ఏ సంస్థ అయినా ఉద్యోగస్థుల కోసమో, వ్యాపారంలో భాగస్వామ్యం కోసమో అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడం చూశాం. ఆఖరికి మంచి వరుడికి ఫలానా అర్హతలున్న మంచి వధువు కావలెననో లేదా చక్కనైన వధువుకు ఈ అర్హతలున్న వరుడు కావలెననో... ఇలాంటి ప్రకటనలను కూడా చూశాం. కానీ తనకో ప్రేయసి కావాలని దరఖాస్తులను ఆహ్వానించిన వ్యక్తిని మీరెప్పుడైనా చూశారా ? అసలు ఇటువంటి వార్తలను విన్నారా ? అది కూడా చంద్రమండలంపై అతడు చేయబోయే యాత్ర కోసం అంటే నమ్ముతారా ? నిస్సందేహంగా నమ్మమనే అంటారు ఎవరైనా కూడా ! అయితే నమ్మితీరాలి... ఎందుకంటే ఇది అల్లాటప్పా వ్యక్తి చేసిన పని కాదు. ఓ జపాన్ బిలియనీరు చేసిన పని. అందుకు జపాన్ మీడియా కూడా అతడికి సహకరిస్తోంది. ఇప్పటికే 28,000 మంది యువతులు అతగాడి లవర్‌గా ఉండేందుకు సిద్ధమని తమ దరఖాస్తులను కూడా పంపారట. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ ! అయితే విషయంలోకి వెళ్లాల్సిందే మరి !
2023లో చంద్రమండల ప్రయాణం !
జపాన్‌కు చెందిన చాలామంది బిలియనీర్లలో యుసాకు మెజావా ఒకరు. అయితే మిగతా బిలియనీర్లకి భిన్నంగా తన వింత చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడీయన. ఈక్రమంలోనే తాను చేయబోయే చంద్రమండల యాత్రకు తనకో ప్రేయసి కావాలని ట్వీట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా చాలామంది నోరెళ్లబెట్టేలా చేశాడు. చంద్రమండల యాత్రా ? ఇది జరిగేనా ? అని ఆశ్చర్యపోకండి. ఇతగాడు కొన్ని కోట్లు పెట్టి ఆల్రడీ టికెట్లు కూడా కొనేశాడు ! అమ్మింది ఎవరో కాదు, ప్రపంచంలోనే సాంకేతిక రంగంలో గొప్ప వ్యాపారవేత్తగా పేరున్న ఇలాన్ రీవ్ మస్క్ అనే వ్యక్తి.
ఇలాన్ ‘స్పేస్ ఎక్స్’ పేరుతో ఓ సంస్థను స్థాపించి ‘స్పేస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్’కు శ్రీకారం చుట్టాడు. 2050 నాటికి అంగారకుడిపై ఓ నగరాన్ని నిర్మించి తమ రాకెట్ల ద్వారా ఒక మిలియన్ జనాన్ని అక్కడికి పంపించాలనేది ఈ ‘స్పేస్ ఎక్స్’ ధ్యేయం. ఆ.. అలా అనుకుంటే సరిపోద్దా ? అది జరగాలి కదా ? అనుకుంటారేమో ! ఫోర్బ్స్ కూడా ఇలాన్కు ‘ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల’ జాబితాలో 21వ స్థానాన్ని ఇచ్చిందంటే నమ్మితీరాల్సిందే మరి ! ఈక్రమంలోనే కొంతమంది ప్రపంచ మేటి శాస్త్రవేత్తల సహాయంతో 2023లో ఈ చంద్రమండల యాత్రను చేపడుతున్నాడట ఇలాన్. అప్పుడు ఈ యాత్రకు వెళ్లే రాకెట్‌కు ‘డియర్ మూన్’ అనే నామకరణం కూడా చేశారని స్థానిక మీడియా తెలిపింది. ఇందులో భాగంగానే ఈ యాత్రకు టికెట్లు కొన్న మొట్టమొదటి వ్యక్తిగా యుసాకు నిలిచాడు. అందుకే దరఖాస్తు చేసుకున్న వారు కూడా అతను తమని చంద్రమండలానికి తప్పక తీసుకెళ్తాడని గట్టిగా నమ్ముతున్నారు.
