పీవీ సింధు... పరిచయం అక్కర్లేని పేరు. ఈ బ్యాడ్మింటన్ ధ్రువతార.. సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించారు. ఈనాడులో మహిళల పేజీ అయిన వసుంధర విభాగానికి ‘ప్రత్యేక అతిథి’గా వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

అమ్మానాన్న వాలీబాల్ క్రీడాకారులు కదా... మీరెందుకు బ్యాడ్మింటన్ వైపు వచ్చారు?
ఆసక్తితోనే ఇటువైపు వచ్చా. నాన్న వాలీబాల్ ఆడేటప్పుడు పక్కనే బ్యాడ్మింటన్ కోర్టు ఉండేది. సరదాగా అందులో చేరా. ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తానని, ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. అమ్మానాన్నల సహకారంతో క్రమంగా ఎదుగుతూ వచ్చా. ఇక్కడొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రతి ఒక్కరికీ అమ్మానాన్నల అండ చాలా అవసరం. అందరు తల్లిదండ్రులూ ఆ రకంగా సాయం అందించలేకపోవచ్చు. పిల్లల్ని అనుకున్నదాంట్లో చేర్పించడమే కాకుండా వారు ఆ దిశగా అడుగులు వేసేలా ప్రోత్సాహాన్ని అందించాలి. లక్ష్యాన్ని చేరుకునేందుకు జీవితంలో చాలా వదులుకోవాల్సి ఉంటుంది. వాటన్నింటినీ అధిగమించి ముందుకు వెళితే మనం అనుకున్నది సాధిస్తాం.

ఇంత చిన్న వయసులో పేరుప్రఖ్యాతులు, డబ్బు వచ్చాయి. వీటిని మీరెలా సమన్వయం చేసుకుంటారు? వీటి నుంచి ఏం నేర్చుకున్నారు?
‘జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి.. ఎక్కడి నుంచి వచ్చామనేది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం’ అని నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఎంత పేరుప్రఖ్యాతులు వచ్చినా ఈ విషయాలను గుర్తు పెట్టుకుంటా. ఎన్నో ఆటలు గెలుస్తూ వస్తున్న ఒక క్రీడాకారిణిగా గర్వంగా భావిస్తా. జీవితంలో గెలుపోటములనేవి ఉంటాయి. ఓటమి రాగానే కుంగిపోను. మనం గెలుస్తామనే నమ్మకాన్ని వదలను.
నేను దేవుణ్ని నమ్ముతాను. దేవుడు ప్రత్యక్షమైతే.. అందరూ బాగుండాలని కోరుకుంటా.

ఇప్పటికీ మీ నాన్నగారు దగ్గరుండి అన్నీ చూస్తారు కదా. ‘నాన్నా నాకన్నీ తెలుసు’ అని ఎప్పుడైనా చెప్పాలనిపిస్తుందా?
హ్హహ్హహ్హ... ఇప్పుడు కూడా... ‘ఆడేటప్పుడు నాకు తెలుసు.. నేను ఇలా ఆడతా... అలా చేస్తా..’ అని చెబుతా. ‘అలా కాదు ఇలా’ అని నాన్న చెబుతారు. అప్పుడప్పుడు వినను. ఆ తరువాత ‘మీరప్పుడు అలా చెప్పారు కదా.. అది కరెక్టే’ అని నాన్నతో చెబుతా.. కొన్నిసార్లు మనం పెద్దలు చెప్పే మాటలు వినం. కొన్ని విషయాలు చెప్పినప్పుడు వినిపించుకోం. ఆ తరువాత వారు చెప్పిన మాట వింటే బాగుండేది అనిపిస్తుంది. పెద్దవారికి చాలా అనుభవం ఉంటుంది. వారి జీవితానుభవం ఎక్కువ కాబట్టి వింటే తప్పు కాదు కదా.

