మల్టీ ట్యాలెంటెడ్ కిడ్.. ఈ పదానికి ప్రిన్స్ మహేష్‌బాబు గారాల పట్టి సితార చక్కగా సరిపోతుంది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే గడుపుతోన్న ఈ చిన్నారి.. ఈ ఖాళీ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటోంది. సితార, తన బెస్ట్ ఫ్రెండ్ ఆద్య (దర్శకుడు వంశీ పైడిపల్లి)తో కలిసి ‘A&S’ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పిల్లలు ఇష్టపడే విషయాలతో పాటు పండగలు, ప్రత్యేక సందర్భాలపై వీడియోలు రూపొందించి తమ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటారీ సెలబ్రిటీ కిడ్స్. అయితే ప్రస్తుతం కరోనాపై పోరులో భాగంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తోన్న ఈ సమయంలో ఓ రుచికరమైన, ఆరోగ్యకరమైన కేక్‌ను మనకోసం తయారుచేసి చూపించింది సీతా పాప. అంతేకాదు.. ‘ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి వంట చేయండి..’ అంటూ సితార ఎంతో ఈజీగా తయారుచేసిన ఆ కేక్ రెసిపీ ఏంటో మనమూ తెలుసుకుందాం రండి..
కరోనా మహమ్మారి భారత్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి అటు ప్రభుత్వాలతో పాటు ఇటు సెలబ్రిటీలు సైతం ఈ వైరస్ గురించి వివిధ వేదికలు, కార్యక్రమాల ద్వారా అందరిలో అవగాహన పెంచుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్‌బాబు గారాల పట్టి సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య.. ఇద్దరూ కలిసి కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇటీవలే ఓ వీడియో రూపొందించి తమ యూట్యూబ్ ఛానల్ ‘A&S’లో పోస్ట్ చేశారు. ఇక తన సెల్ఫ్ క్వారంటైన్లో భాగంగా చెఫ్‌గా మారిన సీతా పాప.. ఓ టేస్టీ, హెల్దీ కేక్‌ను తయారుచేసి.. ఆ వీడియోను తన ఛానల్లో పోస్ట్ చేసింది. అంతేకాదు.. ‘ఇంట్లోనే ఉండండి.. నాతో కలిసి వంట చేయండి..’ అంటూ తన ముద్దుముద్దు మాటలతో కేక్ తయారీ గురించి చెప్పుకొచ్చిందీ సూపర్ కిడ్. వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యమంటూ ముందుగా చేతుల్ని చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాతే కేక్ తయారు చేయడం ప్రారంభించింది సీతా పాప.
కావాల్సిన పదార్థాలు
* నట్స్ - పావుకప్పు
* తురిమిన బెల్లం - అరకప్పు
* బాదం పొడి - అరకప్పు
* కొబ్బరి పొడి - కప్పు
* పాలు - అరకప్పు
* బేకింగ్ పౌడర్ - టేబుల్‌స్పూన్
* కోడిగుడ్లు - 4
తయారీ
ముందుగా ఓ పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని.. అందులో కొబ్బరి పొడిని వేయాలి. ఆపై అందులో బాదం పొడి, తురిమిన బెల్లం, బేకింగ్ పౌడర్ వేసి.. అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నాలుగు కోడిగుడ్ల సొనల్ని మరో బౌల్లో తీసుకొని.. బీటర్ సహాయంతో బీట్ చేసుకోవాలి. ఇందులో పాలు కూడా పోసి మరోసారి బీట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా తయారుచేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బేకింగ్ ట్రేకి నూనె రాసి కేక్ మిశ్రమాన్ని అందులో వేసి సమానంగా పరచాలి. ఇక ఆఖర్లో నట్స్‌ని ఈ మిశ్రమంపై గార్నిష్ చేసి 190 డిగ్రీల వద్ద ప్రి-హీట్ చేసి పెట్టుకున్న ఒవెన్‌లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరంగా ఉంటూనే, ఆరోగ్యాన్నీ అందించే కేక్ రడీ..! చాలా ఈజీగా ఉంది కదూ.. ఈ కేక్ తయారీ! అయితే ఆలస్యమెందుకు.. మీరూ ట్రై చేయండి.. అంటూ తన ముద్దుముద్దు మాటలతో, ఎంతో ఉత్సాహంగా కేక్ తయారుచేసిందీ సూపర్ కిడ్.
మరి, మనమూ సీతా పాపను ఫాలో అయిపోయి ఈ టేస్టీ కేక్‌ను తయారుచేసుకొని ఇంటిల్లిపాదికీ విందు చేసేద్దామా..?