సాధారణంగా మూడేళ్ల వయసున్న పిల్లలు ఎలా ఉంటారు? ఇంట్లో అమ్మ చేసి పెట్టినవి తింటూ అల్లరికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. లేకపోతే స్మార్ట్ ఫోన్, ట్యాబ్, టీవీనో పట్టుకుని వేలాడుతుంటారు. అయితే ముంబైకి చెందిన మూడేళ్ల కబీర్ మాత్రం అలా చేయలేదు. ఇంట్లో అమ్మ సహాయంతో స్వయంగా రుచికరమైన కప్ కేక్‌లు తయారుచేసి విక్రయించాడు. వాటి ద్వారా సంపాదించిన రూ.50వేల ఆదాయాన్ని ముంబై పోలీసులకు విరాళమిచ్చాడు. మరి కరోనాపై పోరులో భాగంగా చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్న ఈ బుడతడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.
కప్ కేక్‌లు తయారుచేస్తూ!
దేశ ఆర్థిక, వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబై ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. ఇప్పటివరకు సుమారు 735మంది ముంబైవాసులు ఈ మహమ్మారికి బలయ్యారు. మరో 20వేలమంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇదేక్రమంలో అక్కడి వైద్యులతో పాటు పోలీసులు కూడా ముందుండి ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. అహర్నిశలు రోడ్లపై గస్తీ కాస్తూ లాక్డౌన్ ఆంక్షలను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ముంబైవాసులను కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులకు తనవంతు సాయంగా ఏమైనా చేద్దామనుకున్నాడు కబీర్. ముంబైలోని వర్లీ ప్రాంతంలో నివాసముంటున్న ఈ బుడతడు వెంటనే ఈ ఆలోచనను తన తల్లి కరిష్మాతో షేర్ చేసుకున్నాడు.

అమ్మ సహాయంతో!
ఇందులో భాగంగా అమ్మ సహాయంతోనే స్వయంగా రుచికరమైన కప్ కేక్‌లు తయారుచేశాడు కబీర్. బనానా, వాల్నట్, చాక్లెట్...తదితర ఫ్లేవర్ల కేక్‌లను రూపొందించిన ఆ బుడతడు తన తండ్రి కేశవ్ సహాయంతో వాటిని విక్రయించాడు. మొదట్లో ఈ పనితో కేవలం రూ.10వేలు వస్తే చాలనుకున్నారు కరిష్మా దంపతులు. కానీ కబీర్ చేస్తున్న ఈ మంచి పనికి మరికొందరి ప్రోత్సాహం తోడైంది. అలా మొత్తం పోగైన రూ.50వేలను తాజాగా ముంబై పోలీసు కమిషనర్‌కు అందించారు కబీర్ తల్లిదండ్రులు. దీంతో పాటు ఓ కప్‌కేక్ బాక్స్‌ను కూడా పోలీసులకు కానుకగా అందజేశారు.
అంకుల్! కరోనా కనిపిస్తే మీ గన్‌తో కాల్చేయండి!
ఈ సందర్భంగా విరాళం చెక్, కప్ కేక్ బాక్స్‌ను తన చేతుల మీదుగా ముంబై పోలీస్ కమిషనర్‌కు అందజేశాడు కబీర్. వీటితో పాటు కరోనా వైరస్‌కు సంబంధించి తన సందేశాన్ని వినిపిస్తూ ఓ చిన్న నోట్ కూడా అందించాడు. ‘ డియర్ పోలీస్ అంకుల్...కంటికి రెప్పలా మమ్నల్ని కాపాడుతున్నందుకు చాలా థ్యాంక్స్! మీకు ఎక్కడైనా కరోనా వైరస్ కనిపిస్తే వెంటనే మీ గన్‌తో దాన్ని కాల్చేయండి. నేను త్వరలోనే మా స్నేహితులతో ఆడుకోవాలి. మా తాతయ్యను కూడా కలుసుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు అవసరమైన మెడిసిన్స్ కొనేందుకు ఈ విరాళాన్ని వినియోగించండి’ అంటూ ఆ నోట్లో రాసుకొచ్చాడీ మూడేళ్ల ముంబైకర్.
