Image for Representation
అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు మానసిక దృఢత్వంలో ఎంతో ముందుంటారు. అయితే శారీరకంగా పోల్చుకుంటే మాత్రం చాలా బలహీనులని చాలామంది అంటుంటారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదంటూ మరోసారి నిరూపించింది పంజాబ్‌కు చెందిన ఓ బాలిక. తన మొబైల్ ఫోన్‌ను లాక్కెళ్లుతున్న దొంగను సమర్థంగా అడ్డుకుని కటకటాల్లోకి పంపించిన ఆ సాహస బాలిక ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ప్రముఖ పోలీసు అధికారులతో పాటు నెటిజన్ల ప్రశంసలు అందుకొంటున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె చేసిన సాహసమేంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
దొంగను పారిపోనివ్వకుండా!
జలంధర్ పట్టణంలోని ఫతేపురి మొహల్లాకు చెందిన కుసుమ్కుమారి ట్యూషన్ను ముగించుకుని ఇంటికి పయనమైంది. ఫోన్ పట్టుకుని రోడ్డుపై నడిచి వెళ్తోన్న ఆమెను అనుసరిస్తూ ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చారు. ఆమె ఫోన్ లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించారు. సాధారణంగా ఆమె స్థానంలో మరెవరైనా ఉంటే సాయం కోసం చుట్టుపక్కల వాళ్లను పిలవడానికి ప్రయత్నించే వారేమో! అయితే ఆ బాలిక అలా చేయలేదు. తన ఫోన్‌ను లాక్కున్న మరుక్షణం మెరుపువేగంతో కదిలింది. ఫోన్ తీసుకుని బైక్ ఎక్కబోతున్న దొంగను గట్టిగా పట్టుకుంది. ఈ క్రమంలోఆ దొంగ బైక్ దిగి ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని కొట్టాడు. పదునైన ఆయుధంతో బాలిక చేతిని గాయపరిచాడు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయలేదు కుసుమ్. అతని టీ షర్ట్ కాలర్‌ను గట్టిగా పట్టుకుని పారిపోనివ్వకుండా చేసింది. ఈలోపు స్థానికులు అక్కడికి రావడంతో బైక్ తోలుతున్న మరో దొంగ అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే దొరికిన దొంగను మాత్రం ఆ బాలికతో పాటు స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
ఆమె ధైర్యసాహసాలు అందరికీ స్ఫూర్తి!
ఈ ఘటనకు సంబంధించి అక్కడి సీసీ టీవీలో రికార్డయిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో దొంగ చేతిలో గాయపడి ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుసుమ్ కుమారిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆమె ధైర్యసాహసాలు ఎంతోమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తాయని పలువురు ఐపీఎస్ అధికారులు, నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈమేరకు కుసుమ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్న ఆస్పత్రి యాజమాన్యం ఆమెకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయించుకుంది. ఆమె పేరును జాతీయ, రాష్ట్ర స్థాయి సాహస అవార్డులకు పంపిస్తామని జలంధర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ ప్రకటించారు. అదేవిధంగా ఆమె ధైర్యసాహసాలకు గుర్తింపుగా రూ. 51 వేల క్యాష్ రివార్డును అందజేస్తున్నట్లు జలంధర్ సిటీ డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ తోరీ తెలిపారు.
అందుకే ఈ సాహసం చేశాను!
దొరికిన దొంగకు జలంధర్ కోర్టు మూడురోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ప్రస్తుతం అతను జైలులో వూచలు లెక్కిస్తున్నాడు. ఇక కుసుమ్ ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తండ్రి కూడా ఆస్పత్రిలోనే ఉండి కూతురిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.
ఈ క్రమంలో- కుసుమ్ మాట్లాడుతూ తన చదువు కోసం నాన్న కష్టపడి కొనిచ్చిన ఫోన్‌ను పొగొట్టుకోలేకనే ఈ సాహసం చేశానంటోంది. ‘నేను ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాను. మా నాన్న ఓ దినసరి కార్మికుడు. నా చదువుకోసమని నాన్న నాకు ఫోన్ కొనిచ్చాడు. అది పోగొట్టుకోవడం ఇష్టం లేకనే ఫోన్‌ను లాక్కెళ్లిన ఆ దుండగులను వెంబడించాను. మొదట నన్ను టీజ్ చేసినప్పుడే వారిపై అనుమానం మొదలైంది. వెంటనే అప్రమత్తమయ్యాను. ఆ తర్వాత స్థానికుల సహాయంతో వారిలో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాను’ అని చెబుతోందీ డేరింగ్ గర్ల్.