
తన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులు దోచుకున్న మంగ్లీ అసలు పేరు సత్యవతి రాఠోడ్. గాయనిగా, బుల్లితెర యాంకర్‌గా, నటిగా మనందరికీ సుపరిచితురాలు. బంజారాలో పుట్టిన బంగారు బొమ్మ ఆమె.పాలమూరు పిల్ల. తనకు చిన్నప్పటినుంచి పాటలు పాడటం అంటే అమితాసక్తి. మంగ్లీ నాన్న బాలూ నాయక్ జానపద పాటలు పాడేవారు.అలా తండ్రిని చూస్తూ పెరిగిన మంగ్లీకి కూడా పాటలంటే ఇష్టం కలిగింది. ఆమె ఆసక్తిని గమనించిన ఆయన ఆమెను పాటలు నేర్చుకుని, పాడేలా ప్రోత్సహించారు. అయితే కేవలం సంగీతమే కాకుండా భరతనాట్యం కూడా నేర్చుకుందామె.

సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క జాతర, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం...ఇలా పండగేదైనా మంగ్లీ గొంతు నుంచి పాట జాలువారాల్సిందే. ఆమె పాడిన పాటలన్నింటిలో రేలా...రే మంగ్లీకి ఎంతో గుర్తింపు తెచ్చింది. 'మాటకారి మంగ్లీ' ప్రోగ్రామ్ ద్వారా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. ఆ కార్యక్రమానికి బాగా ఆదరణ పెరగడంతో ఆ పాత్రపేరే ఆమెకు స్థిరపడిపోయింది. ఆ కార్యక్రమానికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ యాంకర్‌గా రెండు జాతీయ అవార్డులను కూడా అందుకుంది మంగ్లీ. ఇవన్నీ ఆమెకు సినిమాల్లో పాడే అవకాశాలు తెచ్చిపెట్టాయి. 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్బీ', 'లచ్చి', 'జిందగీ', శైలజారెడ్డి అల్లుడు... సినిమాల్లోనూ పాడి తనదైన గుర్తింపు తెచ్చుకుంది.

బంజారా ఉనికిని ప్రతిబింబించే దుస్తులంటే ఆమెకు చాలా ఇష్టం. గాయకుల్లో రాజస్థానీ గాయని భన్వారీ దేవి అంటే ప్రత్యేకమైన అభిమానం తనకి. హిందీతోపాటు అన్ని భాషల్లో పాడాలనేది ఆమె కోరిక. కొంతకాలంగా 'మంగ్లీ ముచ్చట్లు' పేరుతో సెలబ్రిటీలను కూడా ఇంటర్వ్యూలు చేస్తోంది. ఆడపిల్లగా విమర్శ ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన ఆమె... ఇప్పుడు తనదైన ముద్ర వేస్తోంది.