ఈ క్రెడిట్ అంతా వాళ్ల అమ్మదే!
కబీర్ తండ్రి కేశవ్ ముంబైలోని ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ ఈ ఛారిటీ క్రెడిట్ అంతా తన సతీమణికే దక్కుతుందంటున్నాడు. ‘నా భార్య కరిష్మా ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది. లండన్‌లో ఉంటున్న మా ఫ్రెండ్ ఈ కప్ కేక్ ఐడియా చెప్పాడు. అదే సమయంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోడ్లపై గస్తీ కాస్తున్న ముంబై పోలీసులకు ఏమైనా సాయం చేద్దామని నా కుమారుడు అడిగాడు.కరిష్మా సహాయంతో వెంటనే కప్ కేక్‌లు తయారుచేయడం నేర్చుకున్నాడు. అనంతరం మా స్నేహితులు, చుట్టుపక్కల నివాసముంటున్న వారికి వీటిని విక్రయించాం. ఈ కేక్‌లకు మేం ఎలాంటి ధర నిర్ణయించలేదు. అదేవిధంగా మా ప్రయత్నం వెనక ఉన్న అసలు ఉద్దేశాన్ని అందరితో షేర్ చేసుకున్నాం. దీంతో ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తమే వచ్చింది. కేక్‌ల విక్రయం ద్వారా రూ.25వేలు పోగయ్యింది. ఈ మొత్తానికి మా కుటుంబం తరఫున మరో రూ.25వేలు జమ చేసి మొత్తం రూ.50వేలు విరాళంగా అందజేశాం. అయితే ఇంతటితో కరోనాపై మా పోరాటం ఆగదు. ఆ మహమ్మారి అంతమయ్యేవరకు ఈ ఛారిటీని కొనసాగిస్తాం’ అని చెప్పుకొచ్చాడు ఆ బాలుడి తండ్రి.
ఈ తీపి గుర్తు మా మదిలో నిలిచిపోతుంది!
చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకున్న కబీర్‌పై ముంబై పోలీసులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈక్రమంలో ఈ బుడతడికి సంబంధించిన ఓ వీడియోను తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ‘ ఈ బుల్లి బేకరీ వ్యాపారి పేరు కబీర్. అతడిని చూస్తే తాను తినడానికే కేకులు తయారుచేస్తున్నాడని చాలామంది అనుకోవచ్చు. కానీ ఈ కేకుల కంటే ఈ పిల్లాడి మనసు ఇంకా స్వీట్. అందుకే ఓ బుల్లి వ్యాపారవేత్తగా, సేవకుడిగా మారిపోయి తాను ఎంతో కష్టపడి తయారుచేసిన కేకులను విక్రయించాడు. అతడు రూ.10వేలు మాత్రమే సంపాదించాలనుకున్నాడు. కానీ ఈ బుల్లి బేకరీ వ్యాపారి ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించాడు. అనంతరం ఆ మొత్తాన్ని పోలీసులకు విరాళంగా అందించాడు. మా అదృష్టం కొద్దీ కబీర్ తయారుచేసిన కేక్స్ కూడా మాకు కానుకగా అందాయి. ఈ తీపి గుర్తు మా మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు ముంబై పోలీసులు.
ముంబై పోలీసులు షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈక్రమంలో నెటిజన్లు కూడా ఆ బుడతడి స్ఫూర్తిని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
మూడేళ్ల వయసు కూడా దాటని కబీర్ ఎంతో పెద్ద మనసుతో చేస్తున్న ఈ సాయం నిజంగా అభినందనీయం. మరి ఈ చిన్నారి స్ఫూర్తితో మరికొందరు దాతలు ముందుకురావాలని కోరుకుందాం. సమష్టి సహకారంతో ఈ కరోనా ఉపద్రవాన్ని అధిగమిద్దాం..!