను.
12 జిల్లాలు.. ఒంటరి ప్రయాణం!
ఇలా నా నిర్ణయానికి నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాకు మద్దతు తెలిపారు. నా ప్రయాణానికి కావాల్సిన డబ్బు వారే సమకూర్చారు. అలా గతేడాది నాకెంతో ఇష్టమైన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద నాగాలాండ్‌లోని 12 జిల్లాల్లో ఒంటరి ప్రయాణం చేశాను. ఈ జర్నీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంస్థల్ని, స్వచ్ఛంద సంస్థల్ని, బైకర్స్ని కలిశాను. అలాగే చాలామంది మహిళలు విద్య, నైపుణ్యాలున్నా నిర్ణయం తీసుకునే విషయంలో ఇంకా వెనకబడే ఉన్నారన్న విషయం తెలుసుకున్నా. ఇందుకు వారిని బంధించిన సామాజిక కట్టుబాట్లే కారణమన్న విషయం నాకు అర్థమైంది. అలాంటి సంకెళ్ల నుంచి విముక్తి పొంది తమలో ఉన్న తపనపై దృష్టి పెట్టాలని చాలామందికి మార్గనిర్దేశనం చేశా. అంతేకాదు.. ఈ జర్నీలో చాలామంది వాళ్ల సమస్యల్ని నాతో పంచుకున్నారు. వాటిని పరిష్కరించే దిశగా సైతం చర్చలు జరిగాయి. ఇలా మొత్తానికి మహిళా సాధికారతే లక్ష్యంగా నేను చేసిన ఈ బైక్ యాత్ర మా రాష్ట్రంలో ‘తొలి మహిళా సోలో బైక్ టూర్’గా నిలవడం విశేషంగా చెప్పుకోవాలి.
విమర్శలకు ‘పాజిటివిటీ’ మంత్రమేసి..!
అయితే ఈ ప్రయాణంలోనూ నాకు తిప్పలు తప్పలేదు. ముఖ్యంగా నా జర్నీ గురించి నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు చాలామంది నెగెటివ్ కామెంట్లు పెట్టేవారు. అందులోనూ మా ‘ఏఓ నాగా తెగ’కు చెందిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. నిజానికి మా తెగలో పురుషులు స్త్రీలకు మాటల రూపంలో మద్దతు పలికినా.. చేతల దాకా వచ్చే సరికి మాత్రం ‘అబ్బాయిలుండగా అమ్మాయిలకు అవకాశాలెందుకు ఇవ్వాలి?’ అన్న ధోరణి చూపిస్తుంటారు. అయినా ఈ విమర్శలన్నీ దాటుకొని ముందుకు సాగాను. సానుకూల దృక్పథంతో ఉండడం ఇప్పుడే కాదు.. చిన్నతనం నుంచీ నాకు అలవాటే. అలాగే ఈ ప్రయాణం నాలో సరికొత్త ఉత్సాహం, ధైర్యం నింపింది.
అందుకు ఇదే మంచి సమయం!
ఇక టూర్ ముగించుకొని ఇంటికి తిరిగొచ్చిన దగ్గర్నుంచి చాలామంది మహిళలు ‘మాకు బైక్ రైడింగ్ నేర్చుకోవాలనుంది.. శిక్షణ ఇస్తారా?’ అని సందేశాలు పంపుతున్నారు. అందుకే అలాంటి వారిని ప్రోత్సహించడానికే, వారిలోని బైక్ రైడింగ్ స్కిల్స్‌ని ప్రపంచానికి చాటడానికే నా బృందం ‘KNOW (Kongro Naga on Wheels)’, ఇక్కడి టూ-వీలర్ ట్యాక్సీ అసోసియేషన్‌తో కలిసి ఔత్సాహిక మహిళలకు ఉచితంగా బైక్ రైడింగ్ క్లాసులు నిర్వహిస్తున్నా. పైగా ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో చాలామంది మహిళలు ఉద్యోగాలు పోయి ఇంటికే పరిమితమయ్యారు. దాంతో బోలెడంత ఖాళీ సమయం కూడా వారికి దొరికింది. దాన్ని వృథా చేసుకోకుండా తమలోని నైపుణ్యాలకు సాన పెడితే ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బైక్ రైడింగ్ వస్తే చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఎవరిపైనా ఆధారపడకుండా ఎవరికి వారే ఎంచక్కా బైక్ మీద వెళ్లి రావచ్చు. అలాగే మనం నేర్చుకున్న ఈ బైక్ రైడింగ్ స్కిల్స్‌ని స్వయం ఉపాధి మార్గంగా కూడా మలచుకోవచ్చు.
ప్రతిభకు పదును పెడితే విజయం మనదే!
ప్రస్తుతం వారం పాటు నిర్వహిస్తోన్న ఈ ఉచిత శిక్షణ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. మా వద్ద శిక్షణ తీసుకునే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఇలా మా వద్ద బైక్ నడపడం నేర్చుకునే వారికి బండితో పాటు హెల్మెట్, గ్లౌజులు వంటివి కూడా అందిస్తున్నాం. అంతేకాదు.. మా బృందంలో శిక్షణ ఇచ్చే వారంతా మహిళలే! కాబట్టి శిక్షణ తీసుకుంటోన్న మహిళలు కూడా చాలా సౌకర్యవంతంగా నేర్చుకోగలుగుతున్నారు. ఒక మహిళగా సాటి మహిళలకు ఇలా నా వంతుగా సహకరిస్తున్నందుకు, వారిని సాధికారత దిశగా నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏంటి బైక్ రైడింగ్ గురించి తప్ప మరో విషయం మాట్లాడట్లేదేంటి అనుకుంటున్నారా? ప్రస్తుతం నేను ప్రారంభించిన ‘Kongro Naga Society (KNOW)’కి సీఎండీగా, నాగాలాండ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నా. అలాగే నాకు సంగీతమన్నా ప్రాణమే. బ్యాస్ (గిటార్ లాంటి వాయిద్య పరికరం) వాయించడంలో నాకు ప్రావీణ్యం కూడా ఉంది.
ఇక చివరిగా మహిళలందరికీ ఒక్క విషయం చెప్పాలి.. మీరంతా మీ మీ కంఫర్ట్ జోన్ల నుంచి బయటికి రండి.. దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో అద్భుతమైన ప్రతిభను అందిస్తాడు. అలా మీలో దాగిన టాలెంట్‌ని వెలికి తీయండి.. ఎవరేమనుకున్నా మీ కలల్ని, ఆశయాల్ని నెరవేర్చుకోవడం మానద్దు.. తద్వారా మీకు పేరొస్తుంది.. నలుగురూ మిమ్మల్ని అనుసరిస్తారు.. మహిళలుగా ఇంతకంటే మనకు ఇంకేం కావాలి చెప్పండి!