Image for Representation
రోజూ కరోనాకు సంబంధించిన వార్తలు చదివినా, విన్నా.. ‘వామ్మో! ఈ మహమ్మారితో డాక్టర్లు, నర్సులు ఎలా పోరాటం చేస్తున్నారో, ఏమో! నిజంగా వాళ్లు గ్రేట్’ అనుకుంటుంటాం. అయితే కొందరు మాత్రం అలా సేవ చేసే భాగ్యం తమకూ వస్తే బాగుండేది అనుకుంటుంటారు. అలాంటి వారిలో జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన రితికా ఠాకూర్ ఒకరు. కోల్‌కతాలో ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌లో వైరాలజిస్ట్‌గా పనిచేస్తోన్న ఆమె.. వెకేషన్ కోసమని తన సొంతూరికి వెళ్లింది. గత మూడు నెలలుగా అక్కడే ఓ ఆస్పత్రిలో కరోనా బాధితులకు సేవలందిస్తోంది. ఇందులో ప్రత్యేకతేముంది అని మీరు అనుకోవచ్చు.. రితిక నయా పైసా ఆశించకుండా ఉచితంగా ఈ సేవలందించడం ఇక్కడ విశేషం. అందుకే ఈ కరోనా వారియర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
రితికా ఠాకూర్.. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన ఆమె 2017లో ‘మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ వైరాలజీ’లో క్లినికల్ వైరాలజీ విభాగంలో మాస్టర్స్ పూర్తిచేసింది. అప్పట్నుంచి కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో వైరాలజిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. లాక్డౌన్ ప్రకటించకముందు వెకేషన్ కోసమని ఇంటికొచ్చిన ఆమె.. సడెన్‌గా లాక్డౌన్ విధించడంతో తన సొంతూరిలోనే ఆగిపోయింది. ఇలా ఇంట్లో ఖాళీగా ఉండే కంటే ఇక్కడే ఎలాగోలా కరోనా బాధితులకు సేవలందించడం మంచిదనుకుంది. అనుకున్నదే తడవుగా తన మనసులోని మాటను తన తండ్రికి చేరవేసింది.

నాన్న ఫ్రెండ్ ద్వారా..!
రితిక తండ్రి భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్)లో ఉద్యోగి. ఆయన స్నేహితుడు, ప్రముఖ డాక్టర్ ద్వారా అక్కడి పాటలీపుత్ర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పీఎంసీహెచ్) ఆసుపత్రిలో చేరానంటోంది రితిక. ‘నిజానికి నేను వెకేషన్ కోసమని మా ఊరికొచ్చా. కానీ లాక్డౌన్ కారణంగా ఇక్కడే ఆగిపోయా. అయితేనేం ఇక్కడే ఉండి కరోనా బాధితులకు సేవలందించాలని నిర్ణయించుకున్నా. నాన్న ఫ్రెండ్ డాక్టర్. ఆయనే ఇక్కడి పాటలీపుత్ర మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పీఎంసీహెచ్) ప్రిన్సిపల్‌కి నన్ను పరిచయం చేశారు. ఆ తర్వాత మరో డాక్టర్ నన్ను ఇంటర్వ్యూ చేసి నేరుగా విధుల్లోకి తీసుకున్నారు. అప్పట్నుంచి ఈ ఆస్పత్రిలోని RT-PCR ల్యాబ్‌లో స్వాబ్ కలెక్షన్స్ టెస్టింగ్ చేస్తున్నాను. మొత్తంగా మా బృందంలో ఐదుగురు సభ్యులున్నాం. ఉదయం 9 గంటలకు మా పని మొదలైందంటే నిరంతరాయంగా 12 గంటల పాటు సాగుతూనే ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చింది రితిక.
చాలా నేర్చుకుంటున్నా!
