లాక్డౌన్ కారణంగా నిరుపేదలు, రోజువారీ కూలీలు, వలస కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక రోడ్లపైనే పస్తులుంటూ కడుపు మాడ్చుకుంటున్నారు. ఎవరైనా దాతలు వచ్చి అన్న పానీయాలు అందిస్తే తప్ప వారి ఆకలి తీరడం లేదు. ఇలా ఆపత్కాలంలో అవస్థలు పడుతోన్న పేద కార్మికులు, వలస కార్మికులకు ఆపన్న హస్తం అందించేందుకు భారత మహిళల హాకీ జట్టు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ‘ఫన్ ఫిట్నెస్ ఛాలెంజ్’ పేరుతో విరివిగా విరాళాలు సేకరించి వలస కార్మికుల కడుపు నింపాలని నిర్ణయించుకుంది. ఓవైపు తమ ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటూనే.. మరోవైపు పేద కార్మికుల కళ్లల్లో సంతోషం నింపే ఈ సరికొత్త ఛాలెంజ్ గురించి మనమూ తెలుసుకుందాం రండి.
ఏంటీ ఛాలెంజ్?
ఈ ఛాలెంజ్‌లో భాగంగా భారతీయ మహిళా హాకీ జట్టులోని సభ్యులందరూ 18 రోజుల పాటు రోజుకొకరు చొప్పున ఇతరులకు ఒక ఫిట్నెస్ టాస్క్ ఇస్తారు. ఇందులో భాగంగా స్వ్కాట్స్, పుషప్స్, లాంజెస్, స్కిప్పింగ్, పోగో హోప్.. ఇలా రోజుకొకరు రోజుకొక వర్కవుట్ తాము చేస్తూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తమకు తెలిసిన పది మందికి ఆ ఛాలెంజ్ విసురుతారు. ఆ పది మంది ఈ ఛాలెంజ్ స్వీకరించడంతో పాటు కనీసం రూ. 100 లేదా అంతకంటే ఎక్కువ విరాళంగా ఇవ్వాలి. అలాగే వారిలో ఒక్కొక్కరూ తమకు తెలిసిన మరో పదిమందిని ట్యాగ్చేస్తూ ఆ వీడియోలోని వ్యాయామాలు చేయాలని సవాల్ విసురుతారు. వారు కూడా ఇలాగే వర్కవుట్ చేస్తూ కొంత డబ్బు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఒక గొలుసుకట్టులా సాగుతుందీ ఛాలెంజ్.. ఇలా 18 రోజుల పాటు హాకీ జట్టు సభ్యులందరూ ఒక్కొక్కరుగా ఒక్కో ఫిట్నెస్ టాస్క్‌ను ఛాలెంజ్ చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు.
చురుగ్గా ఉండాలనే...!
ఈ ఛాలెంజ్ ద్వారా సేకరించిన విరాళాలతో కనీసం వెయ్యి కుటుంబాలను ఆదుకుంటామని హాకీ ఇండియా ప్రకటించింది. ఈ సందర్భంగా భారతీయ మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ మాట్లాడుతూ.. ‘కరోనా కార్మికుల జీవితాలను తలకిందులు చేసింది. లక్షలాది మంది కార్మికులు తిండి కోసం ఎలాంటి ఇక్కట్లు పడుతున్నారో మేం రోజూ వార్తాపత్రికల్లో, సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందుకే మా వంతు సాయంగా వారిని ఆదుకోవాలనుకుంటున్నాం. ఒక జట్టుగా సమష్టిగా మేం ఎన్నో విజయాలు సాధించాం. నేడు అదే స్ఫూర్తితో లాక్డౌన్లో ఇక్కట్లు పడుతోన్న వలస కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ ఛాలెంజ్ ద్వారా కనీసం వెయ్యి కుటుంబాల కడుపు నింపేలా సాయం కూడా చేయాలనుకున్నాం. ఇందులో భాగంగా దిల్లీలోని ఉదయ్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో వారికి ఆహారం, నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు, సబ్బులు అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ లాక్డౌన్ సమయంలోనూ చురుగ్గా ఉండాలనే ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ద్వారా మేం విరాళాలు కోరుతున్నాం’ అని చెప్పుకొచ్చింది రాణి. విరాళాలు అందించే వారి కోసం తన బయోలో ఓ లింక్ కూడా పెట్టిందీ హాకీ కెప్టెన్.
ఇదే స్ఫూర్తి కొనసాగాలి!
వలస కార్మికులను ఆదుకునే లక్ష్యంతో భారత మహిళల హాకీ జట్టు ప్రారంభించిన ‘ఫన్ ఫిట్నెస్ ఛాలెంజ్’ పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు, హాకీ దిగ్గజం ధన్‌రాజ్ పిళ్లై తదితరులు సోషల్‌మీడియా వేదికగా వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఫిట్నెస్ ఛాలెంజ్‌లో భాగంగా కెప్టెన్ రాణీ రాంపాల్ మరో క్రీడాకారిణితో కలిసి 3.20 నిమిషాల్లో 500 రోప్ జంప్స్ పూర్తి చేసింది. అదేవిధంగా మరో పదిమందికి ఈ వ్యాయామం చేయాలని సవాల్ విసిరారీ ప్లేయర్స్. ఇక మరో హాకీ క్రీడాకారిణి సుశీలా చాను 42 సెకన్లలో 20 పుషప్స్, 20 డిప్స్ చేసి తనకు తెలిసిన పదిమందికి ఈ వర్కవుట్ చేయాలని సవాల్ విసిరింది.
ఈ క్రమంలో భారీ విరాళాలు పోగవుతున్న క్రమంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని హాకీ ఇండియా తన అధికారిక ట్విట్టర్లో కోరింది.
మరి మీరు కూడా కరోనాపై పోరులో భాగమవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఫిట్నెస్ ఛాలెంజ్‌ను స్వీకరించండి. లాక్డౌన్ సమయంలో మీ ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటూనే వలస కార్మికులకు మీ వంతు సహాయం చేయండి.