భారత బ్యాడ్మింటన్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన ఘనత పి.వి.సింధు సొంతం. సైనా ఘనతల తర్వాత మన స్థాయి ఇది అనుకునేలోపే సింధు ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఫిట్నెస్.. దూకుడుతో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌ను, భారత రాకెట్ జోరును అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఎవరూ ఊహించని ఘనతలు అందుకుంది. సైనా సాధించిన ఘనతలకు మెరుగులు దిద్దింది. ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో రజతం. కాంస్యం.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం, కాంస్యం.. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాల్ని సింధు కైవసం చేసుకుంది. ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్, చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ వంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లను సాధించింది.

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్.. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం, రజతం..ఆసియా క్రీడల్లో రజతం గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టైటిల్ సాధించిన మొదటి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. అత్యుత్తమ ఫిట్నెస్.. దూకుడుతో మహిళల బ్యాడ్మింటన్‌లో ఊపు తెచ్చింది. ఒకప్పుడు పురుషుల మ్యాచ్‌లకే ఆదరణ ఉండగా.. మహిళల పోరాటాల్ని ఆసక్తిగా మార్చిన ఘనత సింధుదే. జపాన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరతో సుదీర్ఘంగా మ్యాచ్‌లు ఆడటం సింధుకే చెల్లింది. ప్రపంచ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ), ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), మాజీ ప్రపంచ ఛాంపియన్ ఇంతానన్ రచనోక్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులకు సమ ఉజ్జీ మన సింధు.
* ఇక గతేడాది ‘ఫోర్బ్స్’ విడుదల చేసిన అత్యధిక ఆర్జన కలిగిన మహిళా అథ్లెట్లలో 13 వ స్థానం సొంతం చేసుకుంది సింధు.
* ఇప్పటికే పద్మశ్రీతో పాటు రాజీవ్ ఖేల్‌రత్న అవార్డులు అందుకున్న సింధు... ఇటీవల పద్మభూషణ్‌కు కూడా ఎంపికైంది.