అర్జున్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. సాధారణ టీవీ జర్నలిస్ట్‌గా ఉద్యోగం చేస్తోన్న అర్జున్‌కి అనుకోకుండా ‘ఒక్క రోజు ముఖ్యమంత్రి’గా పని చేసే అవకాశం లభిస్తుంది. దీంతో ప్రజల శ్రేయస్సు కోసం తాను అప్పటివరకు చేయాలనుకున్న పనులను ఒక సీఎంగా అర్జున్ పూర్తి చేసి ప్రజల మన్నలను పొందుతాడు. ఇలాంటి సంఘటనలు కేవలం సినిమాల్లోనే జరుగుతాయని అనుకుంటే పొరపాటే..! ఎందుకంటే మహారాష్ట్రకు చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థినులకు ఇటీవల ‘ఒక్కరోజు కలెక్టర్’గా పని చేసే అవకాశం లభించింది. మరి వాళ్లకు ఈ అవకాశం ఎలా వచ్చింది..? ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు? మొదలైన ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా మహిళా సాధికారతను చాటుతూ వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బుల్డాణా జిల్లా కలెక్టర్ సుమన్ రావత్ చంద్ర కూడా ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అదేంటంటే.. చదువులో చురుగ్గా ఉంటోన్న స్కూల్ విద్యార్థినులకు ఈ వారం రోజుల పాటు (మార్చి 2 నుండి మార్చి 8 వరకు) ఆమె ఒక్కరోజు కలెక్టర్‌గా పని చేసే అవకాశమిస్తున్నారు. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవా’న్ని పురస్కరించుకొని.. విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్ర తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకొంటోన్న పూనమ్ దేశ్‌ముఖ్ అనే విద్యార్ధిని మార్చి 2న బుల్డాణా కలెక్టర్‌గా విధులు నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను చంద్ర ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
తనే ఈరోజు కలెక్టర్..!
‘అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని.. చదువులో చురుగ్గా ఉన్న కొంతమంది బాలికలకు ఒక్కరోజు కలెక్టర్‌గా పని చేసే అవకాశమిస్తున్నాం. మరి ఈరోజు కలెక్టర్.. జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థిని పూనమ్ దేశ్‌ముఖ్.
పూనమ్ తనకు అప్పగించిన బాధ్యతలను చక్కగా పూర్తి చేసింది. తనకు ఆత్మస్థైర్యం ఎక్కువే..! అంతేకాదు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తానని, తోటి విద్యార్థినులకు ఆదర్శంగా నిలుస్తానని పూనమ్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసింది’ అంటూ చంద్ర రాసుకొచ్చారు.
చంద్ర తీసుకున్న ఈ నిర్ణయానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘అమ్మాయిలు చదువుకునే వయసు నుంచే ఉన్నతంగా ఆలోచించాలి.. అనే సందేశాన్ని ఈ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు మీకు హ్యాట్సాఫ్’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
ప్రతి మనిషికీ జీవితంలో ఏదో సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఫలానా ఉద్యోగంలో స్థిరపడాలని.. ఇలా రకరకాల లక్ష్యాలుంటాయి. ఎక్కువశాతం ఈ ఆలోచనలకు పునాది పడేది చిన్న వయసులోనే..! పిల్లలు చిన్నతనంలో పెరిగిన వాతావరణం, ఎదురైన అనుభవాలు, స్ఫూర్తినిచ్చిన మనుషులు.. మొదలైన విషయాలు జీవితంలో వాళ్లు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతుంటారు. అందుకే పిల్లలు చదువుకునే వయసులో ఉండగానే వాళ్లు జీవితంలో గొప్పస్థాయికి చేరుకునేలా ఉన్నతమైన మార్గాలను సూచించడం తల్లిదండ్రులు, గురువుల బాధ్యత. ఇప్పుడు చంద్ర తలపెట్టిన ఈ ప్రయత్నం కూడా ఈ కోవకు చెందిందే కావడం ప్రశంసనీయం!