
ఎముకలు కొరికే చలిలో, అస్సలు ఇష్టపడని ఆహారంతో, ఆక్సిజన్ ట్యాంక్ లాంటి బరువును భుజాన వేసుకొని ప్రపంచంలోనే ఎత్త్తెన పర్వతం అధిరోహించింది మలావత్‌పూర్ణ. ఆ తరువాత మరికొన్ని శిఖరాలను సునాయాసంగా ఎక్కేసింది ఈ యువ సాహసి. మలావత్ పూర్ణ స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. తల్లిదండ్రులు దేవిదాసు, లక్ష్మి. ఇద్దరూ రోజువారీ వ్యవసాయ కూలీలు. నెలకు వారిద్దరి ఆదాయం మొత్తం కలిపితే మూడువేల రూపాయలు మాత్రమే. దీంతో ఆమెను ఉచితంగా విద్యనందిస్తున్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకోసం చేర్చారు. అక్కడ చేరాక ఆ గురుకులంలో విద్యార్థులకు పర్వతారోహణలో శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఆసక్తి చూపింది. వారు అవకాశం ఇవ్వడంతో పూర్ణ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఎనిమిది నెలలు శిక్షణ తీసుకుంది. ఆమె పట్టుదలకు సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్, శిక్షకుడు శేఖర్ బాబు ప్రోత్సాహం కూడా తోడయ్యింది. పర్వతారోహణ శిక్షణలోని ఇబ్బందులను, కష్టాన్ని చూసి చాలామంది విద్యార్థులు వెనక్కితగ్గినా ఆమె మాత్రం వెనకడుగు వేయలేదు. పట్టు వదలకుండా సాధన చేసి ప్రపంచ రికార్డు సాధించింది.

మొదట ఆమెకు శిక్షణ భువనగిరిలో ప్రారంభమైంది. ఎవరెస్టు పర్వతం అధిరోహించేందుకు ముందు డార్జిలింగ్‌లోని మౌంట్ రెనాక్‌పై సాధన చేసింది. దాని ఎత్తు 17వేల అడుగులు. శీతల వాతావరణాన్ని తట్టుకోవడానికి మైనస్ 35 డిగ్రీల సెల్సియస్ ఉన్న లద్దాక్‌లోని పర్వతాలు అధిరోహించింది. ఆ తరువాతే ప్రపంచంలో ఎత్త్తెన ఎవరెస్టు శిఖరం ఎక్కడం ప్రారంభించింది. నేపాల్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు ఉన్నవారిని ఎవరెస్టు ఎక్కేందుకు అనుమతించకపోవడంతో ఆమె టిబెట్ నుంచి తన సాహస యాత్రను మొదలుపెట్టింది. ఎవరెస్టు అధిరోహించే సమయంలో ప్యాక్ చేసిన పదార్థాలు తినాల్సి వచ్చేది. ఇవి అంత సులువుగా జీర్ణం కావు. పైగా ఆ వాసన పూర్ణకు నచ్చేది కాదు. దీంతో చాలాసార్లు పొట్ట మాడ్చుకునేది. మొత్తం 52 రోజుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఆనంద్‌కుమార్‌తో కలిసి పర్వతాన్ని అధిరోహించింది. అప్పటికి పూర్ణ వయసు కేవలం 13 ఏళ్ల 11 నెలలు. దీందో ప్రపంచంలోనే అతి ఎత్త్తెన పర్వతాన్ని అధిరోహించిన అతి చిన్నవయస్కురాలిగా రికార్డు సృష్టించింది.

తరువాతి సంవత్సరాల్లో ఆఫ్రికాలోని కిలిమాంజారో, రష్యాలోని ఎల్బ్రుస్ పర్వతాలను అధిరోహించింది. ఇటీవలే దక్షిణ అమెరికా అర్జెంటీనాలోని అకోంకాగ్వా పర్వత శ్రేణిని సునాయాసంగా ఎక్కేసింది. కేవలం అయిదేళ్ల వ్యవధిలోనే నాలుగు పర్వత శ్రేణులను అధిరోహించేసింది.
'పర్వతారోహణ తేలికైన విషయం కాదు. రాత్రింబవళ్లు విశ్రాంతి లేకుండా సాగే సాహసయాత్ర. మధ్యలో కొండ చరియలు విరిగిపడతాయి. వాతావరణం అనుకూలించదు. ఆక్సిజన్ ట్యాంకుతోనే ప్రయాణం సాగించాలి. ఎవరెస్టు ఎక్కడం కూడా అనుకున్నంత సులభం కాదు. కానీ నా మనోధైర్యం నన్ను ముందుకు సాగేలా చేసింది. నా అకోంకోగ్వా సాహస యాత్రకు కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల సహకారం ఉంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో వారికి వివరించా. యూట్యూబ్‌లో విమానాలు నడిపేవారిని చూపించా..' అని చెబుతుంది పూర్ణ. పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి విజయమైనా సాధిస్తాం అని చెప్పడానికి మలావత్ పూర్ణే నిదర్శనం.