మనసుకు బాధ కలిగితే మన అనుకున్న వాళ్లతో పంచుకుంటాం.. వాళ్లు దగ్గర లేకపోతే స్నేహితులతో, సన్నిహితులతో మనం ఎదుర్కొంటోన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పుకుంటాం. కానీ అలా చెప్పుకోకుండా కొంతమంది తమ బాధను తమలోనే దాచుకొని కుంగి కుమిలిపోతున్నారు.. ఒత్తిడి, ఆందోళనల్లో కూరుకుపోతున్నారు. జీవితం మీద ఆశ సన్నగిల్లి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోన్న మానసిక సంఘర్షణే ప్రాణంగా ప్రేమించే తన తమ్ముడిని తనకు దూరం చేసిందంటోంది ఓ సోదరి.. ఇలా తన తోబుట్టువు మరణంతో కొన్నాళ్లు నాలుగ్గోడల మధ్యే కుమిలిపోయిన ఆమె.. అలాగే చీకట్లోనే కూర్చోవాలనుకోలేదు. ఆత్మహత్యలను పూర్తిగా నిర్మూలించాలని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే దాదాపు ఏడాది పాటు పోరాడి దేశంలోనే తొలిసారి ‘24×7 జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్’ ప్రారంభమయ్యేందుకు కారకురాలైంది. ఆమే బెంగళూరుకు చెందిన రాశీ థక్రాన్. ‘దయచేసి మనసులోని బాధను మీలోనే దాచుకొని మిమ్మల్ని ఇష్టపడే వారికి దూరం కాకండి.. ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని..!’ అంటూ తన కథను ఇలా పంచుకుంది.
2019.. నేను, నా తమ్ముడు రాఘవ్, మా స్నేహితులు అందరం కలిసి ప్రతి సంవత్సరంలాగే లాస్టియర్ కూడా న్యూ ఇయర్ పార్టీని తెగ ఎంజాయ్ చేశాం. ఆ జ్ఞాపకాల్లోనే ఐదు రోజులు గడిచిపోయాయి. ఆ మరుసటి రోజు ఎప్పటిలాగే మా ఇంట్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యాం. అంతలోనే మా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. మా కుటుంబానికి అంతులేని విషాదం మిగిల్చిన వార్త మా చెవిన పడింది. మా తమ్ముడు రాఘవ్ ఆత్మహత్య చేసుకొన్నాడన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిపోయాం. నేనైతే ఆ వార్తను అసలు జీర్ణించుకోలేకపోయాను.
వాడి చావుతో సమాధానం లేని ప్రశ్నలెన్నో!
నాకు, నా తమ్ముడికి ఉన్న అనుబంధం అలాంటిది. మేమిద్దరం అక్కాతమ్ముళ్లమే కాదు.. మంచి స్నేహితులం కూడా! గొడవ పడడం, తిరిగి కలిసిపోవడం మాకు మామూలే! అంతేకాదు.. మా మధ్య ఏ విషయంలోనూ దాపరికం ఉండేది కాదు. అలాగే రాఘవ్ కూడా చాలా చలాకీగా ఉండేవాడు. ఎప్పుడు చూసినా తాను సంతోషంగా ఉంటూ, చుట్టూ ఉన్న వారిని నవ్వించడం వాడికి అలవాటు. చదువులోనూ మెరిట్ స్టూడెంట్.. బంగారం లాంటి భవిష్యత్తు ముందుంది.. అలాంటిది నా తమ్ముడికి నాకు చెప్పలేకపోయేంత కష్టం ఏమొచ్చింది? అసలు ఆత్మహత్యకు పాల్పడాల్సిన స్థితి వాడికి ఎందుకొచ్చింది? ఇలా నా మనసులో సమాధానం లేని ప్రశ్నలెన్నో తలెత్తాయి. వాటికి సమాధానాలు దొరక్క, నా తమ్ముడు ఇక నాకు లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక పిచ్చెక్కిపోయేది. అలా కొన్నాళ్ల పాటు బాధలోనే ఉండిపోయా.
ఆ నోట్లో ఏముందంటే..?!
అయితే ఓ రోజు నా తమ్ముడి గదిలో నాకు ఒక నోట్ దొరికింది. గత కొన్నేళ్లుగా తాను మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నట్లు అందులో రాసుకున్నాడు రాఘవ్. అది చూసి నా మనసు మళ్లీ ముక్కలైంది. తోబుట్టువులుగా అప్పటిదాకా మా ఇద్దరి మధ్యా ఏ విషయం దాగలేదనుకున్నా.. కానీ తన బాధ గురించి నా తమ్ముడు నా దగ్గర దాచిపెట్టాడని తెలుసుకొని కుంగిపోయా. ఆ దుఃఖంలోనే ఆత్మహత్యల గురించి తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ని ఆశ్రయించా. ఎంతోమంది జీవితాల్ని, వారి కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న ఆత్మహత్యలకు అసలు కారణాలేంటి? వీటిని నివారించే మార్గాలేంటి? తదితర విషయాలపై ఎంతగానో శోధించా. ఈ క్రమంలోనే నాకు కొన్ని ఆత్మహత్యా నివారణ హెల్ప్‌లైన్ నంబర్లు దొరికాయి.
