నడక నేర్పించిన నాన్నను సొంతూరికి చేర్చేందుకు ఎవరూ చేయని సాహసం చేసింది బిహార్‌కు చెందిన జ్యోతి కుమారి. లాక్డౌన్ కాలంలో ఒకటి కాదు...రెండు కాదు ఏకంగా 1,200 కిలోమీటర్ల పాటు తండ్రిని వెంటపెట్టుకుని సైకిల్ తొక్కిన ఆ బాలిక అసామాన్య ధైర్యంపై దేశ ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రొఫెషనల్ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని విధంగా ఏడు రోజుల సుదీర్ఘ ప్రయాణం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడా ప్రశంసలు కురిపించింది. అంతేకాదు తనకు సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. గాయపడిన తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయంలో జ్యోతి చేసిన సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా ముగ్ధురాలయింది. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆ బాలికపై ప్రశంసల వర్షం కురిపించింది.
అద్భుతమైన సాహసం !
ఈమేరకు తండ్రిని వెంటబెట్టుకుని సైకిల్ తొక్కుతున్న జ్యోతి ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకుంది ఇవాంక. ‘15 ఏళ్ల జ్యోతి కూమారి గాయపడిన తన తండ్రిని సైకిల్‌పైన కూర్చోబెట్టుకుని 7 రోజుల్లో 1200 కి.మీ ప్రయాణించి ఇంటికి చేరింది. ఎంతో ఓర్పు, ప్రేమతో కూడిన ఈ అద్భుతమైన సాహసం దేశ ప్రజలతో పాటు భారత సైక్లింగ్ ఫెడరేషన్ హృదయాలను గెలుచుకుంది’ అని అందులో రాసుకొచ్చింది! అంతకుముందు పలువురు నేతలతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా జ్యోతిని అభినందించారు.
సైక్లింగ్‌లో ఉచితంగా శిక్షణ అందిస్తాం!
ప్రొఫెషనల్ అథ్లెట్లకు కూడా సాధ్యం కాని అరుదైన సాహసం చేసిన జ్యోతిపై భారత సైక్లింగ్ ఫెడరేషన్ కూడా ప్రశంసల వర్షం కురిపించింది. అంతేకాదు జాతీయ సైక్లింగ్ అకాడమీలో ఉచితంగా శిక్షణ కూడా అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు వచ్చే నెల దిల్లీలో నిర్వహించనున్న ట్రయల్స్‌కు హాజరు కావాలని ఆహ్వానం కూడా పంపింది. ఇందులో భాగంగా జ్యోతిని బిహార్ నుంచి దిల్లీకి రప్పించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని సీఎఫ్ఐ స్పష్టం చేసింది.
అసలేం జరిగిందంటే!
లాక్డౌన్ కంటే ముందే మోహన్ పాస్వాన్ కుటుంబంలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఆయనది బిహార్ లోని దర్భంగ జిల్లా సిర్హులీ అనే పల్లెటూరు. భార్య పూలోదేవి అంగన్వాడీ కేంద్రంలో వంటమనిషిగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురు జ్యోతి. కుటుంబ పోషణ కోసం దిల్లీకి వచ్చిన మోహన్ గురుగ్రామ్‌లో ఆటో నడిపేవాడు. తన సంపాదనలో కొంత మొత్తం ఇంటికి పంపిస్తుండేవాడు. ఆదాయం అంతగా లేక జ్యోతిని ఎనిమిదో తరగతి దాకే చదివించాడు. అప్పుడప్పుడు పిల్లలను చూడడానికి ఇంటికి వచ్చేవాడు పాస్వాన్. అలా నాలుగు రోజుల పాటు సంతోషంగా గడిపేవారు ! జనవరి 20.. రాత్రి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదం. మోహన్‌కు తీవ్రగాయాలయ్యాయి. వైద్యులు పెద్దాస్పత్రిలో చూపించమన్నారు. పూలోదేవికి అర్థం కాలేదు. ఇరుగుపొరుగును బతిమాలింది. డబ్బులు పోగేసింది. భర్తను పిల్లలను వెంటబెట్టుకొని గురుగ్రామ్ చేరుకుంది. పాస్వాన్‌ను అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది.

ఊహించని కష్టం..
మోహన్‌కు ప్రాణాపాయం తప్పింది. పూర్తిగా కోలుకోవడానికి నెలలు పడుతుందన్నారు వైద్యులు. ఓ గది అద్దెకు తీసుకుందామె. పదిరోజులు గడిచాయి. సెలవులు లేకపోవడంతో.. పూలోదేవి చిన్నపిల్లలను ఇద్దరినీ తీసుకొని స్వగ్రామానికి వెళ్లిపోయింది. జ్యోతి తండ్రి దగ్గరే ఉండిపోయింది. ‘నాన్నకు సాయంగా నన్నుంచి. అమ్మ చెల్లిని, తమ్ముడిని తీసుకెళ్లింది. ఆనాటి నుంచి నాన్నను కంటికి రెప్పలా చూసుకుంటూ వచ్చాన’ని చెప్పుకొచ్చింది జ్యోతి. నెలన్నర గడిచిపోయింది. మార్చి మూడోవారం. మందులు అయిపోయాయి. ఆసుపత్రిలో చూపించుకొని.. మందులు తీసుకొని ఊరికి వెళ్దామని అనుకున్నారు తండ్రీకూతుళ్లు. మర్నాడు నుంచి లాక్డౌన్ అన్నారు. ఏ వాహనాలు రోడ్డెక్కవని చెప్పారు. ఊరికి వెళ్లాలనుకున్న వాళ్లకు ఊహించని కష్టం ఎదురైంది.
