తెలుగు సినీ రంగంలో నిర్మాతగా స్వప్నాదత్ తనదైన ముద్ర వేశారు. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకులైన అశ్వనీదత్ కుమార్తెగా కాకుండా... సొంతంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఓహియో యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన స్వప్న తండ్రికి చిత్ర నిర్మాణ రంగంలో సాయం చేస్తూనే సోదరి ప్రియాదత్తో కలిసి సొంతంగా సినిమాలు తీశారు. అలా ఇద్దరూ కలిసి ఎవడే సుబ్రమణ్యం, మహానటి చిత్రాల్ని నిర్మించారు.

సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన మహానటి చిత్రం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించింది. విదేశాల్లో చదువుకొని వచ్చాక పెద్దవాళ్లు పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. స్వప్న మాత్రం 'ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేస్తా' అంటూ మనసులో మాట బయటపెట్టారు. 'అలాగే, జాగ్రత్తగా ప్లాన్ చేసుకో' అన్న తండ్రి మాటల్నే స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు నుంచీ ఈరోజు వరకూ అదే ఒరవడితో, ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఆ సమయంలో చాలామంది స్వప్నని 'ఏక్తాకపూర్ అవ్వాలనుకుంటున్నావా' అనడిగారు. అప్పుడామె 'నేను స్వప్నాదత్గా నాకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటా' అంటూ ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. అలా 'వైజయంతీ టెలీ వెంచర్స్' ప్రారంభించి రియాలిటీ షోల మీద దృష్టి పెట్టారు. హుషారు పాటలు, వూపేసే డ్యాన్సులు, ప్రముఖుల పార్టిసిపేషన్ కలగలిపి ప్రోగ్రామ్స్ నిర్మించాలనుకున్నారు. ఆ ఆలోచన విజయవంతమైంది. వారానికి ఓ సెలబ్రిటీని అతిథిగా పిలిచి నిర్వహించిన 'సరిగమప', ఝుమ్మందినాదం'... సూపర్హిట్టయ్యాయి. తరవాత 'వాయిస్ ఆఫ్ ఆంధ్ర', 'సప్తస్వరాలు', 'రాజూరాణి విత్ జగపతి', 'జయప్రదం', నీ కొంగుబంగారం కానూ' 'నర్తనశాల'... అన్నీ 'సూపర్' హిట్లే. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ స్వప్న రాకెట్లా టీవీ కార్యక్రమాలు, సినిమాలతో దూసుకుపోతున్నారు. స్వప్న జీవితంలో పెద్ద ప్రశంస అంటే... 'అశ్వినీదత్కి నువ్వు కూతురివి కాదు కొడుకువి' అని అందరూ పొగడటమేనట.