కరోనా బాధితుల స్వాబ్ శాంపిల్స్ సేకరించడం ఎంత రిస్కో, వాటిని పరీక్షించడం కూడా అంతే రిస్క్‌తో కూడుకున్నది. అయినా సరే.. ఇది నాకు ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడుతుందంటోందీ యువ రీసెర్చర్. ‘చుట్టుపక్కల ఉన్న దాదాపు 8 జిల్లాల నుంచి మా ల్యాబ్‌కు స్వాబ్ శాంపిల్స్ వస్తాయి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వచ్చినా నేను ఒత్తిడికి గురికాను.. చాలా ప్రశాంతంగా, ఓపికతో వాటిని టెస్టింగ్ చేస్తాను.. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా చాలా జాగ్రత్తపడతా. ఎందుకంటే.. చాలామంది పరీక్షల ఫలితాలు మాపైనే ఆధారపడి ఉంటాయి. అలాంటప్పుడు పొరపాటు చేసి తప్పుడు ఫలితాలు వెల్లడిస్తే అది వారి ప్రాణానికే ప్రమాదం. ఇక దీన్ని ఒక ఉద్యోగం, వృత్తిగా నేను భావించట్లేదు.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో సేవ చేస్తున్నాననుకుంటున్నా.. అందుకే నా పనికి ఎలాంటి జీతం తీసుకోవట్లేదు. కరోనా అంతమయ్యే వరకు నా సేవను ఆపను. ఇక నేను చేస్తోన్న శాంపిల్స్ టెస్టింగ్ ద్వారా వైరస్‌కు సంబంధించిన బోలెడన్ని విషయాలు నేర్చుకుంటున్నా!’ అంటోంది రితిక.
అందుకే ప్రతిదీ శానిటైజ్ చేస్తున్నా!
రోజూ బయటికి వెళ్లొచ్చాక మనల్ని మనం శానిటైజ్ చేసుకుంటున్నాం.. అలాగే మనతో పాటు తీసుకెళ్లిన వస్తువుల్నీ శుభ్రం చేస్తున్నాం. అలాంటిది రోజంతా వైరస్ ల్యాబ్‌లో పనిచేసిన కరోనా వారియర్స్ ఈ విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి..? అందుకే రోజూ తాను ఇంటికెళ్లినా కుటుంబ సభ్యులకు దూరంగా విడి గదిలోనే ఉంటున్నానంటోంది రితిక. ‘రోజంతా వైరస్ చుట్టూనే పనిచేయాల్సి రావడంతో ఇంటికెళ్లాక నేను స్నానం చేయడంతో పాటు నా దుస్తులు, నాతో పాటు తీసుకెళ్లిన ప్రతి వస్తువునూ శానిటైజ్ చేస్తున్నా. అలాగే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులందరితో కాకుండా వారికి దూరంగా విడి గదిలోనే ఉంటున్నా. తద్వారా నా వల్ల నా ఫ్యామిలీకి ప్రమాదం రాకుండా జాగ్రత్తపడుతున్నా..’ అంటూ తాను తీసుకుంటోన్న జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చింది రితిక.
నిజమైన కరోనా యోధురాలు!
ఈ కరోనా ప్రతికూల పరిస్థితుల్లో వైరస్ బాధితులకు ఉచితంగా సేవ చేస్తోన్న రితికపై జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఫొటోను పంచుకుంటూ.. ‘వైరాలజిస్ట్‌గా పనిచేస్తోన్న రితికా ఠాకూర్ ప్రస్తుతం పీఎంసీహెచ్‌లో కరోనా రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నారు. తన నిస్వార్థ సేవలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారామె. నేను ఆమెకు ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశాను. ఇలాంటి వైద్యులు మనందరికీ గర్వకారణం.. వీళ్లే అసలైన కరోనా యోధులు!’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
కరోనా అంటేనే ఆమడదూరం పరిగెత్తుతాం. అలాంటిది ప్రస్తుత పరిస్థితుల్లో తన వంతుగా వైరస్ బాధితులకు సేవ చేయాలని సంకల్పించుకుంది రితిక. ఈ క్రమంలో ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా, ఉచితంగా కరోనా రోగులకు సేవ చేస్తూ పని పట్ల నిబద్ధతను, అంకితభావాన్ని చాటుకుంటోందామె. అందుకే అసలైన కరోనా వారియర్‌గా అందరి మన్ననలు అందుకుంటోంది.
హ్యాట్సాఫ్ రితిక!