Image for Representation
ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలున్న పిల్లలే శ్రద్ధగా చదువుకోమంటే అది లేదు, ఇది లేదంటూ వంకలు పెడుతున్నారు. అలాంటిది చిన్నతనం నుంచి రెక్కాడితే గానీ డొక్కాడని కడు పేదరికం మధ్య పెరిగినా చదువుపై మక్కువ పెంచుకుందా అమ్మాయి. ఎన్ని సమస్యలెదురైనా సరే కష్టపడి చదివి... తన తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలనుకుంది. తానెంత బలంగా కోరుకుందో కానీ... సాక్షాత్తూ సరస్వతీ దేవే ఆమె మొరను ఆలకించింది! పదో తరగతి ర్యాంక్‌తో మొదలు తన ప్రతిభతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ తల్లిదండ్రుల ముఖాల్లో వెలకట్టలేని ఆనందం నింపుతోంది. మరి, ఇంతకీ ఎవరా బాలిక? ఏంటామె కథ? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బిహార్ టు కేరళ!
బిహార్‌కు చెందిన ప్రమోద్ కుమార్, బిందూదేవీ దంపతులు పొట్ట కూటి కోసం కేరళకు వలస వచ్చారు. ముగ్గురు పిల్లలతో కలిసి ఎర్నాకుళంలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే చదువు ఆపేసిన ప్రమోద్ వూరు కాని వూరు వచ్చి కుటుంబ పోషణ కోసం పడరాని పాట్లు పడ్డాడు. చిన్నా చితకా పనులు చేస్తూ బతుకు బండిని ముందుకు నడిపించాడు. అయితే తనలా తన పిల్లలకు ఈ అవస్థలు రాకూడదనుకున్న ప్రమోద్ వారిని కష్టపడి చదివించాడు. ఇక అతడి భార్య బిందు ఇంట్లోనే ఉంటూ తన ముగ్గురి పిల్లలకు ఎలాంటి లోటూ రానీయకుండా పెంచింది. ఇలా చిన్నతనం నుంచే తల్లిదండ్రుల కష్టాన్ని కళ్లారా చూసింది ఆ ముగ్గురి పిల్లల్లో ఒకరైన పాయల్ కుమారి. అందుకే మొదట్లో భాష అర్థం కాకపోయినా పట్టుదలతో చదివింది. ఆర్థిక సమస్యలను అధిగమిస్తూ పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించింది. తన విజయ పరంపరను అలాగే కొనసాగిస్తూ తాజాగా విడుదలైన డిగ్రీ ఫలితాల్లోనూ సత్తా చాటింది. బీఏ ఆర్కియాలజీ విభాగంలో ఏకంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆ బాలిక కేరళ సీఎం విజయన్‌తో పాటు పలువురి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.
మలయాళంపై పట్టు పెంచుకుని!
ఏదో చదువుకోవాలంటే చదువుకోవాలి..అని కాకుండా చిన్నప్పటి నుంచి పట్టుదలతో చదివింది పాయల్. ఎలాగైనా సరే తాను ఉన్నత చదువులు చదివి తన తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపాలని చిన్నతనంలోనే నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లే పదో తరగతిలో 85 శాతం, ఇంటర్లో 95 శాతం మార్కులు సాధించింది. ‘మేం బిహార్ నుంచి కేరళకు వలస వచ్చినప్పుడు నాకు నాలుగేళ్లు. దీంతో ఇక్కడి మలయాళ భాషను నేర్చుకుని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎనిమిదో తరగతికొచ్చాక మలయాళంతో పాటు కొన్ని కఠినమైన సబ్జెక్టుల కోసం ప్రత్యేకంగా ట్యూషన్లు కూడా తీసుకున్నాను. అప్పటి నుంచే మలయాళం భాషపై కొద్దిగా పట్టు సంపాదించాను. మమ్మల్ని చదివించడం కోసం అమ్మానాన్నలు ఎంతో కష్టపడ్డారు. చిన్నా చితకా పనులతో పాటు ఎన్నో ఉద్యోగాలు చేసిన నాన్న మాకు మంచి భవిష్యత్ అందివ్వాలనుకున్నారు. పదో తరగతి దాకా చదివిన అమ్మ కూడా మాకెలాంటి కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచింది. అందుకే నేను బాగా చదివి అమ్మానాన్నల కష్టాన్ని తీర్చాలనుకున్నాను.
వాళ్ళ కోరిక తీరుస్తా!
ప్లస్ టూ పూర్తయ్యాక కొచ్చి సమీపంలోని పెరంబవూరులోని మార్తోమా ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ జాయినయ్యాను. నేను పదో తరగతిలో ఉన్నప్పుడే ఆర్కియాలజీ (పురావస్తు శాస్ర్తం) పై ఆసక్తి మొదలైంది. పురాతన వస్తువులు, తవ్వకాలు, చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరిగింది. నేను పెద్దగా పుస్తకాలు చదవలేదు. కానీ చదివిన కొన్ని పుస్తకాలు పురావస్తు శాస్త్రంపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేశాయి.
ఎప్పటిలాగే అర్థిక ఇబ్బందులు నన్ను డిగ్రీలో కూడా వెంటాడాయి. ప్రత్యేకించి ఏడాదికి రూ.3 వేల ఫీజు కట్టడం మా కుటుంబానికి తలకు మించిన భారమైంది. దీంతో ఒకానొక సందర్భంలో నేను చదువు మానేయాలనుకున్నాను. అయితే మా కాలేజీ టీచర్లు నాకు అండగా నిలిచారు. వీరితో పాటు నా కష్టం తెలుసుకున్న కొందరు నాకు సాయం చేశారు. అలా మొత్తానికి 85 శాతం మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను.
నేను పరీక్షలు బాగానే రాసినప్పటికీ, ఈ స్థాయి ర్యాంకు వస్తుందని మాత్రం కలలో కూడా వూహించలేదు. నా సక్సెస్ క్రెడిట్ అంతా అమ్మానాన్నలకే దక్కుతుంది. నా ర్యాంక్‌ను చూసి వారెంతో సంతోషించారు. మరెన్నో ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. అందుకు తగ్గట్టుగా ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటున్నాను. ఇదే సమయంలో నా లక్ష్యమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కూడా సన్నద్ధమవుతాను ’ అని సంతోషంతో చెబుతోందా చదువుల తల్లి.
ప్రముఖుల ప్రశంసలు
మొదట్లో మలయాళంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పాయల్ ప్రస్తుతం మలయాళంతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా అనర్గళంగా మాట్లాడుతోంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ఈ అమ్మాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈక్రమంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఆర్థిక మంత్రి డాక్టర్ థామస్ ఐజాక్, మిజోరం గవర్నర్ శ్రీధరన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, కాంగ్రెస్ నాయకురాలు షర్మిష్ఠా ముఖర్జీ...తదితర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆ బాలికను అభినందిస్తున్నారు. ఇక నెటిజన్లు కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.
మరి ఈ చదువుల తల్లికి మనమూ శుభాకాంక్షలు చెబుదాం. భవిష్యత్‌లో మరెన్నో పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుందాం!