
జయ నల్లబోతుల స్వస్థలం గుంటూరు జిల్లా సత్తెనపల్లి. ఆమె తండ్రి, చిన్నాన్నలు రైతులు. పంటలు సరిగా పండక, చీడలు ఆశించడం, దిగుబడి రాకపోవడం వంటి సమస్యల్ని ఎదుర్కొనేవారు. అలానే మరి కొందరు రైతులు వ్యవసాయం లాభసాటికాక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవడం ఆమె చూశారు. అందుకే బాగా చదువుకుని.. కార్పొరేట్ ఉద్యోగంలో స్థిరపడ్డా రాజీనామా చేశారు. తన చదువు, నైపుణ్యాలు రైతులకు ఉపయోగపడాలని.. 2015లో 'స్టాంప్ ఐటీ సొల్యూషన్స్' పేరుతో అంకుర పరిశ్రమను ప్రారంభించారు. రైతులకోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేశారు. పంటల్ని సంరక్షించుకోవడం, చీడల్ని గుర్తించి వాడాల్సిన మందులు, నిపుణుల సూచనల వంటివన్నీ ఈ యాప్ ద్వారా అందిస్తున్నారు. ప్రస్తుతం 24వేల హెక్టార్లలో...14వేల మంది రైతులు ఆయిల్‌ఫాం సాగు చేస్తూ లబ్ధి పొందుతున్నారు.

ఆయిల్‌ఫాం సంస్థలు రైతుల వద్ద భూములు సేకరించి పంటసాగు చేస్తాయి. ఈ క్రమంలో వారి ఉద్యోగులు పంటల సాగు, చీడల గురించి తనిఖీలకు వెళాల్సి ఉంటుంది. అది కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతోనే జయ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ముందుగా పొలం సరిహద్దుల్ని జీపీఎస్ సాయంతో ట్యాగ్ చేస్తారు. దీన్ని జియో ట్యాగింగ్ అంటారు.దాంతో ఆయిల్‌ఫాం ప్రతినిధి.. ఆ పొలంలోకి వెళ్లి నిలబడితేనే ఆ రైతుకు సంబంధించిన డాక్యుమెంట్ తెరుచుకుంటుంది. ఇది నెట్ లేకపోయినా పనిచేస్తుంది. అంతేకాదు పంట ఎలా ఉందీ, మొక్కల పరిస్థితి ఇలా అన్నీ ఫొటోలు తీసి పంపొచ్చు. అలానే అప్పటికప్పుడు ఆయిల్‌ఫాం సంస్థలోని నిపుణుల బృందం సమస్యని విశ్లేషించి పరిష్కారం చెబుతుంది. అలానే చదువుకోనివారు కూడా ఈ స్మార్ట్ఫోన్ల ద్వారా సాఫ్ట్‌వేర్‌ను తేలిగ్గా ఉపయోగించగలుగుతారు. జయ ముందుగానే రైతులకి వారి వివరాలతో ఓ క్యూఆర్ కోడ్ ఉన్న గుర్తింపు కార్డును అందిస్తారు. పంట చేతికి వచ్చాక తూకం వేసినప్పుడు బరువు వివరాలు ఆ కార్డు ద్వారానే సర్వర్లోకి వెళతాయి. దీనివల్ల తప్పుడు తూకం, చెల్లింపుల్లో మోసం వంటివి ఉండవు. ఇలాంటి సేవల్ని భోపాల్, చెన్నై, ఆంధ్రా ఒడిశాలలో అందిస్తున్నారు.

అలానే చేపల సాగుకూ జయ రూపొందించిన సాఫ్ట్వేర్ ఉపయోగపడుతోంది. ఆయిల్‌ఫాం రైతుల మాదిరే చేపల చెరువుల్ని కూడా జియో ట్యాగింగ్ చేసి సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. తద్వారా చేపల చెరువులు సాగుచేసే రైతులు నష్టపోకుండా లాభాల బాట పడుతున్నారు. నేషనల్ ఫిషరీ బోర్డు ఆంధ్రా, తెలంగాణ, ఒడిశాలో మొత్తం ఓ పది ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వాటికీ ఆమె సాంకేతిక సేవల్ని అందిస్తున్నారు. అలానే ఈమధ్య ఆగ్రో స్టార్టప్‌లు వేగం పుంజుకున్నాయి. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్నవారి వద్ద నుంచి పెట్టుబడిని షేర్ల రూపంలో తీసుకుని..రైతులకు ఆ మొత్తం చెల్లించి వారి చేతసాగు చేయిస్తున్నారు. భోపాల్‌లోని ఓ స్టార్టప్..ఇలా పెట్టుబడి పెట్టించడమే కాకుండా రైతులు పండించిన కాయగూరల్ని నేరుగా వినియోగదారులకు చేరవేస్తుంది. ఇలాంటివారి స్టార్టప్‌లకూ సాఫ్ట్‌వేర్‌ను ఇవ్వడమే కాదు సర్వర్లను అద్దెకిస్తున్నారు.