Image for Representation
అజ్నౌల్.. మధ్యప్రదేశ్ భీండ్ జిల్లాలోని ఓ కుగ్రామం. అక్కడికి బస్సు సౌకర్యమే కాదు.. ఇతర రవాణా సదుపాయాలు సైతం లేవు. ఇక ఆ ఊరి పిల్లలు పదో తరగతి పూర్తిచేయాలంటే అక్కడికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహ్గావ్ గ్రామంలోని పాఠశాలకు వెళ్లాల్సిందే. పోనీ.. ఆ బడికి స్కూల్ వ్యాన్ సౌకర్యం ఉందా అంటే అదీ లేదు. ఎవరికి వారు సొంత వాహనాలపై వెళ్లాల్సిందే! ఒకవేళ వరదలు ముంచెత్తి ఆ రోడ్డు మార్గం కూడా మూసుకుపోతే స్కూల్‌కెళ్లే ఆ ఒక్క అవకాశం కూడా ఉండదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చదువు కొనసాగించి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ర్యాంక్ సాధించింది పదిహేనేళ్ల రోష్నీ బదౌరియా. మరి, ఇంతకీ అంత దూరం తను బడికి ఎలా వెళ్లిందనేగా మీ సందేహం? పోను 12 కి.మీ. రాను 12 కి.మీ. ఇలా మొత్తంగా 24 కి.మీ. సైకిల్‌పై సవారీ చేసి పాఠాలు నేర్చుకున్న రోష్నీ.. ఇప్పుడు తన ప్రతిభతో ఆ ఊరికే గర్వకారణంగా నిలిచింది. చదువంటే మక్కువ, భవిష్యత్తులో కలెక్టరై దేశానికి సేవ చేయాలన్న తపనే తనను నడిపిస్తోందంటోన్న ఈ చదువుల తల్లి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ భీండ్ జిల్లాలోని అజ్నౌల్ గ్రామంలో నివాసముంటోంది పదిహేనేళ్ల రోష్నీ. తండ్రి పురుషోత్తం బదౌరియా వ్యవసాయం చేస్తుంటారు. తల్లి సరిత గృహిణి. రోష్నీకి ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. మన దేశంలో బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అజ్నౌల్ కూడా ఒకటి. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్కడ వెయ్యి మంది బాలురకు 837 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. పైగా ఆ గ్రామంలో అక్షరాస్యులూ తక్కువే. ఇలాంటి పరిస్థితుల నడుమ పుట్టింది రోష్ని. అయినా చిన్నతనం నుంచి చదువంటే తనకు ఎంతో మక్కువ. బాగా చదువుకోవాలి.. దేశానికి, ప్రజలకు సేవ చేయాలి అని పసి ప్రాయంలోనే తన మనసులో బలంగా నిశ్చయించుకుంది.
రోజూ సైకిల్‌పై సవారీ!
మరి, తను పదో తరగతి పూర్తిచేయాలంటే తన ఊరికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామం మెహ్గావ్కు వెళ్లాల్సిందే. అలా 9వ తరగతిలో మెహ్గావ్లోని ప్రభుత్వోన్నత బాలికల పాఠశాలలో చేరింది రోష్ని. అయితే ఆ స్కూల్‌కు వ్యాన్ సౌకర్యం కూడా లేకపోవడంతో సైకిల్‌పై వెళ్లాలనుకుందీ బాలిక. ప్రభుత్వం అందించిన సైకిల్‌పైనే రోజూ పోను 12 కిలోమీటర్లు, రాను 12 కిలోమీటర్లు.. ఇలా మొత్తంగా 24 కిలోమీటర్లు ప్రయాణించి పాఠాలు నేర్చుకునేది. ఇక వర్షాకాలంలో వరదలొచ్చి ఆ ఊరి రోడ్డును ముంచెత్తినా స్కూల్ మానకపోయేది రోష్నీ. ఈ క్రమంలో కొన్నాళ్లు మెహ్గావ్లోని తన బంధువులింట్లోనే ఉండి చదువుకుంది. ఇలా తనకెదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ మరీ చదువు కొనసాగించిన రోష్ని.. తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 98.5 శాతం మార్కులతో రాష్ట్రంలోనే 8వ ర్యాంక్ సాధించిందీ చదువుల తల్లి.
కలెక్టర్‌నవుతా!
ఇలా తన ప్రతిభతో గ్రామానికే గర్వకారణంగా నిలిచిన రోష్ని.. భవిష్యత్తులో కలెక్టర్ కావాలని, దేశానికి, ప్రజలకు సేవ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ‘పదో తరగతి పరీక్షల్లో ఇంత మంచి ర్యాంక్ వస్తుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా అమ్మానాన్నల ప్రోత్సాహం వల్లే సాధ్యమైంది. అన్ని కిలోమీటర్లు సైకిల్‌పై స్కూలుకెళ్లడం చాలా ఇబ్బందిగా అనిపించేది. అప్పుడప్పుడూ నాన్నే నన్ను స్కూల్లో దింపేవారు. ఇక నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చాక రోజూ ఏడెనిమిది గంటలు చదివేదాన్ని. నా కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నది నా కల. దాన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతా. భవిష్యత్తులో కలెక్టరై దేశానికి, ప్రజలకు సేవ చేస్తా..’ అంటోందీ అమ్మాయి. ఇక తన కూతురి ప్రతిభకు రోష్ని అమ్మానాన్నలు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. మరోవైపు గ్రామస్థులు కూడా ఈ బాలిక పట్టుదలను ప్రశంసిస్తున్నారు.
రోష్నీ.. నువ్వే అందరికీ ఆదర్శం!
ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ఈ బాలికపై ప్రశంసలు కురిపించారు. ‘అమ్మాయిలూ.. మీరూ ఇలాంటి విజయాలు సాధించాలి.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించాలి. రోష్నీ... ప్రతికూలతలను ఎదిరించి సాధించిన విజయం ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. రాష్ట్రంలోని ఇతర బాలికలందరికీ నువ్వు ఆదర్శం. ఇకపైనా ఇదే స్ఫూర్తిని కొనసాగించు.. నా ఆశీర్వాదాలెప్పుడూ నీ వెంటే ఉంటాయి..’ అంటూ ట్వీట్ చేశారాయన.