‘చీరకట్టులో మహిళలు చాలా సున్నితంగా వ్యవహరిస్తారు.. సున్నితమైన పనులే చేస్తారు.. కొంతమందైతే నడవడానికి సైతం ఇబ్బంది పడిపోతుంటారు. అందుకు కారణం.. ఆ అవుట్‌ఫిట్ అసౌకర్యంగా ఉండడమే!’ ఇలా చీరకట్టు గురించి ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కానీ చీరకట్టుకున్నప్పటికీ మహిళలు బలహీనులు కారని, ఎంతటి కఠినమైన పనైనా అలవోకగా చేయగల సమర్థులని ఇప్పటికే చాలామంది అమ్మాయిలు నిరూపించారు. తాజాగా ఆ జాబితాలో చేరిపోయింది హూలా హూప్ డ్యాన్సర్ ఈష్నా కుట్టి. కేరళకు చెందిన ఆమె.. ఎలాంటి డ్రస్‌లోనైనా హూప్తో తన శరీరాన్ని గింగిరాలు తిప్పిస్తూ డ్యాన్స్ చేయడంలో దిట్ట. అలాంటిది చీరకట్టులోనూ అలవోకగా హూప్ డ్యాన్స్ చేస్తూ ‘వావ్.. వాట్ ఎ డ్యాన్స్’ అంటూ నెటిజన్లతో చప్పట్లు కొట్టించుకుంటోంది. మరి, ఇదంతా ఎందుకని అడిగితే చీరకట్టులోనూ ఏదైనా సాధ్యమే అని నిరూపించడానికే అంటోంది ఈష్నా.
చీరకట్టులో పామును పట్టడం, జిమ్నాస్టిక్స్ చేయడం, కఠినమైన వ్యాయామాలు చేయడం, మారథాన్లలో పాల్గొనడం, స్కైడైవింగ్ చేయడం.. ఇలా ఒకటా రెండా ఏ సాహసమైనా చీరకట్టులో అలవోకగా చేసేయచ్చని ఇప్పటికే చాలామంది మహిళలు నిరూపించారు. అయితే ఇదే చీరకట్టులో హూలా హూప్ డ్యాన్స్ చేయడం కూడా సులభమే అంటోంది కేరళలోని కొచ్చికి చెందిన హూలా హూప్ డ్యాన్సర్ ఈష్నా కుట్టి. చీర ధరించి ఆమె ఇటీవలే చేసిన హూలా హూప్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇండో-వెస్ట్రన్ స్టైల్లో ముస్తాబై..!
సాధారణంగా జిమ్నాస్టిక్స్ దుస్తులు, జిమ్ వేర్.. ఇలా శరీరానికి ఫిట్‌గా, కంఫర్టబుల్‌గా ఉండే దుస్తుల్లో హూలా హూప్ డ్యాన్స్ చేయడం ప్రాక్టీస్ ఉన్న వారికి చాలా సులభమనే చెప్పాలి. ఈష్నాకు కూడా ఇది అలవాటే. ఈ క్రమంలో శరీరాన్ని విల్లులా వంచుతూ రకరకాల భంగిమల్లో హూప్ రింగ్స్‌తో ఆమె చేసే డ్యాన్స్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే! అయితే ఈసారి ఎప్పటిలాగే కాకుండా కాస్త కొత్తగా హూప్ డ్యాన్స్ చేయాలనుకుందామె. ఇందుకోసం చీరకట్టును ఎంచుకుంది ఈష్నా. సాధారణంగా చీరకట్టుకున్న మహిళలు కష్టతరమైన పనులను చేయడానికి మొగ్గుచూపరన్నది చాలామంది అభిప్రాయం. అలాంటి భావనను తుడిచిపెట్టడానికే చీరకట్టులో హూప్ డ్యాన్స్ చేయడానికి నిర్ణయించుకుందీ కేరళ కుట్టి. ఈ క్రమంలోనే కాటన్ చీర, కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్లో ముస్తాబైన ఈష్నా.. కాళ్లకు స్నీకర్స్ షూస్ వేసుకుంది. ఇలా ఇండో-వెస్ట్రన్ స్టైల్లో రడీ అయిన ఆమె.. ‘జెండా ఫూల్’ అనే పాటకు డ్యాన్స్ చేసి అద్భుతః అనిపించింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ, హూప్ రింగ్‌తో శరీరాన్ని గింగిరాలు తిప్పుతూ ఆమె చేసిన డ్యాన్స్ అదరహో అనిపిస్తోంది. అసలు చీర ధరించానన్న అసౌకర్యం తన డ్యాన్స్‌లో ఎక్కడా కనిపించలేదంటే చీరలోనూ ఆమె ఎంత కంఫర్టబుల్‌గా డ్యాన్స్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు.. ఇలా తనదైన స్టైల్లో చీరకట్టులో హూప్ డ్యాన్స్ చేసిన వీడియోను తన ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈష్నా.
