శారీరక దృఢత్వానికి, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే మనం మాట్లాడుకున్నంత సులభం కాదు.. యోగాసనాలు వేయడమంటే! యోగా చేయాలన్న తపనకు తోడు కష్టపడే తత్వం ఉంటేనే ఈ విద్య మన సొంతమవుతుంది. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది పదకొండేళ్ల సమ్రిధి కలియా అనే అమ్మాయి. చిన్ననాటి నుంచే యోగా అంటే ప్రాణం పెట్టే ఆమె.. ఈ విద్యలో గొప్ప గొప్ప వాళ్లనే దాటేసింది. శరీరాన్ని విల్లులా వంచుతూ, యోగాసనాలు వేస్తూ ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ రికార్డును చేజిక్కించుకున్న సమ్రిధి.. తాజాగా తన యోగాసనాలతో మరో గ్లోబల్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిన్నారి యోగిని గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం...
సమ్రిధి కలియా.. భారత సంతతికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. అక్కడి ‘అంబాసిడర్ స్కూల్’లో గ్రేడ్-7 చదువుతోంది. చిన్ననాటి నుంచి ఈ అమ్మాయికి యోగా అంటే ప్రాణం. ఆరేళ్ల వయసులో తన కూతురి మక్కువను గుర్తించిన సమ్రిధి తల్లిదండ్రులు ప్రేర్నా, సిద్ధార్థ్ కలియా.. ఈ దిశగా తనను ప్రోత్సహించారు. ఇలా తన పేరెంట్స్ ప్రోత్సాహంతో యోగాలో అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేయాలని నిర్ణయించుకుందీ లిటిల్ యోగిని.
ప్రాణమైన ‘యోగా’!
చిన్న వయసు నుంచే యోగాపై మక్కువ పెంచుకున్న సమ్రిధి.. రోజూ మూడు గంటల పాటు యోగా ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకుంది. ఈ సాధనే ఆమెను అనతికాలంలోనే కఠినమైన యోగాసనాలు వేసే స్థితికి తీసుకొచ్చింది. శరీరాన్ని విల్లులా వంచుతూ ఈ బాలిక చేసే వేసే యోగాసనాలు అబ్బురపరుస్తాయి. అంతేకాదు.. ఈ అమ్మాయి వేసే కళాత్మక, లయబద్ధమైన (ఆర్టిస్టిక్, రిథమిక్ యోగా) యోగాసనాలు చూస్తే రెప్పవాల్చకుండా అలా చూడాలనిపిస్తుందంటే నమ్మండి! ఈ క్రమంలో అంతర్జాతీయంగా వివిధ యోగా పోటీల్లో పాల్గొన్న సమ్రిధి.. విన్నర్‌గా, రన్నరప్‌గా ఎన్నో అవార్డులు గెలుచుకుంది. ఇక దీనికి తోడు లాన్ టెన్నిస్, సైక్లింగ్, ఈత కొట్టడం, ఐస్ స్కేటింగ్.. వంటి క్రీడల్లోనూ రాణిస్తోందీ అమేజింగ్ గర్ల్.
మూడు ప్రపంచ రికార్డులు!
ఎంతటి కఠినమైన యోగాసనాలైనా అలవోకగా చేసేస్తోన్న ఈ అమ్మాయి ఇప్పటికే మూడుసార్లు ప్రపంచ రికార్డులు నమోదు చేసింది. ‘అత్యంత అడ్వాన్స్డ్ యోగాసనాల్ని నిమిషం వ్యవధిలో’ చేసినందుకు గాను ఈ ఏడాది జనవరి 12న మొదటిసారి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించింది సమ్రిధి. ఇక జూన్ 21న ‘అంతర్జాతీయ యోగా దినోత్సవా’న్ని పురస్కరించుకొని ‘పరిమిత ప్రదేశంలో నిమిషం పాటు అత్యంత అడ్వాన్స్డ్ యోగాసనాలు’ వేసి.. రెండోసారి ‘గోల్డెన్ బుక్’లోకి ఎంటరైంది. ఇక తాజాగా ముచ్చటగా మూడోసారి ప్రపంచ రికార్డు చేజిక్కించుకుందీ ఇండియన్ గర్ల్. అక్కడి బుర్జ్ ఖలీఫా భవనం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అత్యంత పెద్ద భవంతి అద్దాల పక్కన అమర్చిన ఓ చిన్న చెక్క బాక్స్‌లో వంద కఠినమైన యోగాసనాలు వేసింది సమ్రిధి. దీంతో ‘పరిమిత ప్రదేశంలో అత్యంత వేగంగా వంద యోగాసనాలు’ వేసి మూడోసారి ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించిందీ ట్యాలెంటెడ్ గర్ల్. 3:18 నిమిషాల్లోనే ఈ అరుదైన ఘనతను తన సొంతం చేసుకుంది సమ్రిధి.
అదే నా సక్సెస్ సీక్రెట్!
అద్భుతమైన యోగాసనాలతో అబ్బురపరుస్తోన్న ఈ అమ్మాయి.. కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునే ధైర్యం ఉంటేనే విజయం మన సొంతమవుతుందంటోంది. ‘మనందరికీ కలలుంటాయి. అయితే వాటిని సాకారం చేసుకునే క్రమంలో ఎన్ని ఒడిదొడుకులెదురైనా, వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగాలి.. అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది. నిరాడంబరంగా కష్టపడండి.. ఫలితంగా సొంతమైన విజయాన్ని ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకోండి..! ఇదే సిద్ధాంతాన్ని నేనూ నమ్ముతున్నా. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహిస్తా. అదే నా విలువైన ఆస్తి అని నా నమ్మకం..!’ అంటోంది సమ్రిధి. పదకొండేళ్లకే యోగాలో ఆరితేరిన ఈ అమ్మాయికి ఈ ఏడాది ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా’ తరఫున ‘ప్రవాసీ భారతీయ దివస్ అవార్డు’ కూడా దక్కింది.
ఇలా పదకొండేళ్లకే యోగాలో అద్భుతాలు సృష్టిస్తూ.. ప్రపంచ రికార్డులు కొల్లగొడుతూ నేటి బాలలందరికీ ఆదర్శంగా నిలుస్తోంది సమ్రిధి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇష్టమైన అంశాల్లో ప్రోత్సహిస్తే ఎంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించుకుంటారో, వారికి గర్వకారణంగా నిలుస్తారో తన విజయాలతో చెప్పకనే చెబుతోందీ అమేజింగ్ గర్ల్!!
Photo: Instagram