సమాజంలో ఎవరైనా ఓ వ్యక్తికి కాస్త గుర్తింపు లభిస్తే చాలు వాళ్ల పేరును ఉపయోగించుకొని లబ్ధి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. ఆ వ్యక్తితో తమకు ఎలాంటి పరిచయం లేకపోయినా.. ఫలానా వ్యక్తి మాకు బాగా తెలుసంటూ తమ సొంత పనుల కోసం ఆ పేరును వాడుకుంటుంటారు. అంతేకాదు, సమాజంలో పేరున్న వ్యక్తులు, సంస్థల పేర్లు చెప్పుకొని అమాయక ప్రజల దగ్గర డబ్బులు లాగే వాళ్ల గురించి మనం తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్లు చేసే పనుల వల్ల ప్రముఖులు సమాజంలో తమకున్న మంచి పేరును కోల్పోతుంటారు. అయితే పర్యావరణ పరిరక్షణకై పోరాటం చేస్తోన్న ప్రముఖ సామాజికవేత్త గ్రెటా థన్బర్గ్కి కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యే ఎదురైంది. దీనికి తానో చక్కటి పరిష్కార మార్గం ఆలోచించింది. తన పేరుతో, తను చేస్తోన్న ఉద్యమం పేరుతో ఎలాంటి మోసాలు జరగకుండా వాటిపై పేటెంట్ హక్కులు తీసుకోవాలని నిర్ణయించుకుందీ 17 ఏళ్ల ఉద్యమకారిణి.

రెండేళ్ల క్రితం మొదలైంది!
గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో వస్తోన్న మార్పులు.. మొదలైన సమస్యల గురించి ప్రపంచ దేశాల నాయకులు చర్చలు జరిపి వీలైనంత త్వరగా పరిష్కార మార్గాలను అమలు చేయాలని గ్రెటా ఉద్యమం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2018, ఆగస్ట్‌లో స్వీడిష్ పార్లమెంట్ ఎదుట ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్’ పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టిందీ బ్రేవ్ గర్ల్. ఈ ఉద్యమాన్ని ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’, ‘యూత్ ఫర్ క్లైమేట్, క్లైమేట్ స్ట్రైక్’, ‘యూత్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ పేర్లతో విశ్వవ్యాప్తం చేసింది గ్రెటా. ఈ సమస్యను పరిష్కరించే వరకు తాను బడికి వెళ్లకుండా ఇలాగే స్ట్రైక్ చేస్తానని గ్రెటా తెలిపింది. స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్ ఉద్యమానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు లభించింది. పర్యావరణాన్ని రక్షించడం కోసం గ్రెటా చేస్తోన్న ఈ పోరాటానికి భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఈ పోరాటంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది విద్యార్థులు, పెద్దలు ముందుకొచ్చారు.
అయితే కొంతమంది మాత్రం ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ ది క్లైమేట్’ పోరాటాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ.. ఈ ఉద్యమంపై ప్రజలకున్న నమ్మకాన్ని నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇలాంటి చర్యలకు చెక్ పెట్టేందుకు గ్రెటా తన పేరును, తను మొదలుపెట్టిన పోరాటం పేరును చట్టబద్ధంగా రిజిస్టర్ చేసుకొని ట్రేడ్‌మార్కు పొందేందుకు దరఖాస్తు చేసుకుంది.
ఈ నిర్ణయం వెనుక కారణాలివే!
ఈ విషయాన్ని గ్రెటా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తను ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మూడు బలమైన కారణాలున్నాయని తెలిపింది. అవేంటో తన మాటల్లోనే చూడండి..
1. వాళ్లను నమ్మకండి..!
ప్రముఖులు, రాజకీయనేతలు, మీడియా, కళాకారులు.. మొదలైన వారితో సంభాషించేందుకు నా పేరును వాడే వాళ్లు లేదా నా ప్రతినిధులమని చెప్పే వాళ్లు దురదృష్టవశాత్తు ఈ సమాజంలో ఇంకా ఉన్నారు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. నా పేరుతో లేదా నా ప్రతినిధులమని ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే ముందు వాళ్ల గురించి పూర్తిగా ఆరా తీయండి. అలాంటి వారి చేతిలో ఇప్పటివరకు ఎవరైనా మోసపోయుంటే వాళ్లకు క్షమాపణలు తెలియజేస్తున్నాను.
2. అందుకే ఆ పేర్లను రిజిస్టర్ చేశా..!
నా పేరుతో పాటు #FridaysforFuture ఉద్యమం పేరును కొంతమంది తమ వాణిజ్య అవసరాలు, ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. నా ప్రమేయం లేకుండా ఈ పేర్లతో మార్కెటింగ్ చేయడం, తమ బ్రాండ్ వస్తువులను విక్రయించడం, విరాళాలు సేకరించడం.. మొదలైనవి చేస్తున్నారు. అందుకే నా పేరును, Fridays for Future, Skolsrejk for klimatet (స్వీడిష్‌లో స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్).. మొదలైన పేర్లను ట్రేడ్మార్కులుగా రిజిస్టర్ చేసేందుకు దరఖాస్తు చేశాను. ఈ ఉద్యమం తప్పుదోవ పట్టకుండా కాపాడడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా..! దీనివల్ల ఎవరైనా నా పేరును కానీ, ఈ ఉద్యమం పేరును కానీ తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముంటుంది.
నాకు కానీ, నాతో పాటు ఈ ఉద్యమంలో పాల్గొంటున్న తోటి ఉద్యమకారులకు కానీ.. ఈ ట్రేడ్మార్కులపై ఎలాంటి ఆసక్తీ లేకపోయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ‘ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్’ ఉద్యమాన్ని నేనే మొదలుపెట్టాను. ఇందులో పాల్గొనే వాళ్లందరికీ.. ముఖ్యంగా ఈతరం వారికి ఇది సొంతం. అంతేకానీ, సొంత ప్రయోజనాల కోసం దీనిని వాడడడానికి వీలు లేదు..!
3. అందుకే ఫౌండేషన్‌ను స్థాపించా..!
నేను, నా కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫౌండేషన్‌ను ప్రారంభించే పనిలో ఉన్నాను. ఇప్పటికే దీనిని రిజిస్టర్ చేసుకున్నాం.. కానీ, దీని కార్యకలాపాలు ఇంకా పూర్తిస్థాయిలో మొదలు కాలేదు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ.. అందులో ఎలాంటి అనుమానాలూ లేవు. మా ఉద్యమాన్ని ప్రోత్సహించే క్రమంలో వచ్చే విరాళాలు, ప్రైజ్ మనీ రూపాల్లో వచ్చిన డబ్బును పారదర్శకంగా ఖర్చు చేసేందుకే దీనిని స్థాపించాం. ఈ ఫౌండేషన్ కార్యకలాపాలు పూర్తిగా మొదలయ్యాక దీని గురించి మరిన్ని వివరాలను మీతో పంచుకుంటాను. పర్యావరణం, వాతావరణం, సమాజానికి మేలు చేసే పనులతో పాటు.. మానసిక ఆరోగ్యం గురించి ప్రచారం చేయడమే ఈ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యం.
ప్రస్తుతం గ్రెటా చేస్తోన్న ‘స్కూల్ స్ట్రైక్ ఫర్ క్లైమేట్’ పోరాటం 76వ వారానికి చేరుకుంది. సామాన్యులతో పాటు వివిధ దేశాలకు చెందిన రాజకీయనేతలు, సినిమా స్టార్లు సైతం తన ఉద్యమానికి మద్దతు తెలుపుతుండడం విశేషం.
Photos: Instagram.com/gretathunberg