అందుకే ఈ ప్రయత్నం!
ఇలా తన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ కేరళ డ్యాన్సర్.. చీరకట్టులోనూ ఏ పనైనా సునాయాసంగా చేయచ్చని చెప్పడానికే తాను ఇలా చీరకట్టుకొని హూప్ డ్యాన్స్ చేశానంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ‘చీరకట్టుకొని హూప్ డ్యాన్స్ చేయాలని కొన్ని నెలలుగా అనుకుంటున్నా. అది ఇప్పుడు నెరవేరింది. ఇలా చీరకట్టుకొని హూప్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది కూడా! మన సంస్కృతీ సంప్రదాయాలు చాలా భిన్నమైనవి.. ఎంతో గొప్పవి! ఇలా చీరకట్టులో మనలోని ప్రత్యేకతల్ని ప్రదర్శించడం వల్ల అటు మన దేశ సంప్రదాయాలు, ఇటు మన నైపుణ్యాలు.. రెండింటినీ ప్రపంచానికి పరిచయం చేయచ్చు. అలాగే చీరకట్టులో మహిళలు సున్నితమైన పనులు మాత్రమే చేయగలుగుతారన్న అభిప్రాయం కొందరిలో ఉంది. అందుకే కొంతమంది తమలో ప్రతిభ ఉన్నా దాన్ని నాలుగ్గోడలకే పరిమితం చేస్తున్నారు. కాబట్టి ముందుకు రండి.. చీరకట్టులో మీరు చేసిన హూప్ డ్యాన్స్ వీడియోలు లేదంటే ఇతర సాహసాల్ని నాతో పంచుకోండి.. చీరకట్టుకున్న అమ్మాయిలు సున్నితమైన పనులే కాదు.. ఇలాంటి కఠినమైన డ్యాన్స్ భంగిమల్ని కూడా అలవోకగా చేసేయగలరని నిరూపించడానికే నా ఈ చిన్ని ప్రయత్నం’ అంటోంది ఈష్నా. హూప్ రింగ్‌ను కాళ్లు, చేతులు, భుజాలు, మెడ.. ఇలా శరీరంలోని ప్రతి ఒక్క భాగంతో తిప్పుతూ ఆమె చేసే భంగిమలు అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తాయనడం అతిశయోక్తి కాదు. అంతేకాదు.. హూప్తో వివిధ విన్యాసాలు చేస్తూ గిటార్ కూడా వాయించగలదీ ట్యాలెంటెడ్ గర్ల్.
టీచర్‌గానూ..!
ఇలా ఈ చక్కనమ్మ హూప్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ‘ప్రతిభకు మరో రూప’మని, ‘ఈ రోజు చూసిన గొప్ప వీడియో ఇదే’నని, ‘వావ్.. వాట్ ఎ డ్యాన్స్’ అని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కామెంట్‌తో ఈష్నాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలా తనలోని ఈ ప్రతిభను నలుగురికీ పంచడానికి టీచర్‌గానూ మారిందీ యువ హూప్ డ్యాన్సర్. దిల్లీలోని లేడీ శ్రీరాం కళాశాలలో సైకాలజీలో డిగ్రీ పట్టా అందుకున్న ఈష్నా.. ముంబయిలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ‘డ్యాన్స్ మూమెంట్ థెరపీ’ కోర్సు పూర్తి చేసింది. అప్పట్నుంచి పలు వర్క్‌షాప్స్ నిర్వహిస్తూ హూలా హూప్ డ్యాన్స్‌ను ఔత్సాహికులకు చేరువ చేస్తోంది. ప్రస్తుత కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ తన టీచింగ్‌ని ఆపలేదీ కేరళ కుట్టి. ఈ క్రమంలో ఆన్లైన్లోనే హూప్ డ్యాన్స్ తరగతులు నిర్వహిస్తూ ఈ డ్యాన్స్‌పై తనకున్న మక్కువను చాటుకుంటోంది ఈష్నా.
ఎంత కష్టమైన పనైనా సరే.. ఇష్టంతో, మనసు పెట్టి చేస్తే సులభంగా దాన్ని పూర్తిచేయచ్చన్న విషయం ఈష్నా సోషల్ మీడియా వీడియోలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
Also Read:
ఇలా పాముల్ని పట్టేస్తున్నారు..!
చీరకట్టులో జిమ్నాస్టిక్స్.. ఎలా అదరగొట్టేస్తోందో చూశారా?