ఒక్కరూ ఫోన్ ఎత్తలేదు..!
వాటిలో చాలా మటుకు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన నంబర్లే ఉన్నాయి. వెంటనే వాటిలో కొన్ని కాంటాక్టులను ఎంచుకొని ఫోన్ చేశాను. ఒక్కరూ ఫోన్ ఎత్తలేదు.. సరికదా కొన్ని నంబర్లైతే స్విచ్చాఫ్ చేసున్నాయి. ఒక్కసారిగా నాలో ఏదో తెలియని గుబులు.. నా తమ్ముడిలా ఎంతోమంది ఇలాంటి మానసిక సమస్యల్ని ఎదుర్కొంటూ ఆ బాధను ఎవరితో చెప్పుకోలేక లోలోపలే మథనపడుతూ ఉంటారు. పోనీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి మానసిక నిపుణుల సహాయం తీసుకుందామా అంటే వీళ్లు ఫోన్ ఎత్తరు. అలాంటి వారు పరిస్థితి చేయి దాటితే ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. ఇకనైనా అలాంటి బలవన్మరణాలను ఆపాలని ఆ క్షణమే నిశ్చయించుకున్నా. అందుకే అదే ఏడాది (2019) జూన్‌లో జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో పిటిషన్ వేశాను.
ఏడాది పోరాటానికి ఫలితమిది!
దానికి మంచి స్పందన వచ్చింది. సుమారు 20 లక్షల మంది ఈ పిటిషన్‌పై సంతకాలు చేసి నాకు మద్దతు తెలిపారు. ఇలా ఈ హెల్ప్‌లైన్ కోసం దాదాపు సంవత్సరం పాటు నేను చేసిన పోరాటానికి ఈ ఏడాది ఆగస్టులో ఫలితం దక్కింది. ‘మానసిక ఆరోగ్యం, ఆత్మహత్యల నివారణ’ ముఖ్యోద్దేశంగా ఈ ఏడాది ఆగస్టు 27న సామాజిక న్యాయం-సాధికారత మంత్రిత్వ శాఖ వారు ‘KIRAN’ పేరుతో ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించారు. దేశంలో 24×7 అందుబాటులో ఉండే తొలి జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ ఇదే కావడం మరో విశేషం. ఇందులో భాగంగా ఎలాంటి మానసిక సమస్య ఉన్నా సరే.. 1800-599-0019 కు ఫోన్ చేసి మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. అంతేకాదు.. ఇది దేశవ్యాప్తంగా 13 భాషల్లో అందుబాటులో ఉంది. మీరు ముందుగా ఈ నంబర్‌కి కాల్ చేసి మీ ప్రాంతీయ భాషను ఎంచుకోవచ్చు. ఆపై కాల్ మీ రాష్ట్రంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కి కనెక్ట్ అవుతుంది. అక్కడ ఉండే మానసిక నిపుణులు మీ సమస్యేంటో తెలుసుకొని మీకు తగిన సలహా ఇస్తారు. ఇలా మొత్తానికి నలుగురికీ ఉపయోగపడే పని చేశానన్న సంతృప్తి నాకు కలుగుతున్నప్పటికీ.. నా తమ్ముడు లేడన్న విషయం మాత్రం ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నా.. ఆ బాధ నుంచి నేను బయటపడలేకపోతున్నా.
దయచేసి ఎవరూ అలా చేయద్దు!
ప్రస్తుతం నేను ‘యువర్ దోస్త్’ అనే ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్లాట్‌ఫామ్‌తో కలిసి పనిచేస్తున్నా. ఇదీ మానసిక సమస్యలను గుర్తించి.. బాధితుల్ని దాన్నుంచి బయటపడేసే వేదికే. మీలో ఎవరైనా సరే.. ఏ సమస్యున్నా సరే.. వెనకడుగు వేయకుండా సోషల్ మీడియా ద్వారా మీరు నన్ను సంప్రదించచ్చు. మీలోని బాధను పోగొట్టి ధైర్యం నింపడానికే మేమంతా ఇక్కడ ఉన్నాం.. మా దగ్గరున్న మానసిక నిపుణులు కూడా మీకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకానీ.. దయచేసి క్షణికావేశంతో, బాధతో ఆత్మహత్యలకు మాత్రం పాల్పడద్దు.. మీరంటే ఇష్టపడే వారికి, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే మీ తోబుట్టువులకు, కుటుంబానికి దూరం కాకండి.. ఆ బాధను నేను అనుభవిస్తున్నాను కాబట్టే చెబుతున్నా.. ధైర్యంగా ఉండండి.. మానసిక నిపుణుల సహాయం తీసుకొని ఒత్తిడిని, ఆందోళనల్ని చిత్తు చేయండి.. కొత్త జీవితాన్ని ప్రారంభించండి..!