గెలిచినప్పుడు సరే.. మరి ఓటమి, విమర్శలను ఎలా తీసుకుంటారు?
విమర్శల్ని ఎలా తీసుకోవడం అనేది మనలోనే ఉంటుంది. గెలిచినప్పుడు కొంతమంది ‘వావ్.. ఎన్నో గెలిచావ్. అంతా సాధించేశావ్’ అంటారు. ఓడిపోయినప్పుడు... ‘ఏంటీ అమ్మాయి అస్సలు ఆడట్లేదు’ అంటూ విమర్శిస్తారు. జనాలు ప్రశంసించినప్పుడు సహృదయంతో తీసుకుంటా. విమర్శించినప్పుడు వాటికి పెద్దగా స్పందించను. నా రాకెట్‌తోనే సమాధానం చెప్పాలనుకుంటా. మరో గెలుపుతో సమాధానం ఇవ్వాలనుకుంటాను. ఆటలో ఒత్తిడి లేని వారెవరు? మన నుంచి ప్రజలు విజయాన్ని ఆశిస్తున్నప్పుడు తప్పకుండా ఒత్తిడి ఉంటుంది. కానీ చేయాల్సిన పనిపైనే నేను దృష్టిసారిస్తా. మ్యాచ్‌లప్పుడు సెల్ఫోన్లకు దూరంగా ఉంటా!

మీ బెస్ట్ ఫ్రెండ్స్... ముఖ్యంగా మీ చిన్ననాటి స్నేహితులు ఇప్పటికీ మీకు టచ్‌లో ఉన్నారా?
నా స్కూల్ ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లేంత సమయం ఉండదు. ఫ్రెండ్స్‌తో షికార్లు... బయటకు వెళ్లటాలు... కోల్పోతున్నావని అంటుంటారు... కానీ నాకైతే ఏమీ మిస్ అయ్యానని అన్పించలేదు. ఎందుకంటే బ్యాడ్మింటన్‌ను ప్రాణంగా ఎంచుకున్నా... కాబట్టి! అందులో భాగంగా దేశవిదేశాలు తిరిగేస్తున్నా... అలా ఎంజాయ్ చేస్తున్నా!
చిన్నప్పటి స్నేహితులు చాలామంది మాట్లాడుతూనే ఉంటారు. మెసేజ్‌లు పెడతారు. వారితో బయటకు వెళ్లి సమయం వెచ్చించడం కష్టం కాబట్టి ఎక్కువగా ఫోన్లోనే మాట్లాడతా.
నాతో నేను!

ప్రతి దేశానికో సంస్కృతి ఉంటుంది. పోల్చిచూసుకుంటే తేడాలు చాలా ఉంటాయి. అలాగని భారతీయురాలిగా ఎక్కడా ఇబ్బందులూ ఎదురుకాలేదు. తోటి ఆటగాళ్లు మనతో బాగానే మాట్లాడతారు. నాకైతే ఎక్కడికెళ్లినా మంచి మిత్రులయ్యారు.
*****
అమ్మాయిగా నాకైతే వివక్ష ఎక్కడా కన్పించలేదు. అమ్మాయిలు ఏం చేయలేరు... అబ్బాయిలే చేస్తారనే భావనే రాలేదు.
*****
ప్రత్యర్థి ఎవరైనా నా ఆటతీరు ఏమీ మారదు. వ్యూహం మారుతుందేమోగాని... గెలవాలన్న తపనలో మాత్రం మార్పు ఉండదు. ప్రత్యర్థి బలహీనమైనా... బలమైనా నా ఆటతీరు ఒకేలా ఉంటుంది.
*****
సంప్రదాయం... ఆధునికం రెండూ ఇష్టమే! పరిస్థితులను బట్టి వ్యవహరిస్తా! కాకుంటే... దుస్తులపై ఎక్కువ దృష్టిపెడతా! మంచి డ్రెస్‌లు వేసుకోవటానికి ఇష్టపడతా!
*****
ఏడో తరగతిలో ఉన్నప్పుడు మాకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. బ్యాగులో నుంచి పుస్తకాలన్నీ తీయడమెందుకన్న బద్ధకంతో అన్నీ తీసుకెళ్లా. స్కూలు అయిపోయింది. ఆటలో పడి బ్యాగు చూసుకోలేదు. బ్యాగ్‌తో పాటు పుస్తకాలన్నీ పోయాయి. దాంతో అమ్మానాన్న నా నోట్సులు మొత్తం రాశారు.

పుస్తకాలు అస్సలు చదవను. కానీ పేపర్ చదువుతా! వసుంధర చదువుతా! సినిమాలు చూస్తా.
*****
అకాడమీలకు వస్తేనే మంచి ఆటగాళ్లవుతారని ఏమీ లేదు. వ్యక్తిగతంగా మనం ఎంతగా తపిస్తాం, ఎంతగా కష్టపడతామనేది కూడా ఛాంపియన్లను తయారు చేయటంలో కీలకం. అదుంటే అకాడమీలు మనల్ని తీర్చిదిద్దుతాయి.
|