తమ పిల్లలు బాగా చదువుకోవాలని, చక్కటి ఉద్యోగాలు చేయాలని అందరు తల్లిదండ్రులు అనుకుంటారు. మా అమ్మానాన్న నన్ను క్రీడల్లోకి తీసుకువచ్చారు. వాళ్ల వల్లే నేనీ స్థాయిలో ఉన్నా.

ఆమె విల్లు నుంచి దూసుకొచ్చిన బాణం లక్ష్యాన్ని ముద్దాడుతోంది.. ఆమె ఎక్కుపెడితే గురి కుదురుతోంది. ఆనాడు అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు.. ఈ అతివకు లక్ష్యం మాత్రమే కళ్ల ముందు మెదులుతుంది. అందుకే ఆర్చరీలో అడుగుపెట్టి.. పతకాలు కొల్లగొడుతోంది. ఆమే.. 23 ఏళ్ల విజయవాడ ఆర్చర్.. వెన్నం జ్యోతి సురేఖ. నాలుగేళ్ల వయసులో కృష్ణా నదిలో 5 కిలోమీటర్లను 3 గంటల 20 నిమిషాల్లో ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. పదేళ్ల వయసులో ఆర్చరీలో అడుగుపెట్టిన సురేఖ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు కొల్లగొట్టింది. 2011లో అంతర్జాతీయ టోర్నీల్లో అరంగేట్రం చేసి తన అద్భుత నైపుణ్యాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచకప్ అంచె పోటీలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు, ఆసియా క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లు... ఇలా ఏ టోర్నీలో పాల్గొన్నా పతకంతో తిరిగి రావడం అలవాటుగా మార్చుకుంది.