Image for Representation
మగ తోడు లేకుండా ఆడవాళ్లు గడప దాటడానికి వీల్లేదు.. వారు విదేశాలకు వెళ్లాలన్నా ఇంటి పెద్ద అనుమతి కావాల్సిందే.. ఇక వారు చదువుకోవడం, ఉద్యోగం చేయడం మాట దేవుడెరుగు.. ఇలా ముస్లిం దేశాల్లో మహిళలపై ఆంక్షలు ఎంత కఠినంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇంకొన్ని చోట్లైతే బాలికలు ప్రశాంతంగా స్కూలుకెళ్లి చదువుకోవడానికి కూడా నోచుకోవట్లేదు. అలాంటి దేశాల్లో అఫ్గానిస్తాన్ కూడా ఒకటి. అక్కడి ప్రతికూల పరిస్థితులను ఎదిరించి చదువు కొనసాగించాలంటే అటు అమ్మాయిలకు, ఇటు వారి తల్లిదండ్రులకు ఇద్దరికీ గుండె దడే! మరి, అలాంటి చీకట్లోంచి వెలుగు రేఖలా బయటికొచ్చింది 18 ఏళ్ల అఫ్గాన్ బాలిక షంసియా అలిజాదా. ఒకానొక సమయంలో ఉగ్రవాదుల దాడి నుంచి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డ ఆమె.. చదువునే తన ఆయుధంగా మార్చుకోవాలనుకుంది. ఈ తపనే ఆమెను తాజాగా విడుదల చేసిన ‘నేషనల్ యూనివర్సిటీ’ పోటీ పరీక్షల్లో టాపర్గా నిలిపింది. అందుకే యావత్ ప్రపంచమంతా ఇప్పుడు ఆమె గురించే మాట్లాడుకుంటోంది.
అది 2018. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ నగరంలోని ఓ ట్యూషన్ సెంటర్లో పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎలా వచ్చాడో, ఎటు నుంచి చొరబడ్డాడో తెలియదు కానీ ఆ ట్యూషన్ సెంటర్లోకి మానవ బాంబు రూపంలో ఓ ఉగ్రవాది ప్రవేశించాడు. అందరూ చదువులో నిమగ్నమై ఉండగా తనను తాను పేల్చుకొని భీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో అక్కడ ఉన్న 200 మంది విద్యార్థుల్లో చాలామంది చనిపోయారు. అదే సమయంలో షంసియా అలిజాదా కూడా అక్కడే ఉంది. కానీ అదృష్టవశాత్తూ ఆ దాడి నుంచి బతికి బయటపడింది. ఇలాంటి భయంకరమైన సంఘటన ఆమెలో చదువుకోవాలన్న ఆశను మరింతగా పెంచింది.
తపన ఉంటే ఏదైనా సాధ్యమే!
మనలో తపన ఉంటే ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి మన సొంతమవుతుంది. షంసియా విషయంలోనూ ఇదే జరిగింది. దాడి తర్వాత తన చదువుపై మరింత దృష్టి పెట్టిన ఆమె.. ‘నేషనల్ యూనివర్సిటీ’ పోటీ పరీక్షలకు హాజరైంది. దాని ఫలితాలు తాజాగా విడుదల కాగా.. అందులో ఆ దేశంలోనే టాప్ మార్కులు సంపాదించింది షంసియా. మొత్తంగా ఈ పరీక్షలో సుమారు 2 లక్షల మంది పాల్గొనగా.. షంసియా 360 మార్కులకు గాను 353 మార్కులు సంపాదించి మొదటి ర్యాంక్ చేజిక్కించుకుంది. దీంతో వైద్య విద్యను అభ్యసించి భవిష్యత్తులో గొప్ప డాక్టరై పేదలకు సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటోందీ అఫ్గాన్ బాలిక. షంసియా తండ్రి కోల్మైన్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు.
అమ్మ కళ్లల్లో ఆనందం చూసి ఎన్నేళ్లయిందో!
దాడి తర్వాత తన తల్లిదండ్రులు తనను బడికి పంపడానికి కూడా భయపడ్డారని.. కానీ తన లక్ష్యం ముందు ఆ భయం చిన్నబోయిందని చెబుతోందీ డేరింగ్ గర్ల్. ‘నేషనల్ యూనివర్సిటీ పోటీ పరీక్షల ఫలితాలు టీవీలో చూసిన అమ్మ నవ్వుతూ నా దగ్గరికొచ్చి విషయం చెప్పింది. దాంతో నేను ముందు నమ్మలేదు.. పైగా అమ్మ అలా మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నేళ్లయిందో! 2018లో దాడి జరిగిన తర్వాత అమ్మ అదే భయంలో ఉండిపోయింది. నన్ను బడికి పంపడానికి కూడా భయపడింది. కానీ ఆ భయం కంటే నాకు నా లక్ష్యం గొప్పది. తాలిబన్ల దాడిలో నా స్నేహితులు చాలామంది చనిపోయారు. ఎటు చూసినా రక్తపు మడుగులే కనిపించాయి.. అయినా నాలో ధైర్యం నింపుకున్నా.. విద్యతోనే పేదరికాన్ని తరిమికొట్టచ్చని బలంగా అనుకున్నా! అప్పట్నుంచి కష్టపడి చదివా. యూనివర్సిటీ పరీక్షల్లో టాప్ రావడం చాలా సంతోషంగా ఉంది. అమ్మ కళ్లల్లో ఆనందం చూస్తే పట్టరానంత సంతోషంగా ఉంది. భవిష్యత్తులో డాక్టరై పేదలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది షంసియా.
ఇలా షంసియా సాధించిన విజయానికి ఆమె తల్లిదండ్రులు పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్నారు. నెట్టింట్లో వైరల్గా మారిన ఆమె ఫొటోను చూసి నెటిజన్లు ఆమెను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘షంసియా.. ఈ విజయానికి నీవు అర్హురాలివి..’, ‘కంగ్రాట్స్’, ‘ఆల్ ది బెస్ట్!’.. అంటూ ఆమె తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి, బాలికా విద్యకు ఊతమిస్తే వారు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొని, ఉన్నత శిఖరాలు చేరుకోగలరని నిరూపించిన షంసియా నేటి యువతరానికి ఆదర్శం అని చెప్పడంలో సందేహం లేదు.