
ఫరీహా తఫిమ్.. పేదరికంలో పుట్టి, జాతీయస్థాయి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణిగా ఎదిగింది. కట్టుబాట్లు, ఇతర అడ్డంకులు ఎదురైనా...వెనకడుగు వేయకుండా ముందుకు సాగుతోంది. క్రీడలో ప్రావీణ్యం పెంచుకుంటూ పతకాల పంట పండిస్తోంది.
ఫరీహా స్వస్థలం హైదరాబాద్. పాఠశాలలో ఆత్మ రక్షణ విద్య మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. సాధన చేయడం ప్రారంభించిన మూడేళ్లలోనే జాతీయ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. అమ్మ, ఇంట్లో వాళ్లు వద్దని చెప్పినా... సంప్రదాయాలు, ఇతర కట్టుబాట్లు అడ్డంకులు సృష్టించినా... ఆమె మాత్రం మనోధైర్యంతో ముందుకు సాగుతోంది. కానీ ఆమె తండ్రి, పాఠశాల నిర్వాహకులు, శిక్షకులు ఆమెను వెన్నుతట్టి ప్రోత్సహించారు. 'ఇల్లు దాటి ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా... పోటీల్లో నెగ్గి ఇంటి బాట పడతానని' పట్టుదలతో చెప్పి ఆమె అసోంలో జరిగే ఛాంపియన్‌షిప్‌కు బయలుదేరింది. ఆ పోటీల్లో ఫరీహాకు ఎదురే లేకుండా పోయింది.ప్రత్యర్థులను మట్టికరిపించి పతకాల పంట పండించింది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొని, సంప్రదాయాలు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా పోరాడి ఆమె రాణించిన క్రమం ఎంతోమందికి ఆదర్శం. అందుకే ఆమె జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి లండన్‌కు చెందిన ప్రముఖ ఫిల్మ్ మేకర్ జయేషా పటేల్ ఫరీహాపై ఇండియన్ వుషూ వారియర్ గర్ల్ పేరుతో డాక్యుమెంటరీ తీశారు. తల్లితో సంఘర్షణల నుంచి ఆమె విజయ తీరాలు చేరేవరకు సాగిన ఫరీహా జీవితంతో రూపుదిద్దుకున్న ఈ డాక్యుమెంటరీ... ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఫరీహాకి మేరీకోమ్ ఆదర్శం. ఈ ఆట గురించి ప్రజలకు తెలియజేయాలనుకుంటోంది.

ఫరీహా రోజూ ఉదయం మూడు గంటలు సాధన చేస్తుంది.తన శిక్షకుడు వాజా ఆమెకు ఆరో తరగతి నుంచి శిక్షణ ఇస్తున్నాడు. అతడు ఫరీహాను ఎప్పుడూ ప్రోత్సహిస్తాడు. ఆటలో ఆమె మెరుగవడానికి నిత్యం సహాయపడతాడు. ఫరీహాకు గేర్ బైక్‌ను నడపడమంటే ఇష్టం. జీవితంలో ఐపీఎస్‌గా స్థిరపడాలనేది ఆమె ఆకాంక్ష.

'ఛాంపియన్షిప్ గెలవడం నేనెప్పుడు మరిచిపోను. నన్ను ఈ ఆట వైపు పంపడానికి ఇష్టపడని మా అమ్మకి ఇది ఎంతో ఆనందాన్నిచ్చింది. నేను ఇందులో రాణిస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తున్నా.ఇది ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి కలగజేస్తుంది. అసోం ఛాంపియన్‌షిప్‌లో నా ప్రత్యర్థి నాతో పోటీ పడటానికి భయపడి వెనుదిరిగింది. దీంతో నన్ను విజేతగా ప్రకటించారు. దీనిని ఎప్పటికీ మరిచిపోను. అదో తీపి జ్ఞాపకం' అని చెబుతోంది ఫరీహా.