ఈ అవార్డు అందుకున్నందుకు గర్వపడుతున్నా. నేను కొరియోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్నప్పుడు నా చుట్టూ మగవాళ్లే ఉండేవారు. మహిళలు ఈ రంగంలోకి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూసేదాన్ని. అటువంటిది ప్రస్తుతం అన్ని రంగాల్లో మనం ఉండే స్థాయికి ఎదిగాం. ప్రముఖ మహిళలెందరో ఈ అవార్డు అందుకుంటుంటే, అంతటి ఉన్నత వ్యక్తుల మధ్య నాకూ స్థానం దక్కడం చాలా సంతోషంగా ఉంది. నేనీ స్థాయికి చేరుకోవడానికి నాకు ప్రోత్సాహాన్ని అందించిన అమ్మ, నా కుటుంబ సభ్యులతోపాటు పలువురు సినీప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నా. - అనీ

పశ్చిమబెంగాల్‌కి చెందిన అనీ చిన్నతనంలోనే హైదరాబాద్‌కి వచ్చింది ఆమెకు డ్యాన్స్ మాస్టర్ ఎవరూ లేరు. ఆర్థిక కష్టాల వల్ల తనే ఇంట్లో అద్దం ముందు గంటలపాటు డ్యాన్సు చేేసేది. పదో తరగతి చదివాక స్టేజ్షోల్లో డ్యాన్సు చేశారు. అలా డ్యాన్సర్‌గా మంచి పేరు రావటంతో చిరంజీవి హీరోగా నటించిన ‘శంకర్‌దాదా జిందాబాద్’ సినిమాలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసే అవకాశం చేజిక్కించుకున్నారు. తెలుగు, తమిళం, బాలీవుడ్ సినిమాలతో పాటు దాదాపు 200 సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసిన అనీకి ‘జ్యోతిలక్ష్మి‘ సినిమాతో కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చారు పూరీ జగన్నాథ్. సర్దార్ గబ్బర్‌సింగ్, పైసావసూల్, కాటమరాయుడు, మహానటి.. లాంటి చిత్రాలతో పాపులరైంది. ప్రస్తుతం ‘ఢీ జోడి’ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇంటింటికీ పరిచయమైంది అనీ.