హాయ్ మేడమ్.. నా వయసు 19 సంవత్సరాలు. చాలామంది ‘నీకు ఏమీ చేత కాదు.. ఒట్టి మొద్దువి..’ అని అంటుంటారు. మా పేరెంట్స్ కూడా నేను ఒక్కసారి కూడా ప్రయత్నించకముందే ‘నీకు ఏమీ చేత కాదు’ అని అంటుంటారు. దాంతో నా మీద నాకే నమ్మకం పోయింది. భయం, నిరాశానిస్పృహలు నన్ను ఆవరించాయి. నాకు స్నేహితులు కూడా తక్కువే. నా బాల్యం, కౌమార దశ అంతా పుస్తకాలతోనే గడిచిపోయింది. ఏదైనా సోషల్ ఈవెంట్లకు వెళ్లాలన్నా, బంధువులతో మాట్లాడాలన్నా నాకు చాలా కష్టంగా ఉంటుంది. నా తోబుట్టువులు కూడా ‘నువ్వు చాలా నెమ్మది’ అని విమర్శిస్తుంటారు. మా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా ఎక్కడికీ పంపించరు. నన్ను కేవలం ఇంటికి, స్కూల్‌కి, కాలేజ్‌కి మాత్రమే పరిమితం చేశారు. దానివల్ల ఇతర వ్యాపకాలు కూడా అలవడలేదు. నేను ‘దేనికీ పనికి రాను’ అన్న భావన కలుగుతోంది. దీన్నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు?
జ. మీ వ్యక్తీకరణలోని స్పష్టత మీ ఆలోచనలకు అద్దం పడుతోంది. అయితే మీరు పనులు నిదానంగా చేస్తారన్న అభిప్రాయం నుంచి ఎవరూ బయటకు రాలేకపోతున్నారు. సాధారణంగా చిన్నతనంలో తల్లిదండ్రులు, బంధువులు పిల్లల గురించి ఫలానా విషయంలో వాళ్ళు ఇలాగే ఉంటారని ముద్ర వేసేసి, పదేపదే దాని గురించే మాట్లాడడం వల్ల అదే నిజమనే భావన అటు పిల్లల్లో, ఇటు పెద్దవాళ్లలో కలుగుతుంటుంది. మీ విషయంలో కూడా అలాగే జరిగుండచ్చు.

19 ఏళ్ల యువతిగా ఆలోచనల్లోను, భావాల్లోనూ స్పష్టత కలిగినటువంటి మీరు.. మీపై పడ్డ ముద్ర నుంచి బయటపడడానికి ఏం చేస్తారనేది ముఖ్యం. వ్యాపకాలు అనేవి ఒకరు ఏర్పరచేవి కావు. ఎవరికి వారు సొంతంగా అలవాటు చేసుకోవాలన్న సంగతి తెలిసిందే. అలాగే ఇన్నేళ్ళుగా జరిగినదాని గురించి వదిలేసి ఇప్పటి నుంచి ‘ఎలాగైనా సరే నేను చేయగలుగుతాను’ అన్న ధోరణిలో ఆలోచించి చూడండి.
మీ ప్రతిభను నిరూపించుకోండి!
ఇంతకుముందు చెప్పినట్లు - మీ వ్యక్తీకరణలో స్పష్టత ఉన్నట్లు అనిపిస్తోంది.. అలాగే పుస్తకాలతోనే చాలా కాలం గడిచిపోయిందని చెబుతున్నారు. అంటే అటు భావ వ్యక్తీకరణలోనూ, ఇటు చదవడంలోనూ స్పష్టత ఉంది. అలాంటి సందర్భంలో ఉదాహరణకు రచనా రంగం వైపు వెళ్లి మీ ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నం చేయచ్చు. ఇది కేవలం ఒక కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే కనిపించే అంశం.
ఒకవేళ మీ బలహీనతలు పక్కన పెట్టి మీలో ఉన్న బలాలను విశ్లేషించుకొనే ప్రయత్నం చేస్తే మరిన్ని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు పుస్తక పఠనం ఇష్టం అంటున్నారు కాబట్టి జీవితంలో అద్భుతంగా పైకి వచ్చిన ప్రముఖుల జీవితగాథలను చదివే ప్రయత్నం చేయండి. దానివల్ల వారి జీవితంలో వారిపై పడ్డ ముద్రలను చెరిపేసుకుని, ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలాగే వారి విజయ గాథలు మీ బలహీనతలను అధిగమించడానికి ఉపయోగపడతాయేమో చూడండి.
- డా|| పద్మజ, సైకాలజిస్ట్