మలాలా యూసఫ్ జాయ్, గ్రెటా థన్‌బర్గ్, ...అతి పిన్న వయసులోనే సమాజ శ్రేయస్సు కోసం నడుం బిగించిన ఈ యంగ్ సోషల్ యాక్టివిస్టుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 17 ఏళ్ల వయసులోనే పుస్తకాలను పక్కన పెట్టి పర్యావరణ పరిరక్షణ కోసం గ్రెటా పోరాడుతుండగా, 13 ఏళ్లకే తాలిబన్ల తూటాలకు గురై ప్రస్తుతం పిల్లలు, బాలికల హక్కుల కోసం కృషి చేస్తోంది మలాలా. సామాజిక సమస్యల పరిష్కారం కోసం ఎన్నో అంతర్జాతీయ వేదికలపై తమ గళాన్ని వినిపించిన ఈ యువకెరటాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న మలాలా, గ్రెటాలు తాజాగా ఒకేచోట ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
బాలికల హక్కుల కోసం!
మలాలా...చదువుకునేందుకు కట్టుబాట్లను సైతం కాదని తాలిబాన్ల తుపాకీ గుళ్లకు గురైన పాకిస్థాన్ మానవ హక్కుల కార్యకర్త. మృత్యువుతో పోరాడి కోలుకున్న ఆమె తనలాంటి పరిస్థితి మరొక అమ్మాయికి రాకూడదని బాలికల విద్య, హక్కుల కోసం తనదైన శైలిలో కృషి చేస్తోంది. తన కృషికి గుర్తింపుగా 2014లో 17 ఏళ్లకే నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ఆమె ఈ ఘనత సాధించిన అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. తన పోరాటంతో నేటి తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్న మలా లాను గతేడాది ఐక్యరాజ్య సమితి ‘ఈ దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్’గా గుర్తించిన సంగతి తెలిసిందే.
ప్రకృతిపై ప్రేమతో!
పర్యావరణంపై ప్రేమతో ప్రపంచమంతా తిరుగుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తోన్న వారిని సూటిగా ప్రశ్నిస్తోంది స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్. ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్,’ ‘యూత్ ఫర్ క్లైమేట్’ పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తూ అంతర్జాతీయ మేధావుల ప్రశంసలు అందుకుందీ స్వీడిష్ టీనేజర్. ఉద్యమంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి అగ్రరాజ్యాధి నేతలు తనను విమర్శించినా దీటుగా బదులిచ్చి అందరి దృష్టినీ ఆకర్షించిందీ టీనేజ్ సెన్సేషన్. తన ఉద్యమ స్ఫూర్తికి గుర్తింపుగా గతేడాది ఫోర్బ్స్ ప్రకటించిన ‘వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల’ జాబితాలో చోటు దక్కించుకున్న గ్రెటా 2019 నోబెల్ శాంతి పురస్కారానికి కూడా నామినేట్ అయ్యింది.
లండన్‌లో కలుసుకున్నారు!
మలాలా ప్రస్తుతం లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేస్తోంది. ఇక పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా గ్రెటా ప్రతి శుక్రవారం ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ పేరుతో నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఈనెల 28న బ్రిస్టల్‌లో కూడా ఓ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుందీ టీనేజ్ సెన్సేషన్. ఈ కార్యక్రమం కోసం లండన్ వచ్చిన గ్రెటా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న మలాలాను కలుసుకుంది. కళాశాలలోని మార్గరెట్ హాల్లో సమావేశమైన ఈ యువకెరటాలు తమ సామాజిక కార్యక్రమాల పురోగతిపై చర్చించుకున్నారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణపై అక్కడి విద్యార్థులకు అవగాహన కల్పించింది గ్రెటా.
నా రోల్ మోడల్‌ను కలుసుకున్నా!
ఈక్రమంలో యూనివర్సిటీ ఆవరణలో గ్రెటాతో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టా్గ్రామ్ ఖాతాలో షేర్ చేసుకుంది మలాలా. ‘థ్యాంక్యూ గ్రెటా థన్‌బర్గ్’ అని తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చిందీ యువకెరటం. ఇక గ్రెటా కూడా మలాలాతో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘ నేను ఈరోజు నా రోల్ మోడల్‌ను కలుసుకున్నాను. ఇంతకంటే ఏం చెప్పగలను’ అని క్యాప్షన్ ఇచ్చిందీ టీనేజ్ సెన్సేషన్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఈ ఫొటోలు ఇప్పటివరకు సుమారు 15లక్షల లైకులు సొంతం చేసుకోవడం విశేషం. ప్రియాంకా చోప్రా, యునిసెఫ్ ప్రతినిధులతో పాటు పలువురు నెటిజన్లు వీరి ఫొటోలపై స్పందిస్తూ ‘ ఈ సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా కృషి చేస్తోన్న ఇద్దరు యువ కెరటాలు ఒక్కచోట చేరడం అద్భుతం’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.