ఎలా సెలక్ట్ చేస్తారు ?
44 ఏళ్ల యుసాకుకు ప్రేయసిగా ఉండేందుకు దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరు తేదీ ఇటీవలే ముగిసింది. జపాన్‌లోని ఓ మీడియా సంస్థ సహకారంతో నెల క్రితం ‘ఫుల్ మూన్ లవర్స్’ అనే మ్యాచ్‌మేకింగ్ డాక్యుమెంటరీ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించగా... అందులో భాగంగా దాదాపు 28,000 మంది యువతులు తమ దరఖాస్తును పంపారట. అంతేకాదు... తనకు ప్రేయసిగా ఉండాలనుకునేవారు పెళ్లికాని వారై (సింగిల్), 20 ఏళ్లు దాటినవారై ఉండాలి. అలాగే అంతరిక్షంలోకి వెళ్లడానికి ఆసక్తి చూపించాలనే నియమనిబంధనలు కూడా పెట్టాడీ బిజినెస్‌మ్యాన్. యుసాకుకు విడాకులై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిసినా ఇంతమంది అతనికి ప్రేయసిగా ఉండేందుకు దరఖాస్తులను పంపడం విశేషం. ప్రస్తుతం సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగా ఫిబ్రవరిలో ‘మ్యాచ్ మేకింగ్ డేట్స్’, మార్చిలో ‘స్పెషల్ డేట్స్’ అనే ఈవెంట్స్ నిర్వహించి, యుసాకును బాగా చూసుకునే విషయంలో అభ్యర్థులను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇలా ఎంచుకున్న వారిలో తుది విజేతను మార్చిలో వెల్లడిస్తారట.
అతడి ట్వీట్సే సంచలనం !
సాధారణంగా బిలియనీర్ వ్యాపారి అంటే ఎంతో బిజీబిజీగా ఉంటూ ఎప్పుడో ఒకప్పుడు అవసరం వస్తే తప్ప సామాజిక మాధ్యమాల్లో కనిపించరు. కానీ యుసాకు అలా కాదు. తన ట్వీట్స్తోనే సంచలనం సృష్టిస్తాడు. మొదటగా తాను చంద్రమండల యాత్ర చేయబోతున్నానని చెప్పగానే అతని ఫాలోవర్లు అందరూ ఆశ్చర్యపోయారు. వారు తేరుకోకముందే తన యాత్రకు ఓ ప్రేయసి కావాలని ట్వీట్ పెట్టడంతో ఆయన అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారట. అంతలా అతడిని నమ్మాల్సిన అవసరం ఏముంది ? అని ప్రశ్నిస్తారేమో ! యుసాకు అన్నాడంటే చేసేస్తాడని అతగాడి ఫాలోవర్ల నమ్మకం. అందుకు కారణం లేకపోలేదు...
ఈ జనవరి 5 న తన సంస్థ ‘జోజో’ (ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ వెబ్సైట్) సేల్స్‌కు సంబంధించిన విషయాన్ని ట్వీట్ చేసి, దాన్ని తన ఫాలోవర్లు వారి వారి అకౌంట్ల నుంచి రీట్వీట్ చేస్తే ఒక్కొక్కరికీ ‘వన్ మిలియన్ యెన్’.. అంటే అక్షరాలా ఆరు లక్షలపైమాటే ఇస్తానని మాటిచ్చాడు. అంతే... ఇప్పుడతని ట్వీట్ 43,18,704 రీట్వీట్స్తో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రీట్వీట్ చేసిన పోస్ట్‌గా నిలిచింది. అన్నమాట ప్రకారం వారికి డబ్బులిచ్చేయగా అతడి వ్యాపారం కూడా బాగా పెరిగిందట. మరి ఈ ఐడియా ఏదో అదిరిపోయేలా లేదూ ! అందుకే ఇప్పుడు దరఖాస్తు చేసుకున్న అమ్మాయిలు ఎంతో ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఆ 28,000 మంది భామల్లో ఎవరు యుసాకుతో చంద్రమండల ప్రయాణం చేస్తారో... జస్ట్ వెయిట్ అండ్ సీ !