భారంగా నెలన్నర..
సంపాదన లేదు. చేబదులు అడుగుదామన్నా ఇచ్చేవాళ్లు లేరు. ఎన్నో రోజులు పస్తులున్నారు. సామాజిక సేవా సంస్థలు నిత్యావసరాలు పంచుతుంటే పరుగెత్తుకెళ్లి కొన్ని తెచ్చింది జ్యోతి. పొదుపుగా వాడుతూ పది రోజులు నెట్టుకొచ్చింది. దాతలు ఎవరైనా ఇస్తే తిండి. లేకపోతే నీళ్లే ఆహారం. మోహన్ పరిస్థితి తెలిసి స్థానికంగా ఉన్న ఆటోడ్రైవర్లు చందాలు వేసుకొని కొంత డబ్బు ఇచ్చారు. వాటితో మందులు తీసుకుంది. ఇలా నెలన్నర రోజులు గడిచాయి. ‘మిగిలింది ఐదు వందలే! నాన్నకు మందులు తేవాలి. ఈ డబ్బులూ అయిపోతే.. బతకడం ఎలా? మందులు పనిచేయాలన్నా.. తినాలిగా! అందుకే నేనో నిర్ణయం తీసుకున్నాను. నాన్నను ఎలాగైనామా ఊరు చేర్చాలనుకున్నా. అక్కడ తెలిసిన వారితో మాట్లాడి ఐదొందలకు ఓ సెకండ్‌హ్యాండ్ సైకిల్ ఇప్పించమన్నా! సైకిల్ తీసుకొని నాన్న దగ్గరికి వెళ్లాన’ని చెప్పుకొచ్చింది జ్యోతి.

ఆకలితో ప్రయాణం..
మోకాలి నొప్పితో ఆ తండ్రి సైకిల్ తొక్కే పరిస్థితిలో లేడు. కూతురు తొక్కితే వెనక కూర్చునేందుకు మనసొప్పలేదు. తన వల్ల కాదన్నాడు. బతిమాలింది. చివరికెలాగో ఒప్పుకొన్నాడు. మే 10.. ఉదయం 11 గంటలు. గురుగ్రామ్‌లో సైకిల్ ఎక్కింది జ్యోతి. తండ్రి వెనక కూర్చున్నాడు. తొక్కడం మొదలుపెట్టింది. పైన ఎండ... కింద తారురోడ్డు సెగ. ఒళ్లంతా చెమటలు. అలసటను జయిస్తూ సైకిల్ తొక్కింది. తండ్రి వెనక ఉన్నాడన్న ధైర్యంతో తొక్కింది. చేతిలో పైసా లేకున్నా.. తండ్రిని కాపాడుకోవాలన్న పాశం ఆ బంగారుతల్లికి ఉత్ప్రేరకంగా పని చేసింది. అలా దారి తెలుసుకుంటూ ముందుకు వెళ్లారు. దగ్గరి దారి అడిగి వెళ్లారు. దారి బాగోలేని చోట నడిచి వెళ్లారు. ‘రాత్రి పూట పెట్రోల్ బంకుల్లో ఉండేవాళ్లం. నాన్న కంటి మీద కునుకు లేకుండా నన్ను కాచుకొని ఉండేవాడు. నా కాళ్లు పట్టేవాడు. ఆయన చూపే ప్రేమ ముందు నేను పడుతున్న కష్టం ఏపాటిదనిపించేద’ని కన్నీళ్లు పెట్టుకుంది జ్యోతి.
నాకే ఆశ్చర్యంగా ఉంది!
పగలు, రాత్రులు మారిపోతున్నాయి. తొమ్మిదో రోజు.. మే 18.. దర్భంగా జిల్లాలోకి ప్రవేశించింది జ్యోతి. దాదాపు 1,150 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత సాయంత్రానికి తండ్రితో పాటు సిర్హులీకి చేరుకుంది. తండ్రి కోసం ఏ బిడ్డా చేయని సాహసం చేసింది జ్యోతి. గ్రామంలో అందరూ ఆశ్చర్యపోయారు. జ్యోతి పడ్డ కష్టం తెలుసుకొని ఆమెను అభినందించారు. ‘ఇంత దూరం సైకిల్ ఎలా తొక్కానా అనిపిస్తుందిప్పుడు. నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదైతేనేం నాన్నను అమ్మ దగ్గరికి చేర్చగలిగా’ అని చెబుతోంది జ్యోతి.