Image for Representation
ఐఐటీలు... దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విద్యా సంస్థలుగా వీటికి పేరుంది. ఈ విద్యాసంస్థల్లో సీటు సంపాదిస్తే...విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు మార్గం సుగమమైనట్లే. ఈ క్రమంలో దేశంలోని ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్-2020 పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో పుణె నగరానికి చెందిన విద్యార్ధి చిరాగ్ ఫలోర్ ఆలిండియా టాపర్‌గా నిలిస్తే, అమ్మాయిల విభాగంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కనిష్కా మిట్టల్ అగ్రస్థానం దక్కించుకుంది.
దిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల మంది రిజిష్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 96 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తాజాగా ఆ పరీక్షా ఫలితాలను దిల్లీ ఐఐటీ విడుదల చేసింది. మొత్తం 43, 204 మంది విద్యార్థులు ఈ పరీక్షల్లో అర్హత మార్కులు సాధించారు. పరీక్షలో సాధించిన ర్యాంకులను బట్టి దేశంలోని 23 ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో వీరికి ప్రవేశం కల్పించనున్నారు. ది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో అక్టోబర్ 6 నుంచి సీట్ల కౌన్సెలింగ్ మొదలవుతుంది.
ఈ పరీక్షా ఫలితాల్లో పుణెకు చెందిన చిరాగ్ ఫలోర్ మొదటి ర్యాంకు దక్కించుకున్నాడు. ఐఐటీ బాంబే జోన్ నుంచి ఈ పరీక్షకు హాజరైన అతడు మొత్తం 396 మార్కులకు గాను 352 మార్కులు సాధించి ఆలిండియా టాపర్‌గా నిలిచాడు. ఇక అమ్మాయిల విభాగంలో యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన కనిష్కా మిట్టల్ టాప్ ర్యాంకు దక్కించుకుంది. ఐఐటీ రూర్కీ జోన్ పరిధి నుంచి పరీక్ష రాసిన ఆమె 315 మార్కులు తెచ్చుకుంది. ఆలిండియా స్థాయిలో ౧౭ వ ర్యాంక్ సాధించింది.
‘నాకు నేనే పోటీ’ అనుకున్నాను!
ఈ సందర్భంగా అన్నయ్య అందించిన స్ఫూర్తితోనే ఈ పరీక్షల్లో విజయం సాధించానంటోంది కనిష్క. ‘ నాకు పదో తరగతిలో 99 శాతం మార్కులొచ్చాయి. 98.4 శాతం మార్కులతో ఇంటర్ పాసయ్యాను. అప్పటికే మా అన్నయ్య ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతడిని చూస్తూ పెరిగిన నేను కూడా ఐఐటీలో సీటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇందులో భాగంగా రెండేళ్ల క్రితమే కోటాలోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో చేరి నా ప్రిపరేషన్ ప్రారంభించాను. చిన్నప్పటి నుంచే నాపై నాకు నమ్మకమెక్కువ. ఇతరులతో పోల్చుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టముండదు. నాకు నేనే పోటీ అని భావించాను. ప్రిపరేషన్లో భాగంగా క్లాస్ వర్క్‌తో పాటు రోజూ హోం వర్క్ చేసేదాన్ని. పరీక్ష జరిగిన ప్రతిసారీ కొత్త మార్పులు వస్తుండడంతో ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. ఏ టాపిక్ నుంచి ఏ ప్రశ్న వచ్చినా సాధించేలా సిద్ధమయ్యాను. కోట ఇనిస్టిట్యూట్‌లో చేరకముందు మ్యాథ్స్‌లో నేను చాలా స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని. ఫిజిక్స్‌లో వీక్‌గా ఉండేదాన్ని. అయితే ఇక్కడికి వచ్చాక నా బలహీనతపై దృష్టి సారించాను. ఇందులో భాగంగా ఫిజిక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ప్రస్తుతం అందులో నేను చాలా స్ట్రాంగ్’ అని చెప్పుకొచ్చిందీ టాపర్.
అలా లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకున్నా!
కనిష్క తండ్రి పేరు అనుజ్ కుమార్. తల్లి పేరు సుచిత్రా మిట్టల్. ప్రస్తుతం మొరాదాబాద్‌లో ఓ ఫొటోస్టాట్ షాప్‌ను నిర్వహిస్తున్నాడు అనుజ్ కుమార్. ఈ నేపథ్యంలో తన తల్లిదండ్రులు అందించిన స్ఫూర్తి కూడా తన విజయానికి కారణమంటోంది కనిష్క. ‘నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే ఐఐటీ జేఈఈ పరీక్షకు పూర్తిగా ప్రిపేరయ్యాను. నేను రెండేళ్ల క్రితమే అమ్మానాన్నలను వదిలి కోటకు వచ్చేశాను. అయితే మొరాదాబాద్‌లో ఉన్న నా తల్లిదండ్రులు అక్కడి నుంచే నాకు పూర్తి సహకారం అందించారు. ఎల్లవేళలా నాకు అండగా నిలిచారు. జేఈఈ మెయిన్ పరీక్ష పూర్తయ్యాక మరింత ఉత్సాహంతో అడ్వాన్స్ పరీక్షకు ప్రిపరేషన్ ప్రారంభించాను. అయితే లాక్డౌన్ కారణంగా పరీక్ష వాయిదా పడడంతో కొంచెం నిరుత్సాహానికి గురయ్యాను. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా నేను ప్రిపరేషన్‌కు వినియోగించుకున్నాను. రోజుకు 8-10 గంటలకు పైగా చదివాను. నాలోని బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేశాను. ఫ్యాకల్టీ సహాయంతో అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకోగలిగాను. లాక్డౌన్లో కొనసాగించిన ప్రిపరేషన్ కారణంగానే నాకు మరింత మంచి ర్యాంక్ వచ్చిందేమో అనుకుంటున్నాను. నాకు నవలలు చదవడమంటే చాలా ఆసక్తి. అప్పుడప్పుడు డ్రాయింగ్ కూడా వేస్తుంటాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందీ టాప్ ర్యాంకర్.
జోన్ల వారీగా ‘టాప్’గా నిలిచిన బాలికలు వీరే!
జోన్ |
పేరు |
ర్యాంక్ (ఆలిండియా) |
ఐఐటీ రూర్కీ |
కనిష్కా మిట్టల్ |
17 |
ఐఐటీ దిల్లీ |
గుత్తా సింధూజ |
18 |
ఐఐటీ మద్రాస్ |
కొత్తపల్లి నమిత |
44 |
ఐఐటీ బాంబే |
నియతీ మనీష్ మెహతా |
62 |
ఐఐటీ ఖరగ్ఫూర్ |
అనుష్క |
177 |
ఐఐటీ కాన్పూర్ |
శ్రేయా మోఘే |
402 |
ఐఐటీ గువహటి |
ఆక్రితీ పాండే |
952 |
|