కట్టుబాట్లను కాదని చదువుకుంటోందన్న కారణంతో 13 ఏళ్ల ప్రాయంలోనే తాలిబన్ల తూటాలకు గురైంది మలాలా యూసఫ్ జాయ్. తనలాంటి పరిస్థితి మరే అమ్మాయికీ రాకూడదని బాలికా విద్య, పిల్లల హక్కులపై నిరంతర పోరాటం చేస్తోందీ ధీరవనిత. ఇందులో భాగంగానే ఉగ్రవాద దేశాల్లో ఉన్న శరణార్థుల పిల్లలకు విద్యనందించేందుకు కృషి చేస్తోంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచ వేదికలపై తన గళాన్ని వినిపించే ఈ యూత్ ఐకాన్..అతి పిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కించుకుందీ డేరింగ్ టీనేజర్. ఈ ‘దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్’గా గుర్తింపు పొందిందీ యువకెరటం.

‘డికేడ్ ఇన్ రివ్యూ’ ఆధారంగా..
2012లో తాలిబన్ల తూటాలకు గురైన మలాలా మ్యత్యువుతో పోరాడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బర్మింగ్‌హామ్‌లో నివాసముంటూ.. ప్రపంచవ్యాప్తంగా బాలికా విద్య, పిల్లల హక్కుల కోసం తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో తన కృషికి గుర్తింపుగా పలు అంతర్జాతీయ అవార్డులు, పురస్కారాలు అందుకుందామె. తాజాగా ఐక్యరాజ్యసమితి ఈ దశాబ్దానికి గానూ ‘ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్’గా ఆమెను గుర్తించింది. 2010 నుంచి 2013 వరకు.. ఈ మూడేళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనలను పరిగణనలోకి తీసుకుని ‘డికేడ్ ఇన్ రివ్యూ’ పేరిట ఓ నివేదికను ఐక్యరాజ్య సమితి తాజాగా విడుదల చేసింది. ఇందులో భాగంగా 2010లో భయంకర విధ్వంసాన్ని సృష్టించిన హైతీ భూకంపం, 2011లో మొదలై ఇప్పటివరకు కొనసాగుతోన్న సిరియా అంతర్యుద్ధం, బాలికల విద్య కోసం 2012 నుంచి మలాలా చేస్తున్న కృషి.. వంటి సంఘటనలను ప్రధానాంశాలుగా తీసుకుంది ఐరాస. అదేవిధంగా 2010 నుంచి 2019 మధ్య కాలంలో మలాలాకు వచ్చిన గుర్తింపును సైతం పరిగణనలోకి తీసుకున్న యూఎన్.. ఈ ‘దశాబ్దపు ప్రపంచ ప్రఖ్యాత టీనేజర్’గా ఆమెను గుర్తించడం విశేషం.

ఆమె పట్టుదల ప్రశంసనీయం!
బాలికల చదువుకే తన తొలి ప్రాధాన్యమని చెప్పే మలాలా స్ఫూర్తిని మరింత మందికి అందించాలనే ఉద్దేశంతో యూఎన్ ఆమె పుట్టినరోజైన జులై 12ను ‘మలాలా దినోత్సవం’ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువకెరటం సేవలను మరోసారి గుర్తుకు తెస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ 2012లో మలాలాపై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రకంపనలు సృష్టించింది. ఈ అమానవీయ ఘటనపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అప్పటినుంచే బాలికల విద్యకు తీవ్రంగా కృషిచేస్తోంది మలాలా. ఈనేపథ్యంలో 2012 లో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యునెస్కో ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపింది కూడా. బాలికలందరికీ విద్య ఒక ప్రాథమిక అవసరంగా మారడానికి మలాలా చేసిన కృషి, చూపిన పట్టుదల ప్రశంసనీయం. ఈ విషయంలో ఆమె పోరాటానికి మరింత ప్రాధాన్యమిస్తూ ఆమెను 2017లో శాంతి దూతగా నియమించాం’ అని ఐక్యరాజ్యసమితి తన ప్రకటనలో పేర్కొంది.
2013 నుంచి 2017 వరకు ఎడ్జ్‌బాస్టన్ హైస్కూల్లో ఉన్నత విద్యను అభ్యసించింది మలాలా. ఆమె ప్రస్తుతం లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు చేస్తోంది.
Photos: www.instagram.com/malala