ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చేది ‘గూగుల్’. మీ మనసులో ఉన్న ప్రశ్నను మీకు నచ్చిన భాషలో గూగుల్‌కి విన్నవిస్తే చాలు.. దానికి సంబంధించి ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని క్షణాల్లో మీ ముందుంచుతుంది. అంతేనా.. మన ఫొటోలు-వీడియోలను భద్రపరచడం, మనకు తెలియని ప్రదేశాలకు మ్యాప్స్ ద్వారా మార్గాలను సూచించడం, ఒక సమాచారాన్ని మనకు నచ్చిన భాషలోకి తర్జుమా చేయడం.. మొదలైన సేవలెన్నో అందిస్తోంది గూగుల్. అందుకే ఈతరం వాళ్లు ‘గూగుల్’ను తమ బెస్ట్ ఫ్రెండ్‌గా భావిస్తున్నారు. ఈ సంస్థ కూడా ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకట్టుకునేలా కొత్తగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా పండగలు, ముఖ్యమైన రోజులు, ప్రముఖుల పుట్టినరోజులు.. తదితర ప్రత్యేక సందర్భాల్లో ఆ సందర్భానికి తగినట్లుగా తమ హోమ్ పేజీని క్రియేటివ్‌గా డిజైన్ చేయడం (డూడుల్‌ని రూపొందించడం) గూగుల్ ఆనవాయితీ. ఈ క్రమంలో ఈ ఏడాది హోలీ పండగను పురస్కరించుకొని గూగుల్ ఓ కొత్త ట్రిక్‌ను నెటిజన్లకు పరిచయం చేసింది. అదేంటో మీరే చూడండి.

హోలీ అంటేనే రంగుల పండగ. చిన్నా, పెద్ద అనే వయోబేధం లేకుండా అంతా ఒక్కచోట చేరి.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే వేడుక. అయితే హోలీ పండగను కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌పై జరుపుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. కంప్యూటర్ స్ర్కీన్‌పై హోలీ ఆడడమేంటి..?అదెలా సాధ్యం..?అనుకుంటున్నారా..! అవును, ఈ హోలీ సందర్భంగా గూగుల్ సంస్థ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో హోలీ ఆడే సదుపాయాన్ని అందిస్తోంది. ఇందుకోసం మనం ఏం చేయాలో చూద్దాం..!

* ముందు మీ స్మార్ట్ ఫోన్/కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ‘Google Search’ పేజీని తెరవండి.
* సెర్చ్ బార్లో ‘Holi’ అని (మీకు నచ్చిన భాషలో) టైప్ చేసి 'Enter' నొక్కండి.
* అలా క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయిన పేజీలో మీకు కలర్ బౌల్స్ కనిపిస్తాయి. వాటిపై ఒకసారి క్లిక్ చేయండి.

* ఇప్పుడు ఆ పేజీలో మీకు నచ్చిన చోట క్లిక్ చేసి చూడండి. మీరు క్లిక్ చేసిన చోటల్లా రంగులు చల్లినట్లుగా కనిపిస్తుంది. క్లిక్ చేసినప్పుడల్లా ఒక్కో రంగు చల్లినట్లుగా వస్తుంటుంది. ఇలా మీరు కంప్యూటర్/ల్యాప్‌టాప్/స్మార్ట్ ఫోన్లోనే హోలీ ఆడుతూ ఆ పేజీని మొత్తం రంగులతో నింపేయొచ్చు.
* అదే పేజీ పైభాగంలో మీకు నీటి బొట్టు ఆకారంలో ఓ బటన్ కనిపిస్తుంది. దానిని మీరు క్లిక్ చేయగానే అప్పటివరకు పేజీపై మీరు చల్లిన రంగులన్నీ మాయమైపోయి.. మళ్లీ ఆ పేజీ యథావిధిగా మీకు దర్శనమిస్తుంది.
ఈ విషయాన్ని ‘గూగుల్ ఇండియా’ సంస్థ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ‘మీ స్క్రీన్‌ను ఎన్ని రంగులతో నింపారో.. ఆ ఫొటోను #HappyHoli అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా మాతో పంచుకోండి’ అంటూ రాసుకొచ్చిందీ సంస్థ.
గూగుల్ అందిస్తోన్న ఈ సరదా ట్రిక్ ఆండ్రాయిడ్, iOS వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. అయితే ఈ ట్రిక్ని ఉపయోగించి మీరు అప్పుడు ఓపెన్ చేసి ఉన్న సెర్చ్ పేజీలో మాత్రమే రంగులు నింపగలరు. స్క్రీన్‌పై మరే ఇతర చోట రంగులు చల్లడం వీలు కాదు.
మరింకెందుకు ఆలస్యం.. వెంటనే మీ మొబైల్/కంపూటర్లో గూగుల్ ఓపెన్ చేసి ఈ డిజిటల్ హోలీని ఆడేయండి..!

గతంలో కూడా..
గూగుల్ గతంలో కూడా ఇలాంటి ఎన్నో సరదా ట్రిక్‌లను నెటిజన్లకు పరిచయం చేసింది. గతేడాది ‘Avengers: End Game’ విడుదల సందర్భంగా గూగుల్ ఓ ట్రిక్ అందించింది. ఇందులో భాగంగా మీరు గూగుల్‌లో ‘Thanos’ లేదా ‘Mad Titan’ అని సెర్చ్ చేస్తే.. పేజీకి ఎడమ వైపున మీకు ఆరు Infinity stones ఉన్న Infinity Gauntlet బొమ్మ దర్శనమిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే ఆ పేజీలో ఉన్న సగం సమాచారం అదృశ్యమైపోతుంది. అప్పట్లో ఈ ట్రిక్ ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ ట్రిక్ ఇప్పటికీ గూగుల్‌లో అందుబాటులో ఉంది.