ఒక్క అడుగు.. కేవలం ఒకే ఒక్క అడుగు.. భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ను తొలి సారి ముద్దాడాలన్నా... 120 కోట్ల భారతావని సగర్వంతో తలెత్తుకోవాలన్నా.. కంగారూల గడ్డపై ‘వందేమాతరం’ నినాదాలు మార్మోగాలన్నా.. ‘భారత మహిళల క్రికెట్’ రూపురేఖలు మారిపోవాలన్నా.. కావాల్సింది మరో విజయం మాత్రమే. 15 రోజులపాటు సాగిన ప్రపంచకప్ సమరం అంతిమ ఘట్టానికి చేరుకుంది. ఫైనల్లో ఆతిథ్య జట్టు ఆసీస్‌తో భారత్ తలపడనుంది. మహిళలకు ఎంతో ప్రత్యేకమైన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే తుది సమరం.
ఈ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సేనకే కాదు.. భారత మహిళల క్రికెట్‌కూ ఎంతో కీలకం. ఎన్నో ఏళ్లుగా కష్టాలు, ఒడుదొడుకులు ఎదుర్కొని, కన్నీళ్లను దిగమింగి ఈ స్థాయికి చేరుకున్న భారత మగువుల క్రికెట్.. మరో అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే ఈ విజయం తప్పనిసరి. అయితే మహిళల క్రికెట్‌కు పెద్దగా గుర్తింపులేని దశ నుంచి ఇంతటి స్థాయికి చేరడానికి ఎంతోమంది సారథులు ఎనలేని కృషి చేశారు. ఒక్కో మెట్టుని పేర్చుతూ ఈ స్థాయికి తీసుకువచ్చారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం నాడు మెల్బోర్న్ వేదికగా జరిగే తుది పోరులో హర్మన్‌సేన గెలిచి మేటి సారథుల ఘన వారసత్వాన్ని నిలబెట్టుకుంటుందా? తొలిసారి కప్‌ను ముద్దాడి ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుకుంటారా?

అప్పుడే తొలి విజయం !
1721లో భారత్ తొలి మ్యాచ్ ఆడగా 1848లో ‘ఇండియన్ క్రికెట్ క్లబ్’ ఏర్పాటు చేశారు. అయితే టీమ్ఇండియా ఏర్పడింది మాత్రం 1911లో. 1932లో ఇంగ్లాండ్‌తో భారత్ అధికారిక తొలి టెస్టు ఆడింది. కొద్దికాలం తర్వాతే (1934).. భారత మహిళలు కూడా సుదీర్ఘ ఫార్మాట్ ఆడేశారు. కానీ, పురుషుల క్రికెట్ మాదిరిగా మహిళల క్రికెట్‌ను ప్రోత్సాహం లభించలేదు. దీంతో మహిళలకు క్రికెట్ అసోషియేషన్ ఏర్పడటానికి ఎన్నో ఏళ్లు పట్టింది. 1973లో ‘భారత ఉమెన్స్ క్రికెట్ అసోషియేషన్’ ఏర్పడింది. భారత మహిళల జట్టు 1976లో వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడింది. శాంతా రంగస్వామి సారథ్యంలో భారత్ తొలి విజయాన్ని అందుకుంది.
కానీ, భారత మహిళల క్రికెట్‌కు పెద్దగా ఆదరణ దక్కలేదు. మ్యాచ్‌లు, పర్యటనలు తక్కువగా ఉండేవి. అయినా జట్టు ప్రదర్శన గొప్పగానే ఉండేది. ఎట్టకేలకు 2006లో భారత ఉమెన్స్ క్రికెట్ అసోషియేషన్ను బీసీసీఐ విలీనం చేసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది. మ్యాచ్‌లు, పర్యటనలు పెరిగాయి. దీంతో తమ సత్తా చాటడానికి వారికి అవకాశాలు ఎక్కువగా లభించాయి. అనంతరం ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఆటలో పరిణతి సాధిస్తూ బలమైన జట్టుగా అవతరించింది. దీనిలో డయానా ఎడుల్జి, శాంతా రంగస్వామి, అంజుమ్ చోప్రా, మమతా మబేన్, జులన్ గోస్వామి, మిథాలీ రాజ్ వంటి మేటి సారథుల పాత్ర వెలకట్టలేనిది.

పునాది అక్కడే..
శాంతా రంగస్వామి భారత మహిళా క్రికెట్‌కు బలమైన పునాది వేసింది. భారత మహిళా జట్టు తొలి సారథిగా, జీవిత సాఫల్య పురస్కారం అందుకున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డులు సృష్టించింది. అంతేకాక మహిళల జట్టుకు తొలి గెలుపు రుచిని అందించింది ఆమె. భారత్ తరఫున ఆమె 16 టెస్టులు, 19 వన్డేలు ఆడింది. టెస్టుల్లో 750 పరుగులు, 21 వికెట్లు, వన్డేల్లో 287 పరుగులు, 12 వికెట్లు తీసింది. వెస్టిండీస్ వంటి బలమైన జట్లపై సహచరులు ఆకట్టుకోలేకపోతున్నా ఆమె బ్యాటుతో సత్తాచాటి జట్టుకు విజయాలు అందించింది. 12 టెస్టులు, 16 వన్డేలకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించింది. టెస్టుల్లో ఒక్క గెలుపు, రెండు ఓటములు, వన్డేల్లో 4 విజయాలు, 12 పరాజయాలు చవిచూసింది.

సంధించడంలో అగ్రస్థానం
1975లో అరంగేట్రం చేసిన డయానా ఎడుల్జి మూడేళ్లకే వన్డే సారథిగా బాధ్యతలు అందుకుంది. 18 వన్డేలు, 4 టెస్టులకు నాయకత్వం వహించింది. వన్డేల్లో 7 విజయాలు సాధించగా, అన్ని టెస్టులు ‘డ్రా’గా ముగించింది. కెప్టెన్‌గానే కాకుండా ప్లేయర్‌గా కూడా డయానా జట్టుపై ప్రభావం చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. భారత్ తరఫున 20 టెస్టులు, 34 వన్డేలు ఆడిన ఆమె.. 615 పరుగులు, 109 వికెట్లు సాధించింది. మొత్తంగా భారత విజయవంతమైన సారథుల్లో ఒకరిగా నిలిచింది. అంతేకాక మహిళల క్రికెట్లో అత్యధిక బంతులు సంధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించింది.

ఆధునిక క్రికెట్‌కు వారధి
భారత మహిళల క్రికెట్లో అంజుమ్ చోప్రా చురుకైన పాత్ర పోషించింది. జట్టును ఆధునిక క్రికెట్‌కు అలవాటు పడేలా తీర్చిదిద్దింది. 2002లో సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆమె 28 వన్డేలకు, మూడు టెస్టులకు కెప్టెన్సీ చేసింది. వన్డేల్లో 10 విజయాలు, 17 ఓటములు, టెస్టుల్లో ఒక్క విజయం సాధించింది. ఎడమచేతి వాటం బ్యాటర్, కుడిచేతి వాటం బౌలర్ అయిన అంజుమ్ భారత్ తరఫున దాదాపు 17 సంవత్సరాలు ఆడటం విశేషం. 12 టెస్టులు, 127 వన్డేలు, 18 టీ20లు ఆడిన ఆమె 3,645 పరుగులు చేసింది. వన్డేల్లో 21 వికెట్లు కూడా పడగొట్టింది.

దూకుడుతో..
మిడిల్ ఆర్డర్లో ఆడిన మమతా మబేన్ దూకుడు ప్లేయర్‌గా పేరు తెచ్చుకుంది. పదేళ్ల పాటు భారత్ తరఫున క్రికెట్ ఆడిన ఆమె 4 టెస్టులు, 40 వన్డేలు ఆడింది. 484 పరుగులతో పాటు, 21 వికెట్లు సాధించింది. అంతేకాక ఒక్క టెస్టు, 19 వన్డేలకు కెప్టెన్సీ చేసింది. ఏకైక టెస్టును డ్రా చేసుకున్న ఆమె వన్డేల్లో ఏకంగా 14 విజయాలు సాధించింది. ఏడాది పాటే సారథిగా బాధ్యతలు నిర్వర్తించినా జట్టును దూకుడుతో నడిపించింది.

యువ పేసర్లకు ప్రేరణ
కెప్టెన్‌గా కంటే జులన్ గోస్వామి బౌలర్‌గా భారత్ క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించింది. 2008 నుంచి 2011 మధ్యలో 25 వన్డేలకు కెప్టెన్సీ చేసిన ఆమె 12 విజయాలు, 13 పరాజయాలను చవిచూసింది. అయితే యువ మహిళా పేసర్లకు గోస్వామినే స్ఫూర్తి. 2002లో అరంగేట్రం చేసిన ఆమె ఇప్పటికీ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో మేటిగా నిలుస్తుంది. 2018లో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె 10 టెస్టులు, 182 వన్డేలు, 68 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్లో 40, వన్డేల్లో 225, టీ20ల్లో 56 వికెట్లు పడగొట్టింది. వన్డేల్లో అత్యధిక వికెట్లు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

అందరిలో మిథాలీ ప్రత్యేకం !
మిథాలీ రాజ్ వచ్చిన తర్వాత భారత మహిళల క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. ఈమె సారథ్యంలోనే భారత జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడింది. అంతేకాక బలమైన జట్లను మట్టి కరిపించింది. మిథాలీ 132 వన్డేలకు, ఆరు టెస్టులకు కెప్టెన్సీ చేసింది. టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా ఒక్క ఓటమి చవిచూసింది. ఇక వన్డేల్లో 82 మ్యాచ్‌ల్లో గెలవగా, 47 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. వన్డే ప్రపంచకప్‌లో జట్టును రెండు సార్లు ఫైనల్‌కు చేర్చిన భారత కెప్టెన్‌గా ఘనత సాధించింది.
ప్లేయర్‌గానూ మిథాలీ ఎన్నో రికార్డులు నమోదు చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. 1999లో ఐర్లాండ్ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఆమె ఇప్పటికీ భారత్ తరఫున ఆడుతుండటం విశేషం. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె వన్డే, టెస్టులకు సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. టీమ్ఇండియా తరఫున ఆమె 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడింది. సుదీర్ఘ ఫార్మాట్లో 663, వన్డేల్లో 6,888, టీ20ల్లో 2,364 పరుగులు సాధించింది. ప్రస్తుతం భారత మహిళల క్రికెట్ మంచి స్థితిలో ఉండటానికి ఎంతో మంది క్రికెట్ తారలు కారణమైనా.. అందరిలోనూ మిథాలీ పాత్ర ప్రత